మాయమాటలే బ్రహ్మాస్త్రం అనుకుంటున్న టీడీపీ!

కొన్ని హామీలను మేనిఫెస్టో అనే ట్యాగ్ లైన్ కింద ప్రకటించేసి.. వాటి ద్వారా జగన్ ప్రభుత్వానికి  చెక్ పెట్టేయగలమని నారా చంద్రబాబునాయుడు అనుకుంటున్నారు. మహానాడులో తెలుగుదేశం విడుదల చేసిన తొలి మేనిఫెస్టో ప్రత్యర్థుల మీద…

కొన్ని హామీలను మేనిఫెస్టో అనే ట్యాగ్ లైన్ కింద ప్రకటించేసి.. వాటి ద్వారా జగన్ ప్రభుత్వానికి  చెక్ పెట్టేయగలమని నారా చంద్రబాబునాయుడు అనుకుంటున్నారు. మహానాడులో తెలుగుదేశం విడుదల చేసిన తొలి మేనిఫెస్టో ప్రత్యర్థుల మీద బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుందని, ఉన్నపళంగా తమకు అధికారం కట్టబెట్టేస్తుందని తెలుగుదేశం వారు తలపోస్తున్నారు. నాయకులంతా తెగ మురిసిపోతున్నారు. చంద్రబాబునాయుడు తాను ఎక్కడ పర్యటించినా సరే, తన వద్దకు ఎవరు వచ్చి కలిసినా సరే.. మన మేనిఫెస్టోకు రెస్పాన్స్ ఎలా ఉన్నదని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఈ మేనిఫెస్టో ద్వారా.. చంద్రబాబునాయుడు తనలో ఉన్న మోసం చేసే గుణాన్ని విశ్వరూపంలో చూపించారని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే.. రాష్ట్రంలో 18 నిండి 59 ఏళ్ల వయసున్నప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తానని చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రతి మహిళకు అనే పదానికి నిర్వచనం ఆయన చెప్పలేదు. అందరికీ ఇస్తారా.. పేద వర్గానికి చెందిన తెల్ల రేషన్ కార్డున్న వాళ్లకు మాత్రమే ఇస్తారా? అనేది ఇప్పటికీ ప్రజలకు అర్థం కావడం లేదు. 

రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఇవ్వడం అంటే చంద్రబాబు ఇంకో పదిజన్మలెత్తినా అది సాధ్యం కాదని జనం జోకులు వేసుకుంటున్నారు. అదే సమయంలో నిరుద్యోగులకు ఇస్తానన్న మూడువేల రూపాయల భృతి విషయంలో కూడా ప్రజలకు అనేక అనుమానాలున్నాయి. అసలు నిరుద్యోగులు అంటే ఎవరు? వారి అర్హతలు ఏమిటి? ఆ పదానికి ప్రభుత్వ నిర్వచనం ఏమిటి? అనేది అర్థం కావడం లేదు.

వరాలు ప్రకటించారే తప్ప వాటి విషయంలో క్లారిటీ లేని ఇలాంటి పోకడలను గమనించినప్పుడు.. చంద్రబాబునాయుడువు అన్నీ మాయమాటలే అని ఎవ్వరైనా అనుకుంటారు. పైగా చంద్రబాబునాయుడు ప్రజల్లో క్రెడిబిలిటీ తక్కువ. 

కాంట్రాక్టులు దందాలు లాంటి ఆలోచనలు తప్ప వాస్తవంగా ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే, వారి మొహాల్లో చిరునవ్వులు చూడాలనుకునే పథకాలను గతంలో ఎన్నడూ ప్లాన్ చేసిన చరిత్ర లేదు. 2019 ఎన్నికలకు ముందు కూడా.. ఏదో మహిళా ఓటు బ్యాంకును గంపగుత్తగా సర్కారు సొమ్ముతో కొనుక్కోవడమే టార్గెట్ అన్నట్టుగా డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పేరుతో రూ.పదివేల వంతున పంచిపెట్టారు. 

కానీ అలాంటి ప్రయోగాలు కూడా వికటించాయి. అవన్నీ కేవలం ఓట్ల మీద ప్రేమతోనే తప్ప తమ మీద ప్రేమతో కాదని ప్రజలు అనుకున్నారు. అందుకే ఆయనను ఎన్నికల్లో ఓడించారు. ఇప్పుడు కూడా తను ప్రకటించిన పథకాలకు అర్హతల విషయంలో క్లారిటీ ఇస్తే తప్ప జనం చంద్రబాబును నమ్మరు. అలాంటప్పుడు.. ఈ మాయమాటలే బ్రహ్మాస్త్రంలా పనిచేస్తాయని పార్టీ అనుకుంటే పప్పులో కాలేసినట్టే.