అఖిల‌ప్రియ చేష్ట‌ల‌కు ఆళ్ల‌గ‌డ్డ అవాక్కు

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ చేష్ట‌ల‌కు క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ అవాక్కైంది. పిల‌వ‌ని పేరంటానికి వెళ్లి, త‌న పైశాచిక స్వ‌భావాన్ని బ‌య‌ట పెట్టుకున్నార‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇవాళ మాజీ ఎమ్మెల్యే…

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ చేష్ట‌ల‌కు క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ అవాక్కైంది. పిల‌వ‌ని పేరంటానికి వెళ్లి, త‌న పైశాచిక స్వ‌భావాన్ని బ‌య‌ట పెట్టుకున్నార‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇవాళ మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఐదో వ‌ర్ధంతి. ఈ సంద‌ర్భంగా ఆళ్ల‌గ‌డ్డ‌లోని టీబీ రోడ్డులోని ఓ ట్రాన్స్‌పోర్టు కార్యాల‌యం ద‌గ్గ‌ర భూమా నాగిరెడ్డి, శోభా దంప‌తుల విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేసేందుకు వారి కుటుంబ స‌భ్యుడైన నియోజ‌క‌వ‌ర్గ బీజేపీ ఇన్‌చార్జ్ భూమా కిషోర్‌రెడ్డి నిర్ణ‌యించారు.

ఇటీవ‌ల ఆళ్ల‌గ‌డ్డ మున్సిపాల్టీలో రోడ్డు విస్త‌ర‌ణ‌లో భాగంగా భూమా నాగిరెడ్డి బ‌స్టాప్ షెల్ట‌ర్‌ను తొల‌గించ‌డం వివాదాస్ప‌ద‌మైంది. ఆళ్ల‌గ‌డ్డ అభివృద్ధి కార్య‌క్ర‌మంలో భాగంగా నాగిరెడ్డి పేరుతో ఉన్న బ‌స్సు షెల్ట‌ర్‌ను భూమా కిషోర్‌రెడ్డి ఆహ్వానించారు. భూమా నాగిరెడ్డి దంప‌తుల విగ్ర‌హాల‌ను త‌న సొంత స్థ‌లంలో ఏర్పాటు చేసి, వారిని శాశ్వ‌తంగా స్మ‌రించుకునేలా చేస్తాన‌ని కిషోర్ ప్ర‌క‌టించారు. నాగిరెడ్డి బ‌స్సు షెల్ట‌ర్ తొల‌గింపును రాజ‌కీయ ల‌బ్ధికి వాడుకోవ‌డాన్ని మాజీ మంత్రి అఖిల‌ప్రియ మానుకోవాల‌ని ఆయ‌న హిత‌వు చెప్పారు. నిజంగా త‌ల్లిదండ్రుల‌పై ప్రేమే ఉంటే ఇంత‌కాలం ప‌ట్ట‌ణంలో వారి విగ్ర‌హాల‌ను నెలకొల్పాల‌నే ఆలోచ‌న ఎందుకు చేయ‌లేదని ఇటీవ‌ల కిషోర్‌రెడ్డి నిల‌దీశారు.

తండ్రిలేని లోటును తీర్చిన నాగిరెడ్డితో పాటు త‌ల్లిలా ఆద‌రించిన పిన్ని శోభానాగిరెడ్డిల విగ్ర‌హాల‌ను తానే పెడ‌తానంటూ ఇచ్చిన హామీని ఆయ‌న నిల‌బెట్టుకున్నారు. ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు బాబాయ్‌, పిన్ని విగ్ర‌హాల‌ను ఆవిష్క‌రించేందుకు ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న భూమా అభిమానుల‌ను, కుటుంబ స‌భ్యుల‌ను ఆయ‌న ఆహ్వానించారు. మ‌రో రెండు గంట‌ల్లో త‌న చిన్న‌బ్బ, విజ‌య డెయిరీ మాజీ చైర్మ‌న్ నారాయ‌ణ‌రెడ్డి చేతుల మీదుగా భూమా నాగిరెడ్డి దంప‌తుల విగ్ర‌హాల‌ను ఆవిష్క‌రించాల‌ని ఏర్పాట్లు చేసుకుంటున్న త‌రుణంలో…. పిడుగు లాంటి వార్త‌.

భూమా అఖిల‌ప్రియ‌, ఆమె త‌మ్ముడు జ‌గ‌త్‌విఖ్యాత్‌రెడ్డి భూమా ఘాట్‌కు వెళుతూ మార్గ‌మ‌ధ్యంలో త‌మ సోద‌రుడైన కిషోర్‌రెడ్డి ఏర్పాటు చేసిన విగ్ర‌హాల‌ను ఆవిష్క‌రించ‌డం గ‌మ‌నార్హం. ఈ కార్య‌క్ర‌మానికి భూమా అఖిల‌ప్రియ‌, చెల్లి మౌనిక‌, త‌మ్ముడు జ‌గ‌త్‌ల‌కు ఆహ్వానం లేదు. అస‌లే అఖిల‌ప్రియ వైఖ‌రి న‌చ్చ‌క, బీజేపీలో చేరి త‌న ఉనికి చాటుకుంటున్న కిషోర్ నాయ‌క‌త్వాన్ని, ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న ఆద‌ర‌ణ న‌చ్చ‌క‌పోవ‌డంతో అఖిల‌ప్రియ, ఆమె త‌మ్ముడు జ‌గ‌త్ త‌ల్లిదండ్రుల విగ్ర‌హాల‌ను ఆవిష్క‌రించి న‌వ్వులపాలు అయ్యారు.

తాను ఏర్పాటు చేసిన విగ్ర‌హాల‌ను అఖిల‌ప్రియ‌, జ‌గ‌త్ ప్రారంభించ‌డంపై కిషోర్‌రెడ్డి మండిప‌డుతున్నారు. తాము ఏర్పాటు చేసిన విగ్ర‌హాల‌ను ఆవిష్క‌రించడం అంటే బ‌రితెగించ‌డ‌మే అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏ మాత్రం నైతిక విలువ‌లున్నా ఇలాంటి చ‌ర్య‌ల‌కు దిగ‌ర‌ని ఆయ‌న అంటున్నారు. అఖిల‌ప్రియ సిగ్గుమాలిన చ‌ర్య‌ల‌పై భూమా అభిమానులు, ఆళ్ల‌గ‌డ్డ ప్ర‌జ‌లు ముక్కున వేలేసుకున్నార‌ని ఆయ‌న అంటున్నారు.