చిత్రం: నేను స్టూడెంట్ సర్
రేటింగ్: 2/5
తారాగణం: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగర్, ఆటో రాం ప్రసాద్, చరణ్ దీప్, ప్రమోదిని, రవి శివతేజ తదితరులు
కథ: కృష్ణ చైతన్య
సంగీతం: మహతి స్వర సాగర్
కెమెరా: అనిత్
ఎడిటర్: చోటా కె ప్రసాద్
నిర్మాత: సతీష్ వర్మ
దర్శకత్వం: రాఖి ఉప్పలపాటి
విడుదల: జూన్ 2, 2023
ఆ మధ్యన స్వాతిముత్యం తో తెరంగేట్రం చేసిన బెల్లంకొండ గణేష్ ఇప్పుడిలా ఈ చిత్రంతో ముందుకొచ్చాడు. ట్రైలర్ చూస్తే ఇదేదో మర్డర్ మిస్టెరీ అన్నట్తుగా అనిపిస్తుంది. సముద్రఖని లాంటి నటుడుండడం కాస్తంత వెయిటేజ్ కూడా పెంచింది. ఇంతకీ ఇందులో ఏముందో తెలుసుకుందాం.
సుబ్బు (గణేష్) ఒక కాలేజ్ స్టూడెంట్. ఐఫోన్ కొనుక్కోవాలని అతని కల. మొత్తానికి కొనుక్కుంటాడు. ఆ తర్వాత కాలేజీలో రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగితే పోలీసులొస్తారు. అందరి ఫోన్స్ ని సీజ్ చేస్తారు. కానీ అనుకోని పరిస్థితుల్లో పోలీసులు పెట్టిన ట్రే లోంచి సుబ్బు ఐఫోన్ పోతుంది. ఆ ఫోన్ ఆచూకి తెలుసుకోవడం హీరో లక్ష్యం. అందుకుగాను కమీషనర్ (సముద్రఖని) కూతుర్ని (అవంతిక) లైన్లో పెట్టుకుంటే తన ఫోన్ దొరుకుతుందనుకుంటాడు. కానీ ఆ పరిచయం వల్ల అతనొక మర్డర్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.
వినడానికి పేలవంగా ఉన్న ఈ కథని ఎంతో ఉత్కంఠగా కథనం నడిపితే తప్ప పాసవ్వదు. అయితే ఎక్కడ ఎంత మోతాదులో ఏ సన్నివేశం నడపాలి అనేది కీలకం. హీరో తన ఫోన్ ని “బుచ్చిబాబు” అని పేరు పెట్టుకుంటాడు. ఫోన్ పట్ల తనకున్న సోదరప్రేమని చాటుకుంటూ ఉంటాడు. ఆ ట్రాక్ చాలా చిరాకు పెట్టిస్తుంది.
ఇక కథలో మర్డర్ కేస్ వ్యవహారమున్నా ఈ సినిమా మొత్తం నడిచేది బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బు చోరి చేయడమనే అంశం మీద. కథలో ఏ సన్నివేశమూ వృధాగా పోకుండా, ప్రతి షాట్ కి బలమైన లింకుతో నడిస్తే అది ఉత్తమమైన కథనం అనిపించుకుంటుంది. ఇక్కడది లోపించింది.
మొదటి సగం చాలా బోరింగ్ గా ఉంది. హీరో హీరోయిన్స్ మధ్యన సీన్స్ కూడా నిరాశపరుస్తాయి. ఇంటర్వల్ బ్యాంగ్ బాగుంది, మళ్లీ క్లైమాక్స్ పావుగంట కూర్చోపెడుతుంది. ఇది తప్ప మిగిలిన సినిమానంతా చాలా చోట్ల ఓపిగ్గా భరించాలి.
బ్యాంక్ స్కాం అనే కథాంశాన్ని ఎత్తుకోవడం బాగుంది. అయితే కథనాన్ని మరింత బలంగా నడిపి ఉండాల్సింది.
టెక్నికల్ గా చూస్తే సంగీతం కానీ, పాటలు కానీ అస్సలు గుర్తుంచుకునేలా లేవు. సంభాషణలు చాలా వీక్ గా ఉన్నాయి. మొత్తమ్మీద రచన పరంగా ఇది బిలో ఏవరేజ్ అనిపించుకుంటుంది.
బెల్లంకొండ గణేష్ కాలేజ్ స్టూడెంట్ గా పర్ఫెక్ట్ గా సరిపోయినా, అలనాటి భాగ్యశ్రీ కూతురు అవంతికకి అతనికి మధ్యన లవ్ ట్రాక్ నేచరల్ గా లేదు.
కమీషనర్ గా సముద్రఖని నిండుగా సరిపోయాడు. శ్రీకాంత్ అయ్యంగర్, చరణ్ దీప్ వారి వారి పాత్రల్లో బానే జీవించారు. హీరో స్నేహితుడిగా శివతేజ ఓకే.
పాయింట్ బాగున్నా సరిగ్గా రాసుకోక తడబడ్డ చిత్రమిది. బలమైన సీక్వెన్సులు పెట్టకుండా కేవలం ఇంటర్వల్ బ్యాంగ్, క్లైమాక్స్ మీద ఆధారపడిన కథనమిది. ఈ వారం విడుదలైన చిత్రాల్లో ఇది కాస్త మెరుగే అయినా బాగుందని మనస్ఫూర్తిగా రికమెండ్ చేసేలా లేని సినిమా ఈ “నేను స్టూడెంట్ సర్*.
బాటం లైన్: అంత గొప్పగా లేదు సర్