ఆప్ త‌దుప‌రి టార్గెట్ ఆ రాష్ట్ర‌మే!

ఢిల్లీ చుట్టుప‌క్క‌ల రాష్ట్రాలు ఆప్ కు అనువుగా క‌నిపిస్తున్నాయి. ఢిల్లీలో వ‌ర‌స‌గా రెండు సార్లు సంచ‌ల‌న విజ‌యాల‌ను న‌మోదు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ దేశ రాజ‌ధానికి ఆనుకుని ఉన్న పంజాబ్ లో స‌త్తా…

ఢిల్లీ చుట్టుప‌క్క‌ల రాష్ట్రాలు ఆప్ కు అనువుగా క‌నిపిస్తున్నాయి. ఢిల్లీలో వ‌ర‌స‌గా రెండు సార్లు సంచ‌ల‌న విజ‌యాల‌ను న‌మోదు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ దేశ రాజ‌ధానికి ఆనుకుని ఉన్న పంజాబ్ లో స‌త్తా చూపించింది. సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

ఒకే త‌ర‌హా రాజ‌కీయ స్థితి ఉన్న ప్రాంతాల్లో ఈ విజ‌యాలు న‌మోదు చేయ‌గ‌లిగింది ఆప్ అని అనుకోవాలి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆప్ ఉనికి పంజాబీ క‌ల్చ‌ర్ ప్ర‌భావిత ప్రాంతంలోనే గ‌ట్టిగా క‌నిపిస్తూ ఉంది. ఉత్త‌రాదిన కానీ, ద‌క్షిణాదిన కానీ ఆప్ ఇప్ప‌టి వ‌ర‌కూ చెప్పుకోద‌గిన విజ‌యాల‌ను ఏమీ న‌మోదు చేయ‌లేదు.

ఢిల్లీ, ఆ పై పంజాబ్.. ఇంకా క‌ష్ట‌ప‌డితే హ‌ర్యానా వంటి రాష్ట్రాలు ఆప్ కు అధికారాన్ని అందుకోవ‌డానికి అవ‌కాశం ఉన్న ప్రాంతాలు. ఇది వ‌ర‌కే క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బెంగ‌ళూరులో, తెలంగాణ‌లోని హైద‌రాబాద్ లో ఆప్ అభ్య‌ర్థులు రంగంలోకి దిగినా.. డిపాజిట్ కూడా సాధించ‌లేక‌పోయారనే విష‌యాన్ని మ‌ర‌వలేరు ఎవ‌రూ.

ఆప్ ఎద‌గాలంటే అక్క‌డ ప‌ట్ట‌ణ‌, న‌గ‌ర వాతావ‌ర‌ణం ఉంటే స‌రిపోదు అని క‌చ్చితంగా చెప్పొచ్చు. పంజాబీ క‌ల్చ‌ర్ ఉన్న ప్రాంతాల్లోనే ఇప్ప‌టి వ‌ర‌కూ ఆప్ ఉనికిని చాటుకుటోంది. గోవాలో కూడా ఆప్ గ‌ట్టిగానే శ్ర‌మించింది. అయితే అక్క‌డ కాంగ్రెస్ కు కూడా ప్ర‌త్యామ్నాయంగా నిల‌వ‌లేక‌పోయింద‌నేది వాస్త‌వం. మ‌రి ఆప్ జాతీయ పార్టీగా ఎద‌గ‌డం గురించి మ‌రో అవ‌కాశం క‌మ్ ప‌రీక్ష త్వ‌ర‌లోనే ఎదురుకానుంది.

అదే హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌. ఢిల్లీకి స‌మీప ప్రాంతంలోనే ఉన్న హిమాచ‌ల్ పై ఇప్పుడు ఆప్ దృష్టి పెట్టింది. అక్క‌డ అర‌వై ఎనిమిది అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. వీట‌న్నింటిలోనూ పోటీ చేయాల‌ని ఆప్ నిర్ణ‌యించింది. హిమాచ‌ల్ లో ఇప్ప‌టి వ‌ర‌కూ బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ రాజ‌కీయ పోరాటం జ‌రిగింది.

ఇప్పుడు పంజాబ్ విజ‌యం ఉత్సాహంలో హిమాచ‌ల్ లో ఆప్ స‌త్తా చాటాల‌ని ఉబ‌లాట‌ప‌డుతోంది.  అంతే కాదు.. ఆప్ ఎదుగుద‌ల‌కు ఇది పరీక్ష కూడా. దీంతో పాటు గుజ‌రాత్ లో కూడా ఆప్ ఉనికిని చాటుకుంటే.. జాతీయ పార్టీగా బీజేపీ ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎద‌గ‌డంలో ఆప్ కీల‌క అడుగులు వేస్తున్న‌ట్టే!