టర్మ్ ముగిసేలోగా మంత్రి అవుతారా?

త్వరలోనే మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకేతాలు ఇవ్వడంతో వైకాపా నాయకుల్లో టెన్షన్ మొదలైంది. ఎవరికీ మంత్రి పదవులు ఊడుతాయో, ఎవరికీ పదవులు దక్కుతాయోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.…

త్వరలోనే మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకేతాలు ఇవ్వడంతో వైకాపా నాయకుల్లో టెన్షన్ మొదలైంది. ఎవరికీ మంత్రి పదవులు ఊడుతాయో, ఎవరికీ పదవులు దక్కుతాయోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సీఎం జగన్ త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని మంత్రులకు చెప్పేశారు. త్యాగాలకు సిద్ధపడాల్సిన సమయం ఆసన్నమైందని కూడా అన్నారు.

ఇప్పుడున్న మంత్రుల్లో చాలామంది మంత్రి పదవులు వదులుకొని  పార్టీ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. మంత్రి పదవుల్లో ఉన్నంత సుఖం, రాబడి, పలుకుబడి, గ్లామర్, ఆధిపత్యం పార్టీ పదవుల్లో ఉండదు కదా. అందుకే చాలామంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆశావాహులు భారీగానే ఉన్నారని జగనే చెప్పాడు. గత ఆరు నెలలుగా మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని, తమకు మంత్రివర్గంలో ఛాన్స్ దొరుకుతుందని చూస్తున్న ఆశావాహులకు జగన్ వ్యాఖ్యలు కొత్త ఉత్సాహం కలిగించేలా చేశాయి.

రాబోయే జూన్ లో మంత్రివర్గంలో మార్పులు చేస్తానని జగన్ క్లారిటీ ఇచ్చేశాడు. ఏదీ ఏమైనా మంత్రివర్గంలో మార్పులు జరగడం ఖాయమని తెలుస్తోంది.. దీంతో పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు వాటిని దక్కించుకోవడానికి రెడీ అయిపోయారు. పదవులు ఆశిస్తున్న మహిళా ఎమ్మెల్యేలు సైతం ఛాన్స్ దక్కించుకోవడానికి చూస్తున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ కేబినెట్ లో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు. 

పుష్పశ్రీ వాణి, మేకతోటి సుచరిత, తానేటి వనిత  ఉన్నారు. మరి వీరి ముగ్గురిలో పదవిలో కొనసాగేది ఎవరు..? మారితే వారి స్థానంలో ఎవరిక అవకాశం ఉంది..? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ అంశం ఆసక్తికరంగా మారింది. సరే … మిగతా వారికి మంత్రి పదవులు వస్తాయా రావా అనే సంగతి పక్కన పెడితే, మాజీ హీరోయిన్, పార్టీలో ఫైర్ బ్రాండ్, టీడీపీ నాయకులను దుమ్ము దులిపేసే నగరి ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి వస్తుందా? రాదా ? అన్నదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయిపొయింది.

పదవులు ఆశిస్తున్నా మిగతా మహిళా ఎమ్మెల్యేలతో పోలిస్తే రోజా పాపులర్ పర్సన్. సెలబ్రిటీ. ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలోనూ పాపులర్. అందుకే ఎప్పుడు మంత్రివర్గ ప్రక్షాళన విషయం చర్చకు వచ్చినా రోజా ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. జగన్ అధికారంలోకి వచ్చినప్పుడే రోజా తప్పనిసరిగా మంత్రివర్గంలో ఉంటుందని అనుకున్నారు. కొందరు మంత్రి వర్గం లిస్టు (ఊహించి తయారు చేసింది ) సోషల్ మీడియాలో పెట్టినప్పుడు రోజాకు హోమ్ మంత్రి ఇస్తారని రాశారు. కానీ సామాజిక సమీకరణాల్లో ఆమె పేరు ఎగిరిపోయింది. దీంతో అలిగి కొన్నాళ్ళు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంది కూడా.

చివరకు జగన్ ఆమెను బుజ్జగించి ఏపీఐఐసీ చైర్పర్సన్ పదవి ఇచ్చాడు. కానీ ఆ పదవిని ఆమె సీరియస్ గా తీసుకోలేదు. పదవి ఏపీలో, ఆమె ఉండేది హైదరాబాదులో. పదవిలో ఉన్నప్పటికీ టీవీ షోలలోనే బిజీగా ఉండేది. రోజా ఇలా జగన్ కు నచ్చలేదని కూడా టాక్ వచ్చింది. చివరకు ఆ పదవి కూడా పోయిందనుకోండి. ఇక తన నియోజకవర్గంలోనే ఆమెకు వైసీపీ నాయకులతో పడకుండా అయింది.

ఈ విషయంలో రోజాకు జగన్ నుంచి అనుకున్నంత సపోర్ట్ రాలేదంటారు. సొంత పార్టీలో అసమ్మతి సెగలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు విపక్ష టీడీపీపై పోరాడుతూనే.. ఇంకోవైపు స్వపక్షంలోనే విపక్షంగా మారిన వారిపైనా మేడమ్‌ ఫైట్‌ చేయక తప్పడం లేదు. పంచాయతీ ఎన్నికల సమయంలో అమ్ములు వర్గంతో.. పరిషత్‌ ఎన్నికల వేళ నగరి నేతలతో.. మున్సిపల్‌ ఎన్నికల వేళ కేజే  కుమార్‌ వర్గంతో రోజాకు తలపోట్లు తప్పలేదు.

నామినేటెడ్‌ పదవుల పందేరంలోనూ అదే రగడ. చివరకు నగరిలో రోజా వర్సెస్‌ లోకల్‌ వైసీపీ లీడర్ల మధ్య గొడవలు డైలీ సీరియల్‌ మాదిరి చర్చకు దారి తీశాయి. ఇంటి పోరు నుంచి బయటపడేందుకు సీఎం జగన్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు ఎమ్మెల్యే రోజా తన బాధలు చెప్పుకున్నా ఫలితం దక్కలేదు.

ఈ నేపథ్యంలో రోజాకు జగన్ మంత్రి పదవి ఇవ్వాలనుకున్నా ఆమె వ్యతిరేకులు అడ్డుపడతారేమోనని అంటున్నారు. వారు జగన్ ను ప్రభావితం చేయవచ్చని చెప్పుకుంటున్నారు. రోజా ఆశ ఫలిస్తుందా? ఈసారీ నిరాశే ఎదురవుతుందా? వైసీపీ టర్మ్ పూర్తయ్యేలోగానైనా మినిష్టర్ గా దర్శనం ఇవ్వగలుగుతుందా?  ఇప్పుడే చెప్పలేం.