మార్కెట్ వడ్డీలకు, సినిమా ఇంట్రెస్టులకు చాలా తేడా ఉంటుంది. మార్కెట్లో 3 రూపాయలు వడ్డీ అంటే కళ్లు తేలేస్తాం. అదే సినిమాల్లో 10 రూపాయల వడ్డీకి కూడా డబ్బులు తెచ్చే నిర్మాతలున్నారు. కోటి, 2 కోట్లు అయితే ఓకే.. వందల కోట్లలో అప్పు తెస్తే ఎలా? అంత అప్పు చేసిన తర్వాత సినిమా తేడా కొడితే ఏంటి పరిస్థితి?
బాహుబలి విషయంలో మేకర్స్ ఆ రిస్క్ తీసుకున్నారు. రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమా కోసం ఏకంగా 400 కోట్ల రూపాయలు అప్పు చేశారట. ఐదున్నర సంవత్సరాల కాలపరిమితికి, 24శాతం వడ్డీ కింద ఇంత భారీ మొత్తాన్ని అప్పుగా తీసుకొచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా అందులో నటించిన రానా బయటపెట్టాడు.
“మూడు-నాలుగేళ్ల కిందట సినిమాలకు డబ్బు ఎక్కడ్నుంచి వచ్చేది. నిర్మాత తన ఇంటి నుంచి తెచ్చేవాడు. లేదంటే బ్యాంకులో ఆస్తి తాకట్టు పెట్టి వడ్డీకి డబ్బు తెచ్చేవాడు. మేం అప్పట్లో 24-28 శాతం వడ్డీ కట్టేవాళ్లం. సినిమాల్లో అప్పులు అలా ఉండేవి. బాహుబలి లాంటి సినిమా 28 శాతం వడ్డీకి, 300 నుంచి 400 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు రాజమౌళి.”
ఇలా బాహుబలి కోసం వందల కోట్ల రూపాయలు అప్పు చేసిన విషయాన్ని బయటపెట్టాడు రానా. పార్ట్-1 చిత్రీకరణ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారట. ఆ టైమ్ లో 24శాతం వడ్డీకి 180 కోట్ల రూపాయలు తెచ్చారట. ఆ డబ్బుతో పార్ట్-2కు సంబంధించి కూడా కొంత చిత్రీకరణ పూర్తిచేశారట.
బాహుబలి-2 కంప్లీట్ అయ్యేసరికి అప్పు 400 కోట్ల రూపాయలకు చేరుకుందని, సినిమా రిజల్ట్ తేడా కొడితే ఏం జరిగి ఉండేదో ఊహించడమే కష్టమయ్యేదని అన్నాడు రానా.
కొన్నాళ్ల కిందట రాజమౌళి కూడా బాహుబలి బడ్జెట్ పై స్పందించాడు. తమపై నమ్మకంతో నిర్మాత భారీ మొత్తం అప్పు తెచ్చి సినిమాలు తీస్తాడని, ఒక్కసారి సినిమా ఫ్లాప్ అయితే అతడు కోలుకోలేని స్థితికి చేరుకుంటాడని అన్నాడు. సినిమా మేకింగ్ లో అన్నింటికంటే కష్టమైంది ఆర్థికంగా రిస్క్ చేయడమే అని తెలిపాడు.