బోయపాటి తిట్టాడు.. రావిపూడి వెనకేసుకొచ్చాడు

స్కంద సినిమాలో తమన్ వర్క్ పై వచ్చిన విమర్శలు అన్నీఇన్నీ కావు. సౌండ్ సిస్టమ్ దెబ్బతింటోందని ఎగ్జిబిటర్లు ఆరోపించారు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగాలేదని క్రిటిక్స్ రాసుకొచ్చారు. ఒక దశలో స్వయంగా దర్శకుడు బోయపాటి…

స్కంద సినిమాలో తమన్ వర్క్ పై వచ్చిన విమర్శలు అన్నీఇన్నీ కావు. సౌండ్ సిస్టమ్ దెబ్బతింటోందని ఎగ్జిబిటర్లు ఆరోపించారు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగాలేదని క్రిటిక్స్ రాసుకొచ్చారు. ఒక దశలో స్వయంగా దర్శకుడు బోయపాటి కూడా తమన్ వర్క్ పై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండా చూసినా, తను తీసిన సన్నివేశాలు బాగా ఉన్నాయని అన్నారు.

దీంతో బోయపాటి Vs తమన్ అంటూ చాలా కథనాలు వచ్చాయి. అదే టైమ్ లో బ్రో.. ఐ డోంట్ కేర్ అంటూ తమన్ నర్మగర్బంగా కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఇప్పుడీ మొత్తం వ్యవహారంపై మరో దర్శకుడు అనీల్ రావిపూడి స్పందించారు. బోయపాటి, తమన్ ను విమర్శిస్తే, రావిపూడి పూర్తిస్థాయిలో తమన్ ను వెనకేసుకొచ్చారు.

“ఏ టెక్నీషియన్ అయినా సినిమా కంటెంట్ ఆధారంగానే పనిచేస్తాడు. చెడగొట్టాలని ఎవ్వరూ పనిచేయరు. ఒక్కోసారి బాగా కనెక్ట్ అయి అద్భుతంగా కొట్టొచ్చు. ఒక్కోసారి కంటెంట్ కనెక్ట్ కాకపోతే యావరేజ్ మ్యూజిక్ కొట్టొచ్చు. క్రియేటివిటీ అనేది కూర్చొని కామెంట్ చేసేంత ఈజీ కాదు. కామెంట్ చేయడం ఈజీ, క్రియేట్ చేయడం కష్టం. ఎవరైనా ఈ విషయం అర్థం చేసుకోవాలి.”

భగవంత్ కేసరి వరకు తమన్ మనసుపెట్టి పనిచేస్తున్నాడని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం సెపరేట్ గా సౌండ్ డిజైన్ చేస్తున్నాడని తెలిపారు అనిల్ రావిపూడి. తమన్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేస్తున్న ఈ దర్శకుడు.. క్వాలిటీ కావాలంటే వెయిట్ చేయాలంటున్నారు.

” సినిమా కంటెంట్ చాలా బాగుంది డార్లింగ్, చాలా మంచిగా కొడతాను, నన్ను వదిలేసెయ్ అన్నాడు తమన్. నేను అతడ్ని వదిలేశాను. ఇప్పుడు ప్రతి రీల్ రీ-రికార్డింగ్ చూసి, తమన్ ను హగ్ చేసుకొని బయటకొస్తున్నాను. ఇక పాటల విషయానికొస్తే.. పాట అడిగినప్పుడు వెంటనే ఇవ్వడని అంటారు. అద్భుతమైన పాట కావాలంటే వెయిట్ చేయాలి కదా, నేను అలానే వెయిట్ చేశాను. కావాలని లేట్ చేసినట్టు నాకు అనిపించలేదు. మిగతా వాళ్ల కంప్లయింట్స్ గురించి నాకు తెలియదు.”

ఇలా తమన్ ను పూర్తిస్థాయిలో వెనకేసుకొచ్చాడు ఈ దర్శకుడు. భగవంత్ కేసరికి సంబంధించి మరో 2 పాటలు ఇంకా రిలీజ్ చేయలేదని, అందులో ఓ అమ్మపాట కూడా ఉందని, ఆ పాట తమన్ వర్క్ గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తుందని అంటున్నారు అనీల్ రావిపూడి.