Advertisement

Advertisement


Home > Movies - Reviews

Radhe Shyam review: మూవీ రివ్యూ: రాధే శ్యామ్‌

Radhe Shyam review: మూవీ రివ్యూ: రాధే శ్యామ్‌

టైటిల్: రాధే శ్యామ్‌
రేటింగ్: 2.75/5
తారాగణం: ప్రభాస్, పూజా హెగ్డే, భాగ్యశ్రీ, జగపాతి బాబు, కృష్ణం రాజు తదితరులు
కెమెరా: మనోజ్ పరమహంస
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతం (నేపథ్యం): ఎస్. తమన్
సంగీతం (పాటలు): జస్టిన్ ప్రభాకరన్
నిర్మాత: వంశీ ప్రమోద్, ప్రసీద
దర్సకత్వం: రాధా కృష్ణ కుమార్ 
విడుదల తేదీ: 11 మార్చ్ 2022

"రాధే శ్యామ్‌"- ఈ టైటిల్ వినగానే గుర్తొచ్చేది ఒకే ఒక్క పేరు..ప్రభాస్. ఆ తర్వాత జ్ఞప్తికొచ్చే మొహం పూజా హెగ్డే. 

దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్రేమకథా చిత్రంగా ప్రచారం చేసుకుంది. 

ఇంత భారీ చిత్రానికి దర్శకత్వం వహించింది రాధా కృష్ణకుమార్. ఎప్పుడో ఆరేడేళ్ల క్రితం "జిల్" అనే సినిమాకి దర్శకత్వం వహించడం, ఆ ముందు రెండు సినిమాలకి సంభాషణలు రాయడం తప్ప పెద్దగా చరిత్రను నమోదు చేసుకోని దర్శకుడు. 

అలాంటి దర్శకుడి మీద నమ్మకం పెట్టుకుని ఏకంగా 300- 350 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించిన సాహసం చేసిన నిర్మాత వంశీ ప్రమోద్. 

ప్రభాస్ హీరో కావడం ప్రధానాంశమైతే ఈ సినిమాపై ఆసక్తి నెలకొనడానికి మరొక ముఖ్య కారణం ఇందులో తాను హస్తసాముద్రిక జ్యోతిష్కుడిగా కనిపించడం. 

ఇటలీ లో 1970 బ్యాక్డ్రాపులో సినిమా తీసారని పేర్కొనడం, దానికి సంబంధించిన అద్భుతమైన విజువల్స్ ట్రైలర్లో దర్శనమివ్వడం ఈ చిత్రంపై అంచనాలు పెరగడానికి మరొక విషయం. 

సాధారణంగా ఈ స్థాయి చిత్రాలలోని పాటలు విడుదలకు ముందే జనం నోళ్ళల్లో నానతాయి, చెవుల్లో రింగుమంటాయి. కానీ అదేంటో కానీ యూట్యూబులో ఎన్ని వ్యూవ్స్ వచ్చాయని చెప్పినా ఈ మధ్య వచ్చిన పెద్ద సినిమాల్లోని పాటల్లాగ ఇవంతగా జనాదరణ పొందినట్టు లేదు. అదొక్కటీ విడుదలకు ముందు ఈ సినిమా విషయంలో ప్రధానమైన మైనస్. అయినప్పటికీ అంచనాలు తక్కువగా అయితే ఏర్పడలేదు. 

ఈ సినిమాతో సంబంధం లేకపోయినా రాజమౌళి కూడా తనకి ప్రభాస్ తో ఉన్న బంధం కారణంగా ఈ చిత్రాన్ని తనదైన శైలిలో ప్రమోట్ చెసారు. 

ఈ నేపథ్యంలో విడుదలైన ఈ రాధే శ్యామ్‌ బాగోగులేవిటో చూద్దాం.

డెస్టినీని, ఆ డెస్టినీని సూచించే హస్త రేఖల్ని నమ్మాలని చెప్పే సినిమా ఇది. అంతే కాకుండా డెస్టినీకి ఎదురెళ్లి పోరాడి గెలిచే 1% మంది జనాభా మాత్రమే చరిత్రలో నిలుస్తారని చెప్పే కథ కూడా ఇదే. ఎలా చూసుకున్నా "జాతకాల్ని నమ్మాలి..కానీ కష్టపడి జాతకాల్ని అధిగమించి కోరింది పొందగలగాలి.." అనేది ఈ కథలోని ఆంతర్యం. 

సైంటిఫిక్ కాదని, శాస్త్రసమ్మతం కాదని, అన్ని సార్లూ ప్రెడిక్షన్స్ నిజం కావని చెప్పినా హస్తసాముద్రికాన్ని, జాతకాల్ని నమ్మే ప్రజలు సమాజంలో చాలా ఎక్కువ. కనుక ఆ బేస్ మీద సినిమా తీస్తే ఆ ఎక్కువమందికి ప్రజలు తమకు ప్రేక్షకులుగా మారతారనే ఉద్దేశ్యంతో ఈ సినిమా తీసుండొచ్చు. 

అయితే ప్రభాస్ ఆలిండియా రేంజ్ మాస్ హీరో. అతను కత్తులు పట్టుకుని యుద్ధం చేసే యోధుడిగా "బాహుబలి" ద్వారా దేశానికి పరిచయమయ్యాడు. మొడర్న్ ఫైట్స్ తొ చితక్కోటే యాక్షన్ హీరో గా "సాహో"లో కనిపించాడు. 

అయితే ఈ "రాధే శ్యామ్‌" లో అతను ఎటువంటి ఫైట్స్ చేయడు, హీరోయిన్ ని టీజ్ చేయడు, జాతకాల్ని నమ్ముతాడు, ఆ నమ్మకంతో అనేకమైన యాంటీ-మాస్-హీరో నిర్ణయాలు తీసుకుంటుంటాడు. ఇవన్నీ హార్డ్ కోర్ ప్రభాస్ ఫ్యాన్స్ కి నచ్చకపోవచ్చు. 

అవన్నీ తెలిసే డేరింగ్ గా పెద్ద ప్రయోగం చేసారు. అయినా తప్పులేదు. కానీ ఇందులో దర్శకత్వ విభాగంలో చేసిన పెద్ద పొరపాట్లు మూడున్నాయి. 

1. ఎంతమంది నటీనటులున్నా వాళ్లకి సరైన క్యారెక్టర్స్ రాసుకోకపోవడం, నటించడానికి స్కోప్ ఇవ్వకపోవడం.

2. అవసరం లేకపోయినా వందల కోట్లు ఖర్చు పెట్టి 1970 ల నాటి ఇటలీ సెట్ ని ఇటలీకెళ్లి వేసుకోవడం

3. ప్రేమకథకి కావాల్సిన మంచి పాటలు జనం నోళ్లల్లో నానేలా తయారు చేసుకోలేకపోవడం  

అలనాటి "ప్రేమపావురాలు" నటి భాగ్యశ్రీని ప్రభాస్ తల్లిగా నటింపజేసారు. కానీ ఆమెకి కొడుక్కి మధ్యలో ఎటువంటి అనురాగం చూపించలేదు. అసలామె పాత్ర ప్రాధాన్యత ఏవిటో ఎస్టాబ్లిష్ కాలేదు. 

కునాల్ రాయ్ కపూర్ ని ప్రభాస్ ఫ్రెండుగా తీసుకొచ్చారు. అనవసరపు ప్యాడింగ్ ఆర్టిస్టుగా ఉన్నాడే తప్ప కథకి ఉపయోగపడలేదు. 

మురళీ శర్మ లాంటి మంచి నటుడికి కనీసం ఒక మంచి క్లోజప్ కానీ, డయలాగ్ కానీ పెట్టలేదు. 

అసలు వీళ్లంతా ఈ కథలో ఉన్నా లేకపోయినా ఫరక్ పడదన్నట్టుగా ఉన్నారు. అది స్క్రిప్టులో ఉన్న లోపం. 

అన్నిటికంటే ముఖ్యమయింది పాటలు. అప్పట్లో "1942 ఏ లవ్ స్టోరీ" అనే సినిమా వచ్చింది. టైటిల్లో ప్రేమకథ ఉన్నా నేపథ్యమంతా స్వాతంత్రోద్యమం. అందులో ప్రతీ పాటా సూపర్ హిట్టే.

ఈ "రాధే శ్యామ్‌" కూడా పేరుకి లవ్ స్టోరీయే. నేపథ్యం మాత్రం హస్తసాముద్రికం. పాటలు చూస్తే వీక్. 

గీతాంజలైనా, సఖి అయినా, మొన్నొచ్చిన లవ్ స్టోరీ అయినా అన్నీ మ్యూజికల్ హిట్సే. ఇక్కడ రాధే శ్యామ్‌ లో ఆ పరిస్థితి లేదు. 

ఇలా ఎన్ని చెప్పుకున్నా ఈ సినిమాలో ఆకట్టుకునే కొన్ని అంశాలైతే లేకపోలేదు. 

కృష్ణం రాజుకి, సైంటిష్టులకి మధ్యన జరిగే సంభాషణ బలంగా ఉంది. సనాతన శాస్త్రానికి, సైన్సుకి మధ్యన ఉండే ఆర్గ్య్మెంటుని సున్నితంగా టచ్ చేసారు. 

తొలిసంగంలో హీరో హీరోయిన్లు వేరు వేరు బస్సులో ఉండి విండో మీద మిస్ట్ ద్వారా సంభాషించుకునే సీన్ సరదాగా ఉంది. 

తెలుసుకున్నది మాత్రమే నిజమని నమ్మి తెలియనిది అబద్ధమనుకోవడం కూడా అశాస్త్రీయమనే విషయన్ని చక్కగా చెప్పిన సినిమా ఇది. 

ఇక నేపథ్య సంగీతం మాత్రం అద్భుతంగా ఉందని చెప్పాలి. మిస్టిక్ సీన్స్ కి రజనీకాంత్ బాబాలో ఎ.ఆర్.రెహ్మాన్ స్వరపరిచిన లాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు తమన్. ఈ చిత్రాన్ని చివరిదాకా నిలబెట్టినవి విజువల్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్. 

జ్యోతిష శాస్త్రంలో ఒకటి చెప్తారు. మనిషి యొక్క జాతకం, అతని ప్రయత్నం రెండూ పొట్టేళ్లలా ఢీకొంటాయట. రెండిట్లో ఏది బలంగా ఉంటే అది గెలుస్తుందట. అదే విషయాన్ని ఆ ఉదాహరణతో కాకపోయినా అదే అర్థం వచ్చేలా చూపించారు మలిసగంలో. 

ప్రభాస్ తెర మీద చాలా బాగున్నాడు. అతని లుక్స్ కోసం గ్రాఫిక్స్ బడ్జెట్ గట్టిగానే అయినట్టుంది. పూజా ఎప్పటిలాగానే బాగుంది. 

ఎలా చూసుకున్నా ఇది ప్రేమకథాగాకంటే జ్యోతిష ప్రధాన చిత్రంగా ఎక్కువ మార్కులేయించుకునే చిత్రం. ఆ సబ్జెక్ట్ నచ్చేవాళ్లకి ఈ సినిమా కూడా నచ్చొచ్చు. 

మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి నచ్చినంతగా సింగిల్ స్క్రీన్స్ ఆడియన్స్ కి ఎక్కకపోవచ్చు. 

తెరమీద సన్నని ప్రేమరేఖైతే ఉంది కానీ ప్రచారం చేసుకున్నట్టుగా జెర్రిపోతులా లేదు. ఇంతకీ నిర్మాత చేతిలో ఐశ్వర్యరేఖ, ప్రభాస్ చేతిలో కీర్తిరేఖ ఎలా ఉన్నాయో మరి కొన్ని రోజుల్లో ఈ చిత్రఫలితమే చెప్పాలి. 

బాటం లైన్: సన్నని ప్రేమ రేఖ

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను