తెలంగాణలో గవర్నర్ తమిళి సై తో కేసీఆర్ డైరెక్ట్ ఫైట్ కి దిగారు. ఇటు ఏపీలో హైకోర్ట్ అధికారాలపై అసెంబ్లీలో చర్చించాలంటున్నారు వైసీపీ నేతలు. రెండు రాష్ట్రాల్లో రెండు రాజ్యాంగ వ్యవస్థలతో ఇద్దరు సీఎంలు కుస్తీలు పడుతున్నారు.
వ్యవస్థలను నాయకులు చెప్పుచేతల్లో పెట్టుకోవాలనుకోరు కానీ మరీ ఈ స్థాయిలో వ్యతిరేకత కూడా ఉండాలనుకోరు. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆయా వ్యవస్థలతో ప్రభుత్వాలు తీవ్ర స్థాయిలో ఒత్తిడికి గురవుతున్నాయి. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలా అని సతమతం అవుతున్నాయి.
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ హైకోర్టు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయం అయినా కోర్టు పరిధిలోకి వస్తే ఎలాంటి ఫలితం వస్తుందే ముందే ఊహించొచ్చు. దాదాపుగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నిర్ణయాన్ని ప్రతిపక్షాలు కోర్టులో సవాల్ చేస్తున్నాయి.
పేదలకు ఇళ్ల పంపిణీ దగ్గర్నుంచి మూడు రాజధానుల వరకు చిన్నా, పెద్దా.. అన్ని నిర్ణయాలను కోర్టు ముందుకు తీసుకెళ్తున్నారు. దాదాపుగా ఇలాంటి కేసుల్లో నూటికి 90శాతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయంటే అతిశయోక్తి కాదు.
రీసెంట్ గా మూడు రాజధానుల విషయంలో ఏపీ హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చింది. దీంతో ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. ఏకంగా అసెంబ్లీలో దీనిపై చర్చించాలని నిర్ణయించారు నేతలు. హైకోర్టు అధికారాల పరిధిపై చర్చకు నేతలు పట్టుబడుతున్నారు.
అక్కడ గవర్నర్ తో పేచీ..
తెలంగాణలో సీఎం కేసీఆర్ కి గవర్నర్ తో పేచీ మొదలైంది. గవర్నర్ తమిళి సై, కేసీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆమధ్య ఎమ్మెల్సీ స్థానానికి తాను సిఫార్సు చేసిన వారిని నియమించకపోవడంతో కేసీఆర్ నొచ్చుకున్నారు. ఆ తర్వాత ఒకటి రెండు నిర్ణయాల్లో కూడా గవర్నర్ కేసీఆర్ సహనాన్ని పరీక్షించారు. దీంతో ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా చేశారు సీఎం. అక్కడిగో గొడవ మరింత ముదిరింది. భవిష్యత్తులో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
విచిత్రంగా ఏపీ ప్రభుత్వం గవర్నర్ తో పూర్తి సఖ్యతగా ఉంటోంది. ఇక్కడ పేచీ కేవలం హైకోర్టు తోనే. అక్కడ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టుతో ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ కోర్టులు ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం లేదు. జోక్యం చేసుకున్నా.. పూర్తిగా ఆ నిర్ణయాలను వ్యతిరేకించిన సందర్భాలు లేవు.
కేవలం గవర్నర్ తోనే కేసీఆర్ ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రభుత్వాలు, రెండు వేర్వేరు రాజ్యాంగ వ్యవస్థలతో అవస్థలు పడుతుండటం విశేషం.