నాదెండ్లకు ఈసారి నియోజకవర్గం లేదా?

జనసేన పార్టీలో నెంబర్ టూ, అధినేత పవన్ కల్యాణ్ కు కళ్లు ముక్కు చెవులు అన్నీ తానే అయి వ్యవహరించే, పార్టీని వాస్తవంగా నడిపించే నాదెండ్ల మనోహర్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడం లేదా?…

జనసేన పార్టీలో నెంబర్ టూ, అధినేత పవన్ కల్యాణ్ కు కళ్లు ముక్కు చెవులు అన్నీ తానే అయి వ్యవహరించే, పార్టీని వాస్తవంగా నడిపించే నాదెండ్ల మనోహర్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడం లేదా? ఆయన పోటీచేయడానికి నియోజకవర్గం లేకుండా పోయిందా? నాదెండ్ల మనోహర్ ఈ ఎన్నికల్లో కేవలం పార్టీ వ్యూహరచనకు మాత్రం పరిమితం అయి.. ఒకవేళ తెలుగుదేశం-జనసేన కూటమి గెలిచి అధికారంలోకి వచ్చినట్లయితే అప్పుడు మంత్రి పదవి పుచ్చుకుని ఎమ్మెల్సీగా సభలో అడుగుపెడతారా? పార్టీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారాన్ని బట్టి ఈ సందేహాలు కలుగుతున్నాయి.

పవన్ కల్యాణ్ తన ఎన్నికల కసరత్తును ప్రారంభించారు. వారాహి యాత్రకు ముహూర్తం డిసైడ్ చేశారు. అదే సమయంలో పొత్తుల్లో ఏయే సీట్లు అడిగి తీసుకోవాలో కూడా కసరత్తు చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన కేవలం తమ పార్టీ కోసం తాను నియమించుకున్న సర్వేసంస్థల మీద మాత్రమే ఆధారపడినట్టుగా తెలుస్తోంది. 

సర్వేల్లో పాజిటివ్ గా, జనసేన గెలుపు గ్యారంటీ అనే నివేదిక వచ్చిన సీట్లను మాత్రమే పొత్తుల్లో భాగంగా తెలుగుదేశాన్ని డిమాండ్ చేయాలని పవన్ కల్యాణ్ అనుకుంటున్నారు. ఒకరకంగా ఇది మంచి స్ట్రాటజీనే. చంద్రబాబు చేయించుకునే సర్వేలు కూడా సరిపోలితే గనుక.. ఆయా సీట్లు ఆయనకు దక్కుతాయి.

అయితే ఈ క్రమంలో నాదెండ్ల మనోహర్ సీటు గల్లంతైనట్టుగా కనిపిస్తోంది. ఆయన గత ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం గుంటూరు జిల్లా తెనాలినుంచి పోటీచేశారు. రెండులక్షల పైచిలుకు ఓట్లు పోలైతే నాదెండ్లకు కనీసం ముప్ఫయి వేలు కూడా రాలేదు. 14శాతంతో మూడోస్థానంలో చతికిలపడ్డారు. ఆ తర్వాత ఈ నాలుగేళ్లలో ఆయన అక్కడ పెంచుకున్న ప్రజాబలం కూడా ఏమీలేదు. 

ఎంతో సీనియర్ నాయకుడు అయి ఉండి కూడా.. పవన్ కల్యాణ్ హవాను, ఇమేజిని వాడుకుని కూడా గెలవలేకపోవడం పలువురిని ఆశ్చర్యపరచింది. అక్కడ వైసీపీ తరఫున అన్నాబత్తుని శివకుమార్ గెలవగా, తెదేపా తరఫున మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ 17వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆలపాటిని పక్కన పెట్టి, గెలిచే అవకాశం లేని నాదెండ్ల కోసం చంద్రబాబునాయుడు తెనాలి సీటును పణంగా పెడతారని అనుకోవడం భ్రమ. 

ఎంపీగా  పోటీచేద్దామంటే ఆయన సొంత నియోజకవర్గం తెనాలి, గుంటూరు ఎంపీ పరిధిలోకి వస్తుంది. అది తెదేపాకు సిటింగ్ సీటు. పొరుగున ఉన్న బాపట్ల ఎస్సీ రిజర్వు. నరసరావుపేట మీద తెదేపాలో ఎందరి కన్ను ఉంటుందో చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో నాదెండ్ల మనోహర్ కు ఈసారి నియోజకవర్గమే లేకుండాపోయింది. 

అయితే పవన్ కల్యాణ్ ఆయనను కేవలం ఎన్నికల వ్యూహాలు చూసుకోవాల్సిందిగా పురమాయించారని, పార్టీ నెగ్గి, తెదేపాతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేస్తే అప్పుడు జనసేన తరఫున నాదెండ్లకు కూడా ఖచ్చితంగా కేబినెట్ చాన్స్ కల్పిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.