ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ రెడ్డి అచ్చమైన రాయలసీమ రెడ్డి గారు. ఆయనది కర్నూలు జిల్లా బేతంచర్ల. తండ్రి రాంనాధ్ రెడ్డి బేతం చర్లకు సర్పంచిగా కూడా పనిచేశారు. ఏ రకంగా చూసినా అచ్చమైన రాయలసీమ ప్రాంతం. అయితే.. ఆయనకు తమిళ పిచ్చి ఎలా వచ్చిందనేది చాలా మందికి కలిగే సందేహం. ఇంతకూ ఈ తమిళ పిచ్చి సంగతేంటంటారా?
బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా శుక్రవారం శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. తమిళ మహాకవి తిరువళ్లువార్ రాసిన తిరుక్కురళ్ లోని వాక్యాలను ఉటంకిస్తూ ఆయన తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ మాటకొస్తే.. ఇప్పుడు మాత్రమే కాదు. గత ఏడాది కూడా ఆయన తరుక్కురళ్ సూక్తులతోనే బడ్జెట్ ప్రసంగం వినిపించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా తిరుక్కురళ్‌ను కోట్ చేస్తుంటారు. ఆమె అంటే.. తమిళఇంటి ఆడపడుచు గనుక.. తమిళ మహాకవి చెప్పిన సూక్తుల మీద ప్రేమ ఉండొచ్చు. కానీ.. ఈ అచ్చమైన సీమ రెడ్డి గారికి తమిళ పిచ్చి ఎలా వచ్చింది.
ఆయన తిరుక్కురళ్ ప్రియత్వం మీద చాలా సెటైర్లే పేలుతున్నాయి. నిజమే. మంచిమాటకు భాషాపరమైన ఎల్లలు చూడడం సరి కాదు గానీ.. ప్రతిసారీ తిరుక్కురళే చదివితే తెలుగు భాషాభిమానులకు మనస్తాపం కలగకుండా ఎందుకుంటుంది. పైగా తెలుగు కూడా ప్రాచీన భాషే. తిరుక్కురళ్ మహాకావ్యమే అయినప్పటికీ.. దానితో సమానమైన గాఢత, భావసాంద్రత ఉన్న ప్రాచీన సాహిత్యం మనకు కూడా పుష్కలంగానే ఉంది.
ఏ సందర్భానికి తగినట్టయినా మంచి మాటలు అందులో దొరక్కుండా పోవు. మొత్తం ప్రసంగంలో శ్రీశ్రీ రాసిన ‘పొలాలనన్నీ హలాల దున్నీ..’ అనే చిన్న కవితాభాగం తప్ప.. బుగ్గన తెలుగు వారి సూక్తులను/ కవితలను కోట్ చేయలేదు. ఆ చిన్న తెలుగు కవితను కూడా అపభ్రంశంగా చదివారు. ‘జగానికంతా..’ అనే పదమే సరిగా చదవలేకపోయారు.
నిజానికి శ్రీశ్రీ కంటె ముందు తెలుగు సాహిత్యం లేదా, అందులో విలువైన వాక్యాలు లేవా.. అంత ప్రాచీన వాక్యాలు కావాలంటే ఖచ్చితంగా తమిళంనుంచే అరువు తెచ్చుకోవాలా? అనే ప్రశ్నలు పుట్టేలా బుగ్గన తీరు కనిపించింది. అందుకే పలువురు ఈ విషయంలో విమర్శిస్తున్నారు.
ఇంతకూ ఈయనకు తమిళ ప్రియత్వం బహుశా తన విద్యార్థి జీవితంలో ఏర్పడి ఉండవచ్చునని అనిపిస్తోంది. బాల్యంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కొంతకాలం చదివిన బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఆ తరువాత మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నారు. బిటెక్ కోసం మాత్రం బళ్లారి వెళ్లారు. మద్రాసులో చదువుకున్న రోజుల్లో ఆయన మీద తిరుక్కురళ్ ప్రభావం బాగా పడిందా అనే సందేహం కలుగుతోంది.
అయితే ఇంకో కారణం ఉంది. బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తల్లి పార్వతీ దేవి. ఆమె తండ్రి కదిరి వెంకట రెడ్డి. అంటే.. మాయాబజార్ వంటి అద్భుత దృశ్యకావ్యాలను రూపొందించిన సినిమా దర్శకనిర్మాత కెవి రెడ్డి గారే! అమ్మ తరఫు తాతగారితో, ఆయన చనిపోయే నాటికి రెండేళ్ల వయసు కూడా లేని బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డికి అనుబంధం తక్కువేగానీ.. మొత్తానికి కుటుంబంలో అప్పటి తమిళబంధాలేవో మిగలబట్టే మదరాసులో చదువు, ఆ మేరకు తమిళ భాషా ప్రియత్వం ఏర్పడినట్లుగా కనిపిస్తోంది.