సినిమా హీరోలు పార్టీలు పెట్టడం పెద్ద విశేషం కాదు, ఆల్రెడీ ఉన్న పార్టీల్లో చేరడం కూడా పెద్ద విషయం కాదు. కానీ పార్టీ పెట్టి సక్సెస్ కావడం మాత్రం అరుదుగా జరిగేది. అలాంటి అరుదైన ఘనతను చాలామంది పొలిటికల్ హీరోలు అందుకోలేపోయారు. అలాంటివారిలో కమల్ హాసన్ కూడా ఒకరు.
కమల్ హాసన్ కి విశ్వ నటుడు అనే క్రేజ్ ఉంది. కానీ కనీసం ఎమ్మెల్యేగా గెలిచే స్టామినా మాత్రం లేకపోయింది. జయలలిత, కరుణానిధి లేని ఎన్నికల్లో తాను మూడో ప్రత్యామ్నాయం అని చెప్పుకుని మరీ మక్కల్ నీది మయ్యం అనే పార్టీ పెట్టి పోటీ చేశారు కమల్. కానీ ఫ్లడ్ లైట్ల వెలుతురు మధ్య టార్చిలైటు వెలవెలబోయింది. అక్కడ్నుంచి ఆయన పోరాటం ఆగిపోయింది. ఇన్నాళ్లకు కమల్ కి జ్ఞానోదయం అయ్యేట్టు కనిపిస్తోంది. అది కూడా కేజ్రీవాల్ రూపంలో.
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ భారీ విజయం తర్వాత కమల్ హాసన్ నేరుగా ఢిల్లీకి వెళ్లారు. కేజ్రీవాల్ ని కలసి అభినందించారు. ఓ రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించారు. బీజేపీకి ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ అంటూ డైలాగులు పేల్చారు. అంటే కమల్ మనసులో ఏదో ఉందనే విషయం అర్థమవుతోంది.
పొత్తు పెట్టుకుంటారా..? పార్టీ మూసేస్తారా..?
తమిళనాడులో ఆమ్ ఆద్మీ పార్టీతో మక్కల్ నీది మయ్యం పొత్తు పెట్టుకుని పనిచేయడం ఒక ఆప్షన్. లేదూ తన పార్టీని ఆమ్ ఆద్మీలో విలీనం చేసి చీపురు గుర్తు పట్టుకుని తిరగడం కమల్ ముందున్న రెండో ఆప్థన్. రెండో దానికే కమల్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
సొంతగా పార్టీని నడపడం, క్యాడర్ ని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో కమల్ కి ఈ పాటికే అర్థమైంది. అందుకే ఆమ్ ఆద్మీ పేరుని వాడుకుని తమిళనాడులో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నారట కమల్ హాసన్. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఆయన ఢిల్లీ వెళ్లి కేజ్రీవాల్ ని కలిసొచ్చినట్టు తమిళ మీడియాలో వార్తలొస్తున్నాయి.
వాస్తవానికి కమల్ హాసన్ ని అందరికంటే ముందే రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు కేజ్రీవాల్. ఆ తర్వాత ఏడాదికి కమల్ సొంత పార్టీ పెట్టారు. వారిద్దరి మధ్య చాన్నాళ్లుగా మంచి సంబంధాలున్నాయి. అందులోనూ మోదీ ఇద్దరికీ ఉమ్మడి శత్రువు. అందుకే టార్చి పక్కనపెట్టి చీపురు పట్టుకోబోతున్నారట కమల్.