బండ్ల గణేష్… టాలీవుడ్ అగ్రహీరో, జనసేనాని పవన్‌కల్యాణ్‌కు వీరభక్తుడు. కమెడియన్‌గా, నిర్మాతగా గుర్తింపు ఉన్నాయి. ఇటీవల కాలంలో వెండితెరపై కంటే, సామాజిక తెరపై బాగా నటిస్తున్నారనే పేరు తెచ్చుకున్నారు. రియల్ లైఫ్‌లో కామెడీ పండించడంలో బండ్ల తర్వాతే ఎవరైనా.
పవన్ కల్యాణ్ సినిమా వేడుకల్లో పూనకం వచ్చిన వాడి మాదిరిగా ఊగిపోవడం చూస్తుంటాం. తెలంగాణ బిడ్డ అయిన ఈయనకు రాజకీయాలంటే ఆసక్తి. చట్టసభల్లో అడుగు పెట్టాలని కోరిక. గతంలో తెలంగాణ కాంగ్రెస్‌లో చేరి కామెడీ పంచారు. 2018లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లేడ్‌తో గొంతు కోసుకుంటానని ప్రకటించి సంచలనం సృష్టించారు.
అప్పటి నుంచి ఆయన ఇంటి పేరు బండ్ల బదులు బ్లేడ్ అయ్యింది. మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మీడియా బండ్ల గణేష్ కోసం వెతికింది. కొంత కాలం ఆయన కనిపించలేదు. ఆ తర్వాత ఏదో మాట వరుసకు అంటే గొంతు కోసుకోమని అడుగుతారా? అని నిష్టూరమాడారు. తర్వాత కాలంలో రాజకీయాలకు స్వస్తి చెప్పి సినిమా పనుల్లో బిజీ అయ్యారు.
కానీ పవన్‌కల్యాణ్‌పై మాత్రం అభిమానాన్ని ప్రదర్శించడంలో ఎప్పుడూ వెనుకాడలేదు. తాజాగా మరోసారి ఆయన రాజకీయపరమైన అంశానికి సంబంధించి ట్వీట్ చేయడం జనసేన కార్యకర్తల్ని మెప్పించింది. ఈ నెల 14న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. ఈ సభను విజయవంతం చేసేందుకు జనసైనికులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. అలాంటి వారికి బండ్ల గణేష్ ట్వీట్ ప్రోత్సాహకరంగా ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ట్వీట్ ఏంటో చూద్దాం.
“వీరులారా ధీరులారా, జన సేన సైనికులారా !! రండి కదలి రండి కడలి అలగా తరలి రండి. నేను కూడా వస్తున్నాను. మన దేవర నిజాయతీకి సాక్షిగా నిలబడడం కోసం, తెలుగు వాణి వాడి వేడి నాడి వినిపించడం కోసం, అమరావతి నించి హస్తిన దాకా అలజడి పుట్టించడం కోసం కలుద్దాం. కలిసి పోరాడదాం” అని బండ్ల గణేష్ పిలుపునిచ్చారు.