సోమిరెడ్డి వారి సరికొత్త గురివింద నీతి!

తెలుగుదేశం పార్టీకి ఉండే కాగితం పులులు వంటి నాయకుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఒకరు. సీనియారిటీ ముసుగు తొడుక్కుని ప్రజాదరణ లేకపోయినా సరే.. చెలామణీ అయిపోతున్న నాయకుడు ఆయన!…

తెలుగుదేశం పార్టీకి ఉండే కాగితం పులులు వంటి నాయకుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఒకరు. సీనియారిటీ ముసుగు తొడుక్కుని ప్రజాదరణ లేకపోయినా సరే.. చెలామణీ అయిపోతున్న నాయకుడు ఆయన!

తాజాగా ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారుకు ఒక సవాలు విసిరారు. ఆ సవాలు అచ్చంగా గురివింద గింజ నీతిని తలపించేలా ఉంది. ఒక వేలు ఇతరులవైపు చూపిస్తే నాలుగువేళ్లు మనవైపే చూపిస్తుంటాయనే నీతికి నిదర్శనంగా ఆయన సవాలు ఉంది. అంతగా ఆత్మపరిశీలన చేసుకునే ధైర్యం గానీ, స్థాయిగానీ లేని సోమిరెడ్డి.. ఇంతకూ వైసీపీకి విసిరిన సవాలు ఏమిటో తెలుసా? వైసీపీ వారి పార్టీ గత ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టో  పై ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేయాలట.

తెలుగుదేశం పార్టీ కొన్ని వరాలను ప్రకటించి.. అది తమ తొలి మేనిఫెస్టో అని ప్రజల్లోకి వదలిపెట్టింది. ఆ మేనిఫెస్టో యొక్క విశ్వసనీయత, చంద్రబాబు యొక్క విశ్వసనీయత గురించి ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ తమ గత ఎన్నికల మేనిఫెస్టోపై శ్వేతపత్రం విడుదల చేయాలని సోమిరెడ్డి అంటున్నారు. 

జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అనేకానేక సందర్భాల్లో తమ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాల్లో 98 శాతం అమలు చేశామని చెబుతున్నారు. నిజానికి వైసీపీ సింగిల్ పేజీ మేనిఫెస్టో మాత్రమే గత ఎన్నికల సందర్భంగా తెచ్చింది. తెదేపాలాగా పుస్తకాలు రూపంలో అబద్ధపు హామీలు బోలెడు వండివార్చడం తమకు ఇష్టం లేదని చాటిచెప్పింది. చెప్పిన హామీలన్నీ అమలు చేసింది. 

ఆ మాటకొస్తే జగన్ మేనిఫెస్టో అంశాలను ఆచరణలో చేసి చూపించారో లేదో.. శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా దేబిరించాల్సిన అవసరం లేదు. ఆ సింగిల్ పేజీ మేనిఫెస్టోను పక్కన పెట్టుకుని.. ఆ పని సోమిరెడ్డే చేయవచ్చు. కానీ, ఆయనకు అంత ధైర్యం లేదు. ప్రతి హామీని జగన్ నెరవేర్చానని ఒప్పుకోవల్సి వస్తుందనే భయం.

ఆ మాటకొస్తే.. 2014 ఎన్నికల సమయంలో తెదేపా ఇచ్చిన మేనిఫెస్టో పై శ్వేతపత్రం విడుదల చేయగల దమ్ము ఆ పార్టీలో ఏ ఒక్కరికైనా ఉంది. అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత.. తమ ఎన్నికల మేనిఫెస్టోను, పార్టీ వెబ్ సైట్ లో కూడా కనిపించకుండా చేసేసిన సిగ్గుమాలిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. అలాంటిది తమ చరిత్రను, తమ వంచనను మరచిపోయి.. జగన్ మేనిఫెస్టో మీద శ్వేతపత్రం కావాలని సోమిరెడ్డి అడగడం హేయంగా ఉన్నదని ప్రజలు విమర్శిస్తున్నారు.