బీసీ ల చట్టం-ఇది సాధ్యమేనా…బాబూ?

బీసీ ల రక్షణకు చట్టం తెస్తామని చంద్రబాబు ఓ ఎన్నికల హామీ ఇచ్చేసారు. కొన్ని కులాలకు వున్నట్లుగానే బీసీలకు కూడా రక్షణ చట్టం తేవాలన్నది..లేదా తెస్తామన్నది బాబుగారి ఆలోచన. కానీ ఇది ఏ మేరకు…

బీసీ ల రక్షణకు చట్టం తెస్తామని చంద్రబాబు ఓ ఎన్నికల హామీ ఇచ్చేసారు. కొన్ని కులాలకు వున్నట్లుగానే బీసీలకు కూడా రక్షణ చట్టం తేవాలన్నది..లేదా తెస్తామన్నది బాబుగారి ఆలోచన. కానీ ఇది ఏ మేరకు సాధ్యం? ఏ మేరకు అవసరం? దాని పర్యవసానాలు ఎలా వుంటాయి అన్నది ఆలోచిస్తున్నారా? ఇదే ప్రతిపాదన కనుక జగన్ చేసి వుంటే మీడియా చానెళ్లు దీని మీద బలమైన డిస్కషన్లు జరిపి వుండేవి. కానీ చంద్రబాబు చేసిన ప్రతిపాదన కనుక అస్సలు దీని గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు.

ఇప్పటికే కొన్ని కులాలకు వున్న రక్షణ చట్టాల విషయంలో పలు వాదనలు వున్నాయి. కేంద్రం, కోర్టులు ఈ విషయంలో కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం, మళ్లీ వాటిని ఉపసంహరించుకోవడం వంటివి జరిగాయి. ప్రతిపక్షాలు కూడా చట్టాలను వాడుకుని అధికారపక్షం వేధింపులకు గురించేస్తోందని పదే పదే చెబుతున్నాయి. కొన్ని రక్షణ చట్టాలు కొన్ని సార్లు దుర్వినియోగం అవుతున్నాయనే వాదనలు కూడా వున్నాయి.

ఇప్పుడు బీసీలకు రక్షణ చట్టం అదే మాదిరి చట్టం తీసుకువస్తే పరిస్థితి ఏమిటి? ఇక మిగిలిపోయింది కేవలం కొన్ని అగ్ర వర్ణాలు మాత్రమే. ఈ అగ్రవర్ణాలు అన్నీ ఇకపై తల దించుకుని బతకాల్సిందే. పైగా జనాభాలో బీసీల సంఖ్య అధికం. ఇక ఏ తగాదా వచ్చినా పోలీస్ స్టేషన్లలో, కోర్టుల్లో నిండిపోయేవి ఈ రక్షణ చట్టం ప్రాతిపదికగా దాఖలయ్యే కేసులే. ప్రతి జిల్లాలో మూడు వంతులకు పైగా జనాభా ఈ చట్టం పరిథిలోకి వచ్చేస్తుంది.

ఇప్పటికి వున్న కొన్ని కులాల రక్షణ చట్టాల విషయంలో పత్రికల్లో అగ్రవర్ణాలుగా ప్రస్తావనకు గురయ్యే వారిలో ఎక్కువ మంది బీసీలు కావడం గమనార్హం. ఇప్పుడు ఇక బీసీలకు కూడా రక్షణ చట్టం అమలు చేస్తే, ఇప్పటికే కొన్ని కులాలకు వున్న రక్షణ చట్టాలకు విలువలేకుండా పోతుంది. ఎందుకంటే దాడి చేసిన వారు, దాడికి గురైన వారు ఇద్దరూ రక్షణ చట్టాల పరిథిలో వుంటే పెద్దగా ప్రభావం ఏమీ వుండదు. అదే రక్షణ లేని వారు రక్షణ వున్న వారిపై దాడి చేస్తే దాని ప్రభావం వేరుగా వుంటుంది.

అందువల్ల చంద్రబాబు తలపెట్టిన ఈ బీసీల రక్షణ చట్టం సాధ్యాసాధ్యాలు, అవసరాలు ఇలా అన్నింటిపై విస్తృతంగా అధ్యయనం, చర్చలు జరగాల్సి వుంది. అసలు బీసీలపై దాడులు అన్నది ఆలోచించాల్సిన విషయం. ఉదాహరణకు ప్రతి జిల్లాల్లో ప్రధాన కులాలు అన్నీ ఎక్కువగా బీసీలే. ఇక దాడులు చేసేది ఎవరు? కేవలం డబ్బులతో వరాలు ఇవ్వడం వల్ల నమ్మరు అని ఈ కొత్త ఎత్తుగడ ఎత్తారు చంద్రబాబు. ఇది అమలు అంత సులువు కాదని ఆయనకీ తెలుసు. ఎన్ని కోర్టులు..ఎన్ని అభ్యంతరాలు దాటుకుని ఇది బయటకు రావాలి. అది అంత సులువు కాదు.

కేవలం బీసీలను మభ్యపెట్టడానికి చేసిన యత్నం తప్ప వేరు. కానీ దీన్ని బయటపెట్టాలంటే ముందుగా చర్చలు ప్రారంభం కావాలి.