జనాల నాడి తెలియకుండా, అందులోనూ తెలుగు జనాల సైకాలజీ స్టడీ చేయకుండా, ఏవేవో లెక్కలు వేసి ప్రయోగాలు చేస్తే అవి కాస్తా వికటిస్తాయి. ఎనీ టైమ్ థియేటర్ అనే కాన్సెప్ట్ నే అలాంటిది.
పెద్ద హీరో పెద్ద సినిమా అంటే బ్లాక్ లో టికెట్ కొని అయినా చూస్తారు. అలా కాకుండా మామూలు సినిమా అంటే యాభై రూపాయలు ఇచ్చి మొబైల్ లో చూడమన్నా చూడరు. అదీ మన జనాల సైకాలజీ.
ఇది అర్థం చేసుకోకుండా లాక్ డౌన్ టైమ్ లో ఎటిటిలు అంటూ హడావుడి చేసారు. రామ్ గోపాల్ వర్క హడావుడి, సోషల్ మీడియా పబ్లిసిటీ, ఆయన తీసుకున్న వివాదాస్పద సబ్జెక్ట్ లు, పోర్నో కంటెంట్ చూసి కాస్త టికెట్ లు తెగాయి.
ఆ ఊపు చూసి ఆర్జీవీ కూడా రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఏటిటిలో విడుదల చేయాలని ఓ సలహా పారేసారు. నిజానికి అది కొంత వరకు కరెక్ట్ నే. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా ఎటిటి అంటే రెండు వందలు, మూడు వందలు పెట్టి అయినా చూస్తారు.
కానీ స్క్రీన్ రికార్డర్లు, ఇంకా చాలా టెక్నాలజీతో సినిమా ఇలా విడుదలైతే అలా పైరసీ అయిపోతుంది. ఈ దెబ్బ ఆర్జీవీ కూడా తగిలింది. దాంతో ఇక ఆయన మళ్లీ తన సినిమాలను థియేటర్ దిశగా రూటు మార్చేసారు.
శ్రేయాస్ ఎటిటి కొంత వరకు మాంచి హడావుడి చేసింది. కొంత వరకు బాగానే నడిచింది. కానీ ఇప్పుడు అది కూడా రూటు మార్చినట్లు కనిపిస్తోంది. ఆ సంస్థ నిర్మించిన క్రేజీ అంకుల్స్ ను థియేటర్ లోనే విడుదల చేస్తున్నారు. అంతే కాదు ఆ తరువాత నిర్మించే సినిమాలు కూడా అదే లైన్ లోకి వెళ్లేలా కనిపిస్తున్నాయి.
నిర్మాత రామ సత్యనారాయణ తను కూడా ఏటిటి అంటూ హడావుడి చేసి, ఒక్క సినిమాతో దుకాణం సద్దేశారు మరో ఒకరిద్దరు అసలు సినిమాలు వేయకుండానే బోర్డు మూసేసారు. ఈ మధ్యన భారీ ఎత్తున ఫ్రైడే మూవీస్ అనే ఎటిటి లాంచ్ అయింది. అది కూడా ఏ దిశగా వెళ్లాలి అనే విషయమై మల్లగుల్లాలు పడుతోంది.
ఊర్వశి అనే కొత్త ఎటిటి కూడా వచ్చింది. వస్తూనే ఫ్రీ సినిమా అంటోంది. అలా అయితే మన జనాలు హ్యాపీగా చూస్తారు. కానీ అన్ని సినిమాలు ఫ్రీగా వేయలేరు కదా. వెయ్యి నుంచి పదిహేను వందలు కడితే ఏడాది పొడవునా, అన్ని భాషల సినిమాలు ఫ్రీగా చూసే అవకాశం ఓటిటిలు ఇస్తున్నాయి ఆహా లాంటి ఓటిటి 250 రూపాయలకే ఆ చాన్స్ ఇస్తోంది.
ఓటిటిల పరిస్థితి ఇలా వుంటే, థియేటర్లు తెరుచుకుని జనాల కోసం చూస్తుంటే ఇక ఎటిటి లకు అవకాశం ఎక్కడ వుంటుంది. మరో అయిదేళ్లకు కానీ జనం ఆన్ లైన్ లో టికెట్ కోని ఆన్ లైన్ లో సినిమా చూసే అలవాటుకు మళ్లరేమో? అంతవరకు ఎటిటి లు వెయిట్ చేయాల్సిదే.