ఇది ఆధునిక కాలం. ఏ విషయం అయినా కళ్లకు కనిపిస్తే నే నిజం. లేకపోతే ట్రాష్ అనేస్తారు. కరోనా వంటి మహమ్మారి మీద పడి మరణశాసనం రాస్తున్నా కూడా ఇంకా నమ్మని వారు చాలా మంది ఉన్న రోజులు ఇవి. అలాంటి ఈ రోజుల్లో కూడా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే ఏమో ఎవరి నమ్మకాలు వారిని అనుకోవాల్సిందే.
ఇంతకీ విషయం ఏంటి అంటే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్య్స్య శాఖ మంత్రి సీదరి అప్పలరాజుకు మంత్రి పదవి పూర్తి కాలం ఉండాలని ఆయన అభిమానులు అనుచరులు ఆశపడుతున్నారు. గట్టిగా రెండేళ్ళు కూడా కాకుండానే తమ నేత మాజీ మంత్రి కావడం అంటే వారు తట్టుకోలేకపోతున్నారు.
ఇంకో వైపు మంత్రి వర్గ విస్తరణ తొందరలో ఉంటుందని వైసీపీ హై కమాండ్ హింట్ ఇచ్చేసింది. దాంతో సీదరికి పదవీ గండం ఉందేమో అని ఆయన అనుచరులు అంతా తెగ కలవరపడుతున్నారు. ఈ నేపధ్యంలో వారు అమరావతి నుంచి అలా తమ మంత్రి ఇలా పలాసా రావడంతోనే ఘనస్వాగతం పలుకుతూనే ఏకంగా దిష్టి కూడా తీసేశారు.
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి సొంత పార్టీ వారి దిష్టి బయట పార్టీ వారి దిష్టి నర మానవుడి దిష్టి ఏదీ కూడా మా సీదరి అన్నకు తగలకూడదంటూ వారు చాలానే మొక్కేశారు. శునకాల పేరుతో గుమ్మడి కాయలను దిష్టి తీసి పారేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మినిస్టర్ సీదరికి ఏ విధంగానూ చెడు జరగకూడదని కూడా గట్టిగా కోరుకున్నారు.
ఇవన్నీ సరే కానీ మంత్రి వర్గ విస్తరణలో పాత వారిని తీసేసి పక్కన పెట్టాలని వైసీపీ పెద్దలు అనుకున్నపుడు ఈ దిష్టి తీతలు ఎంతవరకూ పనిచేస్తాయన్నదే ప్రశ్న. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో సీదరి మాస్టార్ మాజీ అయితే సొంత పార్టీ వారిని తప్పు పడతారా. లేక బయట వారి మీద గుడ్లుమురుతారా. ఏమో ఈ దిష్టి తీత మాత్రం తెగ వైరల్ అవుతోంది.