తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురి కావడం, యశోద ఆస్పత్రికి వెళ్లడంపై మీడియా కథనాలు ఆందోళన రేకెత్తించాయి. కేసీఆర్ వెంట భార్య శోభ, కూతురు కవిత, మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్, ఎంపీ సంతోషరావు తదితర రక్త సంబంధీకులు ఉండడంతో రకరకాల ప్రచారం తెరపైకి వచ్చింది. యాంజియోగ్రామ్, సిటీ స్కాన్, ఇతర వైద్య పరీక్షలు చేశారు.
అయితే కేసీఆర్ ఆరోగ్యం బాగుందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. కేసీఆర్‌కు అనారోగ్యమనే విషయం తెలియగానే, ఆయన రాజకీయ ప్రత్యర్థి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ట్విటర్ వేదికగా స్పందించారు.
“తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారి అనారోగ్య సమాచారం ఆందోళనకు గురి చేసింది. అమ్మవారి కృపతో కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని బండి సంజయ్ ఆకాంక్షించారు.
ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ, కేంద్రప్రభుత్వ విధానాలు, తన రాష్ట్ర బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారనే సమాచారం తెలియగానే, రాజకీయాలను పక్కన పెట్టి బండి సంజయ్ స్పందించడం విశేషం.