బాలీవుడ్ అలనాటి స్టార్ హీరో శత్రుఘ్నసిన్హా బెంగాల్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. ఇది వరకూ సొంత రాష్ట్రం బిహార్ నుంచి ప్రాతినిధ్యం వహించి, బీజేపీ తరఫున కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించిన షాట్ గన్ ఆ తర్వాత ఆ పార్టీకి దూరం అయ్యాడు. కాంగ్రెస్ చేరువ అయ్యాడు. అయితే కాంగ్రెస్ తరఫున రాజకీయ శక్తి చాటలేకపోయాడు శత్రుఘ్న.
ఈ క్రమంలో ఆ పార్టీకి కూడా దూరం అయ్యి, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి ఆయన ఎన్నికల పోటీకి సిద్ధం అయ్యారు. బీజేపీ నేతగా వ్యవహరించిన బాబుల్ సుప్రియో రాజీనామాతో బెంగాల్ లోని అసన్ సోల్ లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. అక్కడ నుంచి శత్రు ను తమ అభ్యర్థిగా ప్రకటించారు టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.
బాబుల్ సుప్రియోను విధాన సభకు పోటీ చేయిస్తూ శత్రుఘ్నను లోక్ సభ బరిలోకి దించుతున్నట్టుగా మమతా బెనర్జీ ప్రకటించారు. బీజేపీలో మోడీ, షాల పొడ గిట్టక ఆ పార్టీకి దూరం అయిన శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ ద్వారా మళ్లీ లోక్ సభలోకి ఎంటర్ కాలేకపోయారు.
ఈ క్రమంలో మమత బెనర్జీ శత్రుఘ్నకు మరో అవకాశం ఇచ్చింది. బెంగాల్ నుంచి శత్రును లోక్ సభకు పంపితే.. మోడీ, షా లను మమత మరింత ఉడికించినట్టుగా కావడం ఖాయం.