పొత్తుతో ప‌వ‌న్‌ను మ‌భ్య‌పెడుతూ…!

పొత్తు పేరుతో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను టీడీపీ మ‌భ్య‌పెడుతోందా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ఒక వైపు త‌న ప‌ని తాను చేసుకుపోతే, మ‌రోవైపు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను రాజ‌కీయంగా ఎద‌గ‌నీయ‌కుండా టీడీపీ వ్యూహాత్మ‌కంగా ముందుకెళుతోంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.…

పొత్తు పేరుతో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను టీడీపీ మ‌భ్య‌పెడుతోందా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ఒక వైపు త‌న ప‌ని తాను చేసుకుపోతే, మ‌రోవైపు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను రాజ‌కీయంగా ఎద‌గ‌నీయ‌కుండా టీడీపీ వ్యూహాత్మ‌కంగా ముందుకెళుతోంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. జ‌న‌సేన‌తో పొత్తుపై పాద‌యాత్ర‌లో నారా లోకేశ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పొత్తుల విష‌యాన్ని చంద్ర‌బాబు చూసుకుంటార‌ని ఆయ‌న చెప్పారు.

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో ఇప్ప‌టికే తాము ఆరేడు సార్లు పొత్తుపై చ‌ర్చించామ‌న్నారు. మ‌హానాడు కార‌ణంగా మ‌ళ్లీ క‌ల‌వ‌డానికి కుద‌ర్లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. త్వ‌ర‌లో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ పొత్తుపై భేటీ అవుతార‌న్నారు. బీజేపీతో మాత్రం పొత్తు మాట లేద‌ని ఆయ‌న అన్నారు. పొత్తుపై మాట్లాడుకుంటున్నామంటూనే, మ‌రోవైపు ప‌వ‌న్‌తో సంబంధం లేకుండానే టీడీపీ మ‌హానాడులో మొద‌టి విడ‌త మేనిఫోస్టోను ప్ర‌క‌టించింది.

అలాగే ఎక్క‌డిక‌క్క‌డ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ల‌ను టీడీపీ నియ‌మిస్తోంది. మ‌రికొన్ని చోట్ల ఆల్రెడీ ఉన్న నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ల‌కు టికెట్ల‌ను ఖ‌రారు చేస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు స‌త్తెన‌ప‌ల్లిలో టీడీపీ ఇన్‌చార్జ్‌గా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను ప్ర‌క‌టించారు. రానున్న ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా ఆయ‌న్ను చంద్ర‌బాబు అధికారికంగా ఖ‌రారు చేసిన‌ట్టే. 

స‌త్తెన‌ప‌ల్లెలో చెప్పుకోత‌గ్గ స్థాయిలో జ‌న‌సేన‌కు బ‌లం ఉంది. అక్క‌డ ప‌వ‌న్ సామాజిక వ‌ర్గం ఓట్లు దాదాపు 35 వేలు ఉన్నాయి. దీంతో జ‌న‌సేన‌కు నాయ‌కులున్నారు. అంతేకాదు, జ‌న‌సేన‌లో నాయ‌కులు ఎక్కువై, వ‌ర్గాలు కూడా ఏర్ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో పొత్తు అంటూనే టీడీపీ మాత్రం త‌న అభ్య‌ర్థుల‌ను ఖరారు చేస్తూ పోతోంది.

మ‌రి జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏం చేస్తున్న‌ట్టు? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. వైసీపీ ఖ‌చ్చితంగా గెలుస్తుంద‌నే చోట మాత్ర‌మే జ‌న‌సేన‌కు టీడీపీ టికెట్లు ఇస్తుందా? అనే అనుమానం ఆ పార్టీ నేత‌ల్లో నెల‌కుంది. పేరుకు జ‌న‌సేన‌కు 20 లేదా 22 టికెట్లు కేటాయించామ‌ని చెప్పుకుని, మిగిలిన చోట్ల ప‌వ‌న్ అభిమానుల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకోడానికి చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌నే అనుమానం జ‌న‌సేన నేత‌ల్లో రోజురోజుకూ పెరుగుతోంది.

ఇలాగైతే టీడీపీతో పొత్తు పెట్టుకుని ప్ర‌యోజ‌నం ఏంట‌నే అంత‌ర్మ‌థ‌నం జ‌న‌సేన నేత‌ల్లో సాగుతోంది. త‌మ‌తో నిజాయ‌తీగా టీడీపీ పొత్తు పెట్టుకోవాల‌ని అనుకుంటే, ముందుగా ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన త‌ర్వాత అభ్య‌ర్థుల‌ను ఖరారు చేయాల‌ని, కానీ ఆ పార్టీ అలా చేయ‌డం లేద‌ని జ‌న‌సేన నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. టీడీపీ నైజం తెలిసి కూడా ఆ పార్టీతో పొత్తు కోసం వెంప‌ర్లాడ‌డం వ‌ల్లే లెక్క చేయ‌డం లేద‌నే అభిప్రాయానికి జ‌న‌సేన నేత‌లు వ‌స్తున్నారు. ఇక ప‌వ‌న్‌కే జ్ఞానోద‌యం కావాల్సి వుంది.