ముఖ్యమంత్రిగా చిరంజీవి….?

రాజకీయాలకు ఇక స్వస్తి అంటూ 2018లో రాజ్యసభ సభ్యత్వం ముగియడంతోనే మెగాస్టార్ చిరంజీవి చెప్పేసారు. ఆయన ఇపుడు సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు. అయినా సరే చిరంజీవి ప్రస్థావన ఎక్కడో ఏదో రకంగా రాజకీయాల్లో…

రాజకీయాలకు ఇక స్వస్తి అంటూ 2018లో రాజ్యసభ సభ్యత్వం ముగియడంతోనే మెగాస్టార్ చిరంజీవి చెప్పేసారు. ఆయన ఇపుడు సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు. అయినా సరే చిరంజీవి ప్రస్థావన ఎక్కడో ఏదో రకంగా రాజకీయాల్లో వస్తూనే ఉంది.

ఇటీవల కాలంలో కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ పదే పదే చిరంజీవిని తలచుకుంటున్నారు. ఆయన తాజాగా విశాఖ టూర్ లో మీడియాతో మాట్లాడుతూ చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసి ఉంటే ఏపీలో కాంగ్రెస్ కి ఈ పరిస్థితి వచ్చేది కాదని వాపోయారు.

ఆయన చెబుతున్నది 2009 నాటి ఫ్లాష్ బ్యాక్ అన్న మాట. అప్పట్లో వైఎస్సార్ మరణించాక రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వరసగా ముఖ్యమంత్రులు అయ్యారు. అయితే వారు కాకుండా చిరంజీవినే ముఖ్యమంత్రిని చేయాల్సింది అని చింతా మోహన్ తెగ చింతిస్తున్నారు. కాంగ్రెస్ అన్ని సామాజికవర్గాలకు ముఖ్యమంత్రిగా అవకాశాలు ఇచ్చిందని కాపులకు ఇవ్వలేకపోయిందని బాధను వ్యక్తం చేస్తున్నారు.

ఈసారి కేంద్రంలో ఏపీలో కాంగ్రెస్ దే అధికారమని, అపుడు కచ్చితంగా కాపుల నుంచి ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర మాజీ మంత్రి హామీ ఇస్తున్నారు. కాపుల విషయంలో కేంద్ర మాజీ మంత్రి తపన పడుతున్నారు కానీ 2009లో వైఎస్సార్ చనిపోయిన సమయంలో చిరంజీవి కాంగ్రెస్ లో లేరు అన్న సంగతిని ఆయన మరచారు. ఆయన ప్రజారాజ్యం పార్టీ  ఆ తరువాతనే కాంగ్రెస్ లో విలీనం అయింది.

చిరంజీవికి కేంద్రంలో రాజ్యసభ సీటు ఇచ్చి కాంగ్రెస్ మంత్రిని చేసింది. ఉమ్మడి ఏపీలో చిరంజీవిని సీఎం చేయాలని ఆనాడు చాలామంది కాంగ్రెస్ నాయకులు కోరుకున్నా సీనియారిటీ అంటూ కేంద్రం రోశయ్యను, కిరణ్ కుమార్ రెడ్డిని వరసగా ముఖ్యమంత్రులను చేసిందని ఆయన అంటున్నారు. 

గతాన్ని వదిలేసి కాంగ్రెస్ రేపటి ఎన్నికల్లో అయినా చిరంజీవిని సీఎం అభ్యర్ధిగా ప్రకటించి ముందుకు సాగితే బాగుంటుందేమో. ఆ పని కేంద్ర పెద్దలతో చెప్పి చింతా  మోహన్  చేయించవచ్చు కదా అంటున్నారు. అయితే చిరంజీవి రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన మాత్రం నో పాలిటిక్స్ అనేస్తున్నారు. చింతా ఆశలు నెరవేరి ఆయన కాంగ్రెస్ కి కాపు కాస్తారా అంటే ఆలోచించాల్సిందే.