నాడు కోడెల‌…నేడు ఆయ‌న కొడుక్కి అదే అవ‌మానం!

మాజీ స్పీక‌ర్, దివంగ‌త కోడెల శివ‌ప్ర‌సాద్‌రావుకు నాడు చంద్ర‌బాబు చేతిలో జ‌రిగిన అవ‌మాన‌మే, నేడు ఆయ‌న కుమారుడికి కూడా ఎదురైంద‌న్న చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా మాజీ మంత్రి…

మాజీ స్పీక‌ర్, దివంగ‌త కోడెల శివ‌ప్ర‌సాద్‌రావుకు నాడు చంద్ర‌బాబు చేతిలో జ‌రిగిన అవ‌మాన‌మే, నేడు ఆయ‌న కుమారుడికి కూడా ఎదురైంద‌న్న చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను చంద్ర‌బాబు నియ‌మించారు. ఈ నేప‌థ్యంలో స‌త్తెన‌ప‌ల్లి టీడీపీలో నెల‌కున్న విభేదాలు ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నాయి. త‌న‌ను కాద‌ని క‌న్నాకు ఇన్‌చార్జ్ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంపై కోడెల శివ‌ప్రసాద్ త‌న‌యుడు శివ‌రాం తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.

డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌రావు మరణానంతరం సత్తెనపల్లిలో టీడీపీకి ఇన్‌చార్జ్ లేరు. స‌త్తెన‌ప‌ల్లి టికెట్‌ను కోడెల తనయుడు శివరామ్‌, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, అబ్బూరు మల్లి, నాగోతు శౌరయ్య ఆశిస్తున్నారు. వీళ్లెవ‌రికీ కాద‌ని, పార్టీలోకి కొత్త‌గా వ‌చ్చిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వైపు చంద్ర‌బాబు మొగ్గు చూపారు. ఇది టీడీపీలో ర‌చ్చకు దారి తీసింది. ఇక క‌న్నాకే టికెట్ అని ప‌రోక్షంగా చంద్ర‌బాబు సంకేతాలు ఇవ్వ‌డంతో కోడెల శివ‌రాం గ‌త కొంత‌కాలంగా త‌న‌కు జ‌రుగుతున్న అవ‌మానాల్ని చెప్పుకొచ్చారు.  

మ‌హానాడులో క‌నీసం త‌న తండ్రికి నివాళి కూడా అర్పించ‌లేద‌ని భావోద్వేగానికి గుర‌య్యారు. టీడీపీ కోసం త‌న కుటుంబం త్యాగం చేసింద‌ని ఆయ‌న అన్నారు. గుంటూరు జిల్లాలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌తో త‌న తండ్రి కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు రాజ‌కీయ పోరాటం చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. గ‌తంలో కాంగ్రెస్‌లో కీల‌క నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రించిన క‌న్నా…. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎంతో మంది టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై కేసులు పెట్టి వేధించార‌ని వాపోయారు.

కేవ‌లం టికెట్ కోసం రోజుకొక పార్టీ మారే క‌న్నాను స‌త్తెన‌ప‌ల్లి ఇన్‌చార్జ్‌గా నియ‌మించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. త‌మ గోడును వెళ్ల‌బోసుకునేందుకు మూడేళ్లుగా ఐదునిమిషాలు అపాయింట్‌మెంట్ ఇవ్వాల‌ని చంద్ర‌బాబును కోరుతున్నా ఆయ‌న ప‌ట్టించుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స‌త్తెన‌ప‌ల్లి ఇన్‌చార్జ్‌, టికెట్ విష‌యాల్ని ప‌క్క‌న పెడితే, క‌నీసం త‌మ మాట విన‌డానికి కూడా చంద్ర‌బాబు ఆస‌క్తి చూప‌క‌పోవ‌డం ఏంట‌ని ఆయ‌న నిలదీశారు.

గ‌తంలో కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు త‌న‌యుడు శివ‌రాం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం అక్ర‌మ సంపాద‌న‌కు పాల్ప‌డ్డార‌ని, వారి వల్లే గుంటూరు జిల్లాలో టీడీపీ ఘోర ప‌రాజ‌యానికి కార‌ణ‌మైంద‌ని చంద్ర‌బాబు ఆగ్ర‌హంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. 

టీడీపీ ఓడిపోయిన త‌ర్వాత చంద్ర‌బాబును క‌లిసేందుకు కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు అపాయింట్‌మెంట్ అడిగినా చంద్ర‌బాబు ప‌ట్టించుకోలేద‌ని, ఆ అవ‌మానాన్ని భ‌రించ‌లేకే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న కుమారుడు కూడా బాబు మూడేళ్లుగా అపాయింట్‌మెంట్ ఇవ్వ‌లేద‌ని వాపోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో కోడెల శివ‌ప్రసాద్‌రావు కుటుంబాన్ని రాజ‌కీయంగా శాశ్వ‌తంగా ప‌క్క‌న పెట్టిన‌ట్టే అనే అభిప్రాయం వెల్లువెత్తుతోంది.