అమెరికా తెలుగు సంఘాలు ఎదుర్కొంటున్న సవాళ్లు

అమెరికాలో తెలుగు అసోషియేన్ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు తానా. ఇది ఇప్పటిది కాదు. దాదాపు ఐదు దశాబ్దాలక్రితం 1977లో స్థాపించబడిన సమితి ఇది. తెలుగు జనాభా పెరిగే కొద్దీ, అందునా వారి…

అమెరికాలో తెలుగు అసోషియేన్ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు తానా. ఇది ఇప్పటిది కాదు. దాదాపు ఐదు దశాబ్దాలక్రితం 1977లో స్థాపించబడిన సమితి ఇది. తెలుగు జనాభా పెరిగే కొద్దీ, అందునా వారి ఆదాయాలు పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త తెలుగు సమితులు ఆవిర్భవిస్తున్నాయి.

వాటిల్లో నాటా, ఆటా, నాట్స్, టాటా తో పాటు కొత్తగా మాటా కూడా ఆవిర్భవించింది. ఇవి కాక ఎక్కడికక్కడ స్థానికంగా బే ఏరియా, వాషింగ్టన్, న్యూజెర్సీ ఇలా రాష్ట్రస్థాయి తెలుగు అసోషియేన్స్ కూడా ఉన్నాయి. ఇంతకీ ఈ అసోషియేషన్స్ ఉద్దేశమేమిటి? ఎవరి కోసం ఎవరు నడుపుతున్నారు? అనే ప్రశ్నలు వేసుకుంటే ప్రధానంగా వినిపించేది “కులాధిపత్యం చాటుకోవడానికి” అని. తెలుగు రాష్ట్రాల్లో కులాలకి, రాజకీయాలకి అన్యోన్య సంబంధం ఎలాగూ ఉంటుంది కాబట్టి అమెరికా తెలుగు అసోషియేషన్స్ కి రాజకీయ రంగులు కూడా పులమబడ్డాయి. 

సరే..కులమో, రాజకీయమో…బ్రతుకుతెరువు కోసం అమెరికాకి వలస వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్న తెలుగు వారికి ఈ అసోషియేన్స్ నడిపే తీరిక ఎక్కడిది? దేశం దాటిపోయినా ఇంకా కులం, రాజకీయం అంటూ జపం చేయడం వల్ల ఒరిగేది ఏవిటి? అనే ప్రశ్నలు కూడా కొందరికి వస్తాయి.

ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని ఆస్తులు పోగేసినా నాయకత్వం వహించాలి, పరిచయాలు పెంచుకోవాలి, సెలెబ్రిటీలు సైతం గుర్తించాలి, వేదికలెక్కి మాట్లాడాలి లాంటి కోరికలు సహజంగా కొందరిలో ఉంటాయి. ఆయా కోరికలకి సమర్ధత కూడా తోడైనప్పుడు వారు నాయకులౌతారు, సంఘాలని నడుపుతారు. పర్యవసానంగా పాపులారిటీతో పాటు తెలుగు నేల మీద ఉన్న ముఖ్యమంత్రిస్థాయి నాయకులతో పరిచయాలు తద్వారా ఒనగూరే లబ్ధి ఏదైనా ఉంటే ఉండొచ్చు. 

ఈ తెలుగు అసోషియేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం లోకల్ గా ఉన్న తెలుగు వారికెవరికైనా ఇబ్బందులొస్తే చేదోడు వాదోడుగా ఉండడం, అనుకోని పరిస్థితుల్లో ఏ తెలుగు విద్యార్థో యాక్సిడెంట్లో మరణిస్తే ఆ బాడీని ఇండియాకి తరలించే ఖర్చులు భరించి, లీగల్ క్లియరెన్స్ తీసుకొచ్చి పంపడం. గృహహింసతో బాధపడే మహిళలకు సైతం లీగల్ సాయం అందించడం, ఇన్సూరెన్స్ కవరేజ్ లేని వైద్య సహాయానికి ముందుకు రావడం మొదలైనవి. 

ఇవన్నీ చేయడానికి ఆయా సంఘాల అకౌంట్లలో డబ్బులుండాలి. దాని కోసం ఎప్పటికప్పుడు ఫండ్ రైజింగ్ చేస్తుండాలి. ఇదే కాక రెండేళ్లకొకసారి ఇండియా నుంచి సినీ కళాకారుల్ని రప్పించి, వారితో పాటు లోకల్ ట్యాలెంట్ ని కూడా కలిపి సంబరాలు నిర్వహించి తెలుగు నేలకి అమెరికాకి మధ్యలో సాంస్కృతిక వారధి నిర్మించడం వంటి లక్ష్యం కూడా ప్రతి సంఘానికి ఉంటుంది. నిజానికి ఈ రెండో విషయం వల్లనే ఈ సంస్థలు పాపులర్ అయ్యాయి. 

స్పర్ధయా వర్ధతే..అన్నట్టుగా ఒక సంఘంతో మరొక సంఘం పోటీ పడి వాటి వాటి ఉనికిని చాటుతున్నాయి. ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే అమెరికాలో ఉన్నన్ని తెలుగు అసోషియేషన్స్ మరే ఇతర భారతీయ భాషల వారికి లేవు. 

మరి ఇన్నేసి తెలుగు సంఘాలు ప్రతి ఏడు సంబరాలు నిర్వహించాలంటే ఎంతమందిని ఫండ్స్ అడగాలి? ఎంతమంది కళాకారుల్ని ఇండియా నుంచి తీసుకురావాలి? 

స్టార్స్ వస్తున్నారంటే తప్ప ఫండ్ రైజింగ్ కష్టమవుతుంది. స్టార్స్ ఊరికే రారు. భారీగా రొక్కం చెల్లించుకోవాలి. ప్యాన్ ఇండియా స్థాయికి ఎదిగిన ఒక హీరోని, ఆమె పక్కన అదే సినిమాలో హీరోయిన్ గా నటించిన ఒక హీరోయిన్ ని ఒక తెలుగు అసోషియేషన్ ఆహ్వానిస్తే ఇద్దరూ కలిపి అడిగింది మూడున్నర కోట్ల రూపాయలు, నాలుగు ఫస్ట్ క్లాస్ టికెట్స్, ఎనిమిది బిజినెస్ క్లాస్ టికెట్స్. అంటే మొత్తం కలిపి నాలుగున్నర కోట్లవుతుంది. ఇదంతా కేవలం మూడు రోజుల వేడుకలో ఒక రోజు వేదికెక్కి మాట్లాడడానికి మాత్రమే. వద్దనుకుని విరమించుకున్నారు ఆ సంఘం వారు. 

ఇలాంటి నేపథ్యంలో ఉన్నంతలో తక్కువకి పలికే మిడ్ రేంజ్ హీరో హీరోయిన్స్, గత తరం నాటి దర్శకులు, బిగ్ బాస్ కంటెష్టెంట్లు, టిక్ టాక్ సెలెబ్రిటీలు..ఇలా వీళ్లనే పిలవాల్సివస్తోంది. ఇక్కడ మరొక పెద్ద చాలెంజ్ ఏమిటంటే వీసాలు. అమెరికా వీసా రావడం అంత తేలిక కాదు. అప్లై చేసిన ప్రతివారికి రాదు. సుప్రసిద్ధ దర్శకులకి, హీరోలకి కూడా వీసా రిజెక్షన్స్ అవుతుంటాయి. 

మొత్తానికి ఎలాగో అలా తీసుకు రాగలిగినంత మందిని తీసుకొచ్చి, కాస్త చమురు వదిలినా పేరున్న మిడ్ రేంజ్ హీరోనో, హీరోయిన్నో తీసుకొచ్చి సంబరాలు నిర్వాహించాలంటే ఎదురయ్యే మరొక పెద్ద చాలెంజ్ అన్ని కార్యక్రమాల్ని ఆ సెలెబ్రిటీల మునందే నిర్వహించాలనే స్పాన్సర్స్ డిమాండ్. లక్ష డాలర్లు విరాళమిచ్చిన ఆసామికి సదరు టాప్ సెలెబ్రిటీస్ ముందు తన కంపెనీ గురించో తన గొప్పతనం గురించో చెప్పుకోవాలని ఉంటుంది.

యాభై వేలిచ్చిన మరొక పెద్దమనిషికి అదే సెలెబ్రిటీస్ తన పిల్లలు చేసే డ్యాన్స్ చూసి మెచ్చుకోవాలని, వారి చేతులమీదుగా తన పిల్లలకి సన్మానం జరగాలని ఉంటుంది. విరాళాలు పుచ్చుకునేటప్పుడు అన్నిటికీ ఒప్పేసుకుంటారు సంఘాల నాయకులు. కానీ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు అన్ని డిమాండ్స్ ని పూర్తి చేయలేక చేతులెత్తేస్తారు. పర్యవసానంగా తెలుగు సంఘాల మీద విరాళాలివ్వగలిగే తెలుగు వారు సైతం నమ్మకం కోల్పోతారు. ఇది ప్రతిసారీ జరిగేదే. ఈ పొరపాట్లు జరగకూడదంటే నాయకత్వం చాలా బలంగా ఉండాలి.

మొత్తం ఈవెంట్ మీద, పిలుచుకొచ్చిన సెలెబ్రిటీల మీద పూర్తి కంట్రోల్ ఉండాలి. సమయపాలన ఉండాలి. అంతా అధినాయకత్వం కనుసల్లోనే జరగాలనే ఆశపెట్టుకోకుండా వేరు వేరు కార్యక్రమాలని సమర్ధులైన ఉపనాయకులకి అప్పజెప్పి వారితో అనుసంధాననంలో ఉండాలి. ఇది అషామాషీ విషయమైతే కాదు. అందునా వచ్చిన కళాకారుల్ని సాదరంగా గౌరవించడం వంటివి పెద్ద వేదిక మీద ఘనంగా చేస్తే పారితోషికం దగ్గర కాంప్రమైజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. లేకపోతే సంస్థకే చెడ్డపేరు తీసుకుచ్చినవారౌతారు. 

న్యూజెర్సీలో నాట్స్ సంబరాలు ముగిసాయి. అందులో జరిగిన పొరపాట్లు డల్లాస్ లో మరొక 25 రోజుల్లో జరగబోయే నాటా వేడుకలో జరగకుండా జాగ్రత్తపాడాలి. అక్కడి కంటే మిన్నగా జూలై మొదటివారంలో ఫిలడెల్ఫియాలో జరగబోయే తానా వేడుకలు జరగాలి. 

సొంతలాభం కొంత చూసుకోకుండా ఎవరూ ఏ సేవా కార్యక్రమాలూ చేయలేరు. ఆ లాభం ఆర్ధికమే కావాల్సిన అవసరం లేదు..హార్దికమైన కావొచ్చు. ఏదిఏమైనా అమెరికాలోని తెలుగు సంఘాలు పెరగడం, భారీగా సంబరాలు నిర్వహించడం, అంతే గొప్పగా జనాదరణ లభించడం అమెరికాలోని తెలుగువారి ఆర్ధికపరిపుష్టికి నిదర్శనం. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుందాం. 

హరగోపాల్ సూరపనేని