తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ రోజు యాదాద్రి పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అనారోగ్య కారణంగా పర్యటన రద్దు చేసుకున్నారు. రెండు రోజులుగా స్వల్ప అస్వస్థతో బాధపడుతున్నారని సమాచారం.
ఇవాళ ఉదయం కొంచెం ఎక్కువ నలతగా ఉండడంతో హుటాహుటిన యశోద ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో యాంజియో గ్రామ్, సిటీ స్కాన్ తదితర పరీక్షలు చేసినట్టు సమాచారం. ఇటీవల ఆయన కరోనాబారిన పడి కోలుకున్నారు. ఆ సందర్భంలో తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ పర్యటనలో కూడా పాల్గొనని విషయం తెలిసిందే.
కరోనా అనంతరం అనారోగ్యంపై ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ అస్వస్థతకు గురి కావడం కుటుంబ సభ్యుల్ని, టీఆర్ఎస్ శ్రేణుల్ని ఆందోళనకు గురి చేసింది. ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదనే ఉద్దేశంతో కేసీఆర్ యశోదకు వెళ్లినట్టు సమాచారం.
కేసీఆర్ వెంట ఆయన భార్యతో పాటు కూతురైన ఎమ్మెల్సీ కె.కవిత కూడా ఉన్నట్టు సమాచారం. కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి భయపడాల్సిన పనిలేదని టీఆర్ఎస్ నేతలు తెలిపారు. కాసేపట్లో ఆయన హెల్త్‌పై యశోద ఆస్పత్రి బులెటిన్ విడుదల చేస్తుందని వార్తలొస్తున్నాయి.