బీజేపీలో ఉంటూ టీడీపీ కోసం పని చేసే నాయకులు పెరిగిపోతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రిస్టియానిటీ, ఇతర కారణాలేవైనా ఆయనంటే గిట్టని నాయకులు బీజేపీలో ఎక్కువే. టీడీపీ అసైన్ చేసినట్టుగా… ఉద్యోగం చేస్తున్న చందంగా ఒక్కో బీజేపీ నాయకుడు ఒక్కో రోజు తెరపైకి వస్తూ వైసీపీకి ఓట్లు వేయొద్దని చెబుతుండడం చర్చనీయాంశమైంది.
దేశమంతా బీజేపీ విస్తరిస్తున్నా, ఒక్క ఏపీలో మాత్రం డిపాజిట్లు కూడా ఎందుకు దక్కడం లేదో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నాయకుల వల్లే ఏపీలో బీజేపీ పుట్టిమునిగేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ బీజేపీలో సొంత పార్టీ కోసం కంటే, టీడీపీ అధికారంలోకి రావాలని పనిచేసే వాళ్లే ఎక్కువ. ఈ కోవలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు చేరుతారు. ఎప్పుడేం మాట్లాడ్తారో విష్ణుకుమార్ రాజుకే తెలియదని అంటుంటారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్‌రెడ్డి ప్రభుత్వం దోపిడీ చేస్తోందని మండిపడ్డారు.
భవిష్యత్ బాగుపడాలంటే ప్రజలు వైసీపీకి ఓటు వేయొద్దని ఆయన పిలుపినివ్వడం గమనార్హం. ఇలాంటి దుర్మార్గమైన ప్రభు త్వాన్ని ఇంత వరకు ఎక్కడా చూడలేదని ఘాటు విమర్శలు చేశారు. గతంలో టీడీపీతో కలిసి పాలన సాగించిన బీజేపీ… 2019 ఎన్నికల్లో ఎందుకు మట్టికొట్టుకు పోయిందో అంతరాత్మను ప్రశ్నించుకున్న పాపాన పోలేదు.
ఇంతకూ తమ పార్టీకి ఓట్లు వేయాలని అడగడం కంటే జగన్‌ను ఓడించాలనే తపన ఆయనలో ఎక్కువ కనిపిస్తోంది. ఎప్పుడూ జగన్‌పై ఏడ్వడమే తప్ప పార్టీని బలోపేతం చేయడంపై ఎప్పుడు దృష్టి పెడతారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రసన్నం కోసం అడ్డమైన విమర్శలు చేయడం మాని, సొంత పార్టీని చక్కదిద్దుకోవడంపై దృష్టి పెట్టాలని నెటిజన్లు హితవు చెబుతున్నారు.