పేదలకు మంచి శుభవార్త అందింది. ఒక విధంగా చెప్పుకోవాలీ అంటే పేదల దశ తిరిగింది. విశాఖలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచన చేస్తే దాని మీద కొందరు కోర్టులు వెళ్లారు. దాంతో రెండేళ్ళుగా విశాఖ పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది.
ఏపీలో అన్ని చోట్లా పేదలకు పట్టాలు దక్కాయి. ఇళ్ళ నిర్మాణం కూడా చురుకుగా సాగుతోంది, దాన్ని చూస్తూ విశాఖ సిటీలోని పేదలు అలాగే ఉండిపోయారు. ఇన్నాళ్ళకు వారికి కోర్టు ద్వారా మంచి జరగబోతోంది.
విశాఖ సిటీలో 1.85 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల కోసం ఏకంగా అరు వేల ఎకరాలను ప్రభుత్వం భూసేకరణ ద్వారా సమీకరించింది. ఇలా విశాఖ, అనకాపల్లిలలో ఏకంగా ఆరు వేల 116 ఎకరాల భూమిని సిద్ధం చేసింది.
అయితే ఇలా భూమి సేకరించడం చట్ట విరుద్ధం అని పేర్కొంటూ రైతు కూలీ సంఘం తరఫున కొందరు కోర్టుకు వెళ్లారు. దీని మీద పలు దఫాలుగా విచారణ జరిగిన మీదట ఎట్టకేలకు కోర్టు పేదలకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. భూమిని సేకరించడం చట్టబద్ధమే అని పేర్కొంది.
దాంతో ఇక్కడ ప్రభుత్వం సమీకరించిన భూములలో ఉన్న రైతు కూలీలు ఎవరైనా ఉంటే వారికి కూడా డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వవచ్చునని సూచించింది. దాంతో ఇపుడు విశాఖ పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొందరలోనే దాదాపుగా రెండు లక్షల మంది విశాఖ అర్బన్ లోని పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయబోతున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చేతుల మీదుగా వీటిని ఇప్పించాలని వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఇక విశాఖలో భూమి అంటే దాని ఖరీదు చాలా ఎక్కువ అని తెలిసిందే. ఒక విధంగా ఇక్కడ పట్టా పొందిన ప్రతీ పేద కుటుంబం లక్షల ఆస్తికి వారసులు అవడం ఖాయమని అంటున్నారు.