యువి అధినేతలు ఆలోచించుకోవాలి

యువి అనేది పెద్ద నిర్మాణ సంస్ణ. మిర్చి, సాహో, ఇంకా అనేక సక్సెస్ ఫుల్ భారీ సినిమాలు నిర్మించిన సంస్థ. కానీ ఈ సంస్థ సినిమా నిర్మాణం విషయంలో తప్పడటుగుడలు వేస్తోంది అనిపిస్తోంది. సినిమా అంటే…

యువి అనేది పెద్ద నిర్మాణ సంస్ణ. మిర్చి, సాహో, ఇంకా అనేక సక్సెస్ ఫుల్ భారీ సినిమాలు నిర్మించిన సంస్థ. కానీ ఈ సంస్థ సినిమా నిర్మాణం విషయంలో తప్పడటుగుడలు వేస్తోంది అనిపిస్తోంది. సినిమా అంటే డబ్బులు వెదజల్లేస్తే సరిపోదు. పెర్ ఫెక్ట్ ప్లానింగ్ వుండాలి. అది కొరవడినట్లు కనిపిస్తోంది. దాని వల్ల అనుకున్న క్వాలిటీ రావడం, రాకపోవడం సంగతి అలా వుంచి, అనవసరంగా కోట్లకు కోట్లు ఖర్చయిపోతున్నాయి. సరైన రిజల్ట్ రావడం లేదు.

సాహా సంగతే చూద్దాం. బాహుబలి తరువాత ప్రభాస్ తో అంత భారీ సినిమా చేస్తూ సంగీతం విషయంలో తప్పటడుగులు వేసారు. ఆఖరికి ఎవరరెవరి చేతో పాటలు చేయించారు. ఆ లెసన్ తరువాత ఉపయోగపడిందా అంటే అదీ లేదు.

రాధేశ్యామ్ లాంటి భారీ ప్రేమ కథా చిత్రం తీయాలి అనుకున్నపుడు హీరో హీరోయిన్ల ఎంపికతో పాటు ఆలోచించాల్సింది సంగీత దర్శకుడిని కూడా. సరైన సంగీత దర్శకుడిని సినిమాలోకి తీసుకురాలేకపోయారు. ప్రేమ కథకు పాటలే కీలకం అని ఎందుకు అనుకోలేదో తెలియదు. మరొక్క రెండు సరైన పాటలు వుంటే సినిమా ఓ రేంజ్ లో వుండేది. నీరాతలే సాంగ్ కు తోడుగా సెకండాఫ్ లో మరో మాంచి పాట వుంటే ఆ లెక్క వేరు.

సినిమా బ్యాక్ గ్రవుండ్ స్కొర్ ముందు చేయించి, దాన్ని పక్కన పడేసి థమన్ తో చేయించారు. ఇదంతా ఎంత వృధా? కీలకమైన ఈ విషయంలో సరైన నిర్ణయం సినిమా ఆరంభానికి ముందే తీసుకోవాల్సి వుంది కదా?

సినిమా తీయాలి అనుకున్నపుడు, ఇటలీ బ్యాక్ డ్రాప్ అనుకున్నపుడు ఎంత భారీ లెవెల్ లో తీయాలి అనుకున్నా, మరీ అంతంత సెట్ లా? పైగా వాటి సైజ్ అంత భారీగా. అదీ చాలక ఫుల్ డిటైలింగ్ సెట్ లు. సినిమాకు సెట్ లే దాదాపు 40 వరకు వేసి వుంటారని అంచనా. ఒక్క ఆర్ట్ డిపార్ట్ మెంట్ కే 100 కోట్లకు పైగా ఖర్చుచేయాల్సి వచ్చింది.

ముందే సినిమాటోగ్రాఫర్, దర్శకుడు, ఆర్ట్ డైరక్టర్ కలిసి పక్కా ప్లాన్ చేసి వుంటే ఈ ఖర్చును చాలా వరకు తగ్గించవచ్చు అని ఇండస్ట్రీలో అనుభవజ్ఙులు అంటున్నారు. సినిమాలు సెకెండ్ల కాలం కూడా కనిపించని చొట్ల కూడా అంత డిటైలింగ్, అన్ని కోట్ల ఖర్చు అవసరమా అంటున్నారు. 

ఎంత పెదనాన్న అభిమానం వున్నా, గురువు పాత్రకు కృష్ణం రాజును తీసుకోవడం కన్నా సత్యరాజ్ నే బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఆరోగ్య రీత్యా కృష్ణం రాజు కదలలేకపోతున్నారు. మాట్లాడలేకపోతున్నారు. కళ్లలో మెరుపు తగ్గిపోయింది. సరే తీసుకుంటే తీసుకున్నారు. అక్కడా గడబిడే. ఓవర్ సీస్ లో విడుదల చేసిన తెలుగు కాపీలో సత్యరాజ్ వుంటే తెలుగులో కృష్ణం రాజు వున్నారు. ఇదంతా సరైన మేనేజ్ మెంట్ చేయలేకపోవడం.  

అన్నింటికన్నా పెద్ద వ్యవహారం మరోటి వుంది. ఓవర్ సీస్ కాపీల్లో గ్రాఫిక్స్ క్వాలిటీకి,  ఆంధ్రలో విడుదలయిన వాటిల్లో గ్రాఫిక్స్ క్వాలిటీకీ తేడా వుంది. సినిమాను ఏనాడో విడుదల చేయాలనుకున్నారు. చేయడం కుదరలేదు. అలా వాయిదా పడుతూ వచ్చింది. అలా టైమ్ దొరకినపుడు పూల్ ఫ్రూఫ్ గా చూసుకోవాలి కదా. 

సినిమా విడుదల ముందు రోజు వరకు డొమస్టిక్ ప్రింట్ల మిక్సింగ్ వర్క్ జరుగుతూనే  వుంది. మూడు వందల కోట్ల సినిమా స్క్రిప్ట్ అంటే ఎంత పెర్ ఫెక్ట్ గా వచ్చేదాకా వేచి వుండి షూట్ కి వెళ్లాలి. అంతా అయిపోయిన తరువాత, విడుదల వాయిదా పడిన తరువాత రాజమౌళి లాంటి వాళ్లు చేయి చేసుకున్నారు అంటే ఎంత అయినా సమస్యే కదా?

యువి ఇకనైనా సినిమా నిర్మాణం విషయంలో పెర్ ఫెక్ట్ గా వుండాలి. కేవలం స్నేహం, అభిమానం, ఇలాంటివి నిండుగా వుంటే సరిపోదు. వ్యాపారం వ్యాపారంలా చేయాలి. లేదంటే స్నేహితులు బాగుంటారు. మనం దెబ్బయిపోతాం. ఆ సంగతి గమనించాలి.