ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గాన్ని మార్చేస్తారనే విషయంలో మంత్రులు తాజాగా కొత్త టెన్షన్ పడవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు.
ఎందుకంటే.. ఆయన గద్దెనెక్కిన తొలినాళ్లలోనే ఆ సంగతి చెప్పేశారు. అలాగని ఇప్పుడు కేబినెట్ లో ఉన్న వాళ్లు–ఎటూ పదవి పోతుందనే నిశ్చింతతోనూ ఉండలేకపోతున్నారు! అదే సమయంలో పదవి ఉంటుందనే ఆశతోనూ బతకలేకపోతున్నారు. ఈ వెయిటింగ్ లో వారికి టెన్షన్ పెరిగిపోతోంది.
కేబినెట్ ను మార్చదలచుకున్న ముహూర్తం మాత్రం జగన్ మనసులోనే పదిలంగా ఉంది. మారుస్తాననే స్పష్టత ఇచ్చేసి.. ఆయన తన సహచరుల్లో టెన్షన్ ని కూడా పదిలంగా ఉంచేశారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. ‘కోటు వేసుకుని వచ్చి ఉండొచ్చు కదా.. మళ్లీ వచ్చే ఏడాది బడ్జెట్ లో నిన్ను చూస్తామో లేదో..’ అని సీఎం జగన్, ఆర్థిక మంత్రి బుగ్గనతో అన్నమాటలే.. తాజా లీకులకు ఆధారం. అవే మాటల్ని పట్టుకుని కేబినెట్ సమావేశంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎంతో ప్రస్తావించడం.. ‘ఇందులో కొత్త విషయం ఏముంది? రెండున్నరేళ్ల తరువాత కేబినెట్ మారుస్తానని అధికారంలోకి వచ్చినప్పుడే చెప్పాం కదా’ అంటూ సీఎం చాలా సింపుల్ గా తేల్చేయడం జరిగిపోయింది.
సీఎం జగన్ ఆ ఒక్క మాట చెప్పేసి ఊరుకున్నా సరిపోయేది. కేబినెట్ లో ఉన్న మంత్రులందరూ.. రోజులు లెక్కపెట్టుకుంటూ.. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పడేవారు. ఆ క్లారిటీ కూడా ఇవ్వకుండా జగన్ కొంత సస్పెన్స్ ను మిగిల్చారు.
‘సామాజికవర్గ, రాజకీయ, ఇతర సమీకరణల వల్ల కేబినెట్ లో కొందరిని పదవుల్లోనే కొనసాగించాల్సి రావొచ్చు’ అని కూడా జగన్ అన్నారు. అంటే ఇప్పటి కేబినెట్లో కొందరు మాత్రం పదవుల్లోనే కొనసాగుతారని కూడా తేలిపోయింది. గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఓ సందర్భంలో నూటికి నూరుశాతం కేబినెట్ మార్పు ఉంటుందని ఒక సంకేతం ఇచ్చారు. దానివల్ల అందరిలోనూ ఒక క్లారిటీ ఏర్పడింది. కానీ.. ఇప్పుడు స్వయంగా జగన్ కొందరు ఇలాగే కొనసాగుతారనే మాట చెప్పడం వల్ల అందరికీ టెన్షన్ తప్పేలా లేదు.
‘నా పవి ఎటూ ఊడుతుంది’ అనే స్పష్టత తమ తమ పనితీరును బట్టి ఆల్రెడీ కొందరు మంత్రుల్లో చాలా స్థిరంగా ఉండొచ్చు. అలాంటి వారికి కొత్త టెన్షనేమీ లేదు. ఎటూ పదవి పోతుంది గనుక.. ఈలోగా తట్టాబుట్టా సర్దుకుని, దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకుంటారు. ఎటొచ్చీ డైలమాలో ఉండేవారికే కష్టం.
అయినా, జగన్ చాలా సింపుల్‌గా ‘మీరు ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటారు.. అవన్నీ ఇప్పుడు కాదులే. వేరే సమయముంది..’ అని చెప్పడం వారి టెన్షన్ ను ఇంకాస్త పెంచడమే. మంత్రులుగా పీకేసిన తర్వాత.. వారికివ్వబోయే పోస్టుల విషయంలో మాత్రం జగన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
జిల్లా అధ్యక్షులుగా వేస్తా.. ఎన్నికలకు మీరు పార్టీని సిద్ధం చేయండి అని అంటున్నారు. పార్టీ పనిలో పెడతారనేది ముందునుంచి వినిపిస్తున్నదే.. జిల్లా అధ్యక్ష బాధ్యతలు అనే పదమే కొత్తది. పాపం అమాత్యులుగా వైభవం అనుభవించిన వారు.. ఈ కొత్తపనికి ఎందరు సిద్ధంగా ఉంటారో ఏమో?