యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ పూర్తిగా గల్లంతయ్యింది. ఇందులో పెద్ద ఆశ్చర్యం లేదు కానీ, బీజేపీ వ్యతిరేక పక్షాలకు ప్రజలు అవకాశం ఇచ్చినా, ఆ అవకాశం కాంగ్రెస్ కు మాత్రం దక్కదని పంజాబ్ ఎన్నికలతో స్పష్టత వచ్చింది. పశ్చిమ బెంగాల్ లో మమత నెగ్గారు. పంజాబ్ లో ఆప్ నెగ్గింది. యూపీలో సమాజ్ వాదీ ఎంతో కొంత తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తన స్థానాన్ని ఎక్కడున్నా క్రమంగా కోల్పోతోంది.
ఈ క్రమంలో ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలను ఎదుర్కొననున్న రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి విషమ పరీక్షగా నిలవబోతున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్.. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలూ మరో ఏడాది లోపే జరగాల్సి ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా ఏమీ లేదు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ గా ఈ రాష్ట్రాల అసెంబ్లీ పోరు జరగనుంది.
హిమాచల్ లో గత ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ మెరుగైన పోటీనే ఇచ్చింది. నాలుగు శాతం ఓట్ల తేడా ఉంది ఇరు పార్టీల మధ్యన. అయితే మూడింట రెండు వంతుల సీట్లు మాత్రం బీజేపీకే దక్కాయి. ఇలాంటి నేపథ్యంలో త్వరలో జరగనున్న ఈ రాష్ట్ర ఎన్నికల్లో కనీసం ఉనికిని చాటుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత పరువు నిలుపుకోవచ్చు.
ఇక గుజరాత్ లో భారతీయ జనతా పార్టీని తలదన్నే శక్తి కాంగ్రెస్ కి ఉందని ఇప్పుడు ఎవ్వరూ అనలేరు కానీ, డూ ఆర్ డై గా గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ పోరాడితే అది ఆ పార్టీకి మంచి అవకాశం అవుతుంది. యూపీ మాదిరిగా గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ జీరో రేంజ్ లో ఏమీ లేదు. గుజరాత్ లో బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీనే. మరి ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గనుక కాంగ్రెస్ పార్టీ సంచలన విజయాలను నమోదు చేస్తే… 2024 ఎన్నికల సమయానికి ఆ పార్టీకి బీజేపీ వ్యతిరేక పక్షాల్లో పెద్దన్న స్థానం అయినా దక్కుతుంది. లేకపోతే అంతే సంగతులు చిత్తగించవలెను అన్నట్టుగా మారొచ్చు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.