పల్నాడు జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. టీడీపీ నాయకుడు కోడెల శివరామ్ ఆగ్రహం చల్లారకనే, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అధిష్టానంపై ఫైర్ కావడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. టీడీపీ ఇన్‌చార్జ్ ఉండగానే, వారికి పోటీగా మరొక నాయకుడిని లోకేశ్ ప్రోత్సహిస్తుండడం సీనియర్ నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో చిలకలూరిపేటలో గత కొంత కాలంగా భాష్యం ప్రవీణ్ తనకు వ్యతిరేకంగా ఒక వర్గాన్ని కూడగట్టడాన్ని పుల్లారావు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఒక వైపు కోడెల శివరామ్ ఎపిసోడ్ సర్దుమణగకనే, పత్తిపాటి పుల్లారావు అసమ్మతి స్వరం వినిపించడం టీడీపీ అధిష్టానాన్ని ఇబ్బందికి గురి చేస్తోంది. చిలకలూరిపేటలో ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆ నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్న భాష్యం ప్రవీణ్‌ను దృష్టిలో పెట్టుకుని పుల్లారావు ఘాటు వ్యాఖ్యలు చేయడం టీడీపీలో చర్చకు దారి తీసింది. టీడీపీని సీనియర్ నేతలు పట్టించుకోలేదని దుష్ప్రచారం చేస్తూ, చిలకలూరిపేట టికెట్ భాష్యం ప్రవీణ్‌కు అని ప్రచారం చేయడంపై ఆయన విరుచుకుపడ్డారు. ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు.
‘ ఫౌండేషన్లు, ట్రస్టులు పేర్లతో వచ్చే నేతలను ఎంటర్ టైన్ చేస్తే ఎలా ?. అక్కడో రూ. 10 వేలు.. ఇక్కడో రూ. 10 వేలు ఇచ్చి టిక్కెట్లు కావాలంటే ఇచ్చేస్తారా ?. ఇప్పుడేదో రూ. కోటి ఖర్చు పెట్టి హడావుడి చేస్తారు.. ఆ తర్వాత చేతులెత్తేస్తారు. నాలుగేళ్ల పాటు ఈ ఫౌండేషన్, ట్రస్ట్ నేతలు ఏమయ్యారు? ఎన్నికల్లో పోటీ చేయడమంటే మాటలా? ఫౌండేషన్ నేతలు, ట్రస్టు పేర్లతో వచ్చే నేతలు ఎన్నికలు ముందొస్తారు. ఎన్నికలు పూర్తికాగానే వెళ్లిపోతారు. ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికో.. విదేశాల్లో ఎన్ఆర్ఐల దగ్గర షో చేయడానికో ఇలాంటి నేతలు వస్తారు’ అని పుల్లారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భాష్యం ప్రవీణ్‌తో పాటు ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించడంపై అధిష్టానానికి కూడా ఆయన చురకలు అంటించడం గమనార్హం. భాష్యం ప్రవీణ్ లాంటి నేతలకు టికెట్ ఇస్తే ఎలా అని ఆయన పరోక్షంగా చంద్రబాబును నిలదీశారు. ఇటీవల భాష్యం ప్రవీణ్ వివిధ అవసరాల కోసం రెండు దఫాలుగా కోటి రూపాయలు విరాళం ఇవ్వడాన్ని దృష్టిలో పెట్టుకుని పుల్లారావు దెప్పి పొడిచారు.
ప్రవీణ్‌కు అసలు చిలకలూరిపేటలో ఓటే లేదని ఆయన గుర్తు చేయడం గమనార్హం. చిలకలూరిపేటలో చోటు చేసుకుంటున్న పరిణామాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని ఆయన చెప్పారంటే, ఎంతగా డిస్ట్రబ్ అయ్యారో అర్థమవుతోందనే చర్చకు తెరలేచింది.