భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అయితే, ఈ దేశంలో హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ తమ పార్టీకే ఓటు వేయాలని అనుకుంటూ ఉంటుందో.. అదే రీతిగా ముస్లింగా పుట్టిన ప్రతి ఒక్కరూ తమకే ఓటు వేయాలని అనుకునే పార్టీ ఎంఐఎం.
హైదరాబాదుకు మాత్రమే పరిమితమైన ఈ పార్టీ.. అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలో దేశవ్యాప్తంగా తమ ముద్రను విస్తరించుకునే ప్రయత్నాల్లో చాలానే కష్టపడుతోంది. కొన్ని చోట్ల విజయాలు సాధిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్ ఎన్నికల్లో కూడా గణనీయంగానే తలపడ్డారు. అలాంటి నేపథ్యంలో దేశంలోనే కీలకమైన యూపీ ఎన్నికల్లో కూడా మజ్లిస్ ఏకంగా 97 స్థానాలకు బరిలోకి దిగింది.
భాజపాయేతర ప్రభుత్వం ఏర్పడడంలో కీలకంగా మారుతుందని అనిపించేంత ప్రచారమూ జరిగింది. ఒవైసీ స్వయంగా వెళ్లి అక్కడ ప్రచారం కూడా నిర్వహించారు. ఆ పనిలో ఉండగానే, ఆయన కారు మీద తుపాకీ కాల్పులు కూడా జరిగాయి. కానీ.. ఫలితాలు వెలువడిన తర్వాత చూస్తే.. ఆ పార్టీకి కనీసం ఒక్క శాతం సీట్లు కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో మజ్లిస్ గురించి ప్రచారంలో ఉండే అంశాలు కొన్నింటిని సమీక్షించుకోవాలి.
హిందువుల బీజేపీ లాగా.. ముస్లిముల పార్టీగా పేరుతెచ్చుకున్నది గనుక మజ్లిస్, ఏదో ఒకనాటికి ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో బీజేపీకి ప్రమాదకరంగా మారుతుందనేది ఒక ప్రచారం. ఆ ప్రచారాన్ని పక్కన పెడదాం. అంతకంటె ప్రబలమైన ప్రచారం మరొకటి ఉంది.
కేంద్రంలోని బీజేపీతో మజ్లిస్‌కు, ఒవైసీకి లోపాయికారీ తెరచాటు ఒప్పందాలు ఉన్నాయని, పరోక్షంగా కమలదళం విజయం కోసమే వారు పనిచేస్తుంటారని చాలా మంది అంటూ ఉంటారు.
ఎన్నికల వేళ బిజెపి కష్టాల్లో పడుతున్నదని తెలిస్తే.. హఠాత్తుగా ఆ రాష్ట్రంలో మజ్లిస్ రంగంలోకి దిగి, బిజెపికి ఎట్టి పరిస్థితుల్లోనూ పడే అవకాశం లేని, ముస్లిం ఓట్లు బిజెపికి గట్టిపోటీ ఇచ్చే ప్రధాన ప్రత్యర్థులకు పడకుండా.. వాటిని చీల్చడం ద్వారా.. మజ్లిస్ పరోక్షంగా బిజెపికే సాయం చేస్తుందన్నది రెండో ప్రచారం. బిజెపి వ్యతిరేకులు చాలా మంది మజ్లిస్ విషయంలో ఇలాంటి అభిప్రాయం కలిగి ఉంటారు.
అయితే యూపీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. ఈ రకం ప్రచారాన్ని ఇక మరచిపోవచ్చు. బిజెపి వ్యతిరేక ఓటును ‘చీల్చి’ కమలదళానికి సాయం చేసేంత, అలాంటి సాయానికి భారీ మొత్తాల్లో డీల్ మాట్లాడుకునేంత సీన్ మజ్లిస్ కు లేదని స్పష్టమైపోయింది. యూపీ ఎన్నికల్లో గెలిచిన బిజెపికి 41.6 శాతం ఓట్లు దక్కితే.. మజ్లిస్ కు దక్కినది కేవలం 0.47 శాతం మాత్రమే. ఒక్క శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేని వారు.. ఫలితాలను ఏం ప్రభావితం చేయగలరు? ఏం డీల్ మాట్లాడుకోగలరు? అనేది గమనించాలి.
ఒవైసీ కూడా.. ముస్లిం ఓట్లు ఎక్కడ కాసిని కనిపిస్తే.. అవన్నీ తన పార్టీకే పడతాయన్నట్టుగా.. అక్కడకు వెళ్లి.. బరిలోకి దిగి హడావిడి చేయడం కాకుండా.. తమ కుటుంబాన్ని నిజాయితీగా నమ్ముకుని ప్రతిసారీ తిరుగులేకుండా గెలిపిస్తున్న హైదరాబాద్ ముస్లింల వికాసానికి, వాస్తవమైన అభివృద్ధికి పాటుపడితే బాగుంటుంది.