5 రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ కి 3 ఎదురుదెబ్బలు తగిలాయి. అందుకే ఆయన ఫలితాలు వచ్చి గంటలు గడుస్తున్నా ఇంకా స్పందించలేదు.
జాతీయ నాయకుడిని నేను, ఢిల్లీ నుంచి మోదీని తరిమేస్తా, తెలంగాణ అజెండాని దేశవ్యాప్తంగా అమలు చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కచ్చితంగా ఓ విశ్లేషణ ఇస్తే బాగుండేది. కానీ ఆయన ఇరుకున పడ్డారు. కేసీఆర్ కి తగిలిన ఎదురు దెబ్బలేంటంటే..?
బీజేపీ 4 చోట్ల గెలవడం..
యూపీలో బీజేపీ గెలుపు ఊహించినదే అయినా.. కనీసం ఆ మూడు రాష్ట్రాల్లో అయినా హంగ్ ఏర్పడుతుందని చాలామంది అంచనా వేశారు. కానీ ఎక్కడా ఆ అవకాశం లేకుండా బీజేపీ నిర్ణయాత్మక స్థానాల్లో విజయం సాధించింది. ఇది చాలామందికి మింగుడు పడని అంశం. దీంతో బీజేపీని నేరుగా విమర్శించలేని పరిస్థితి.
ఇక్కడే కేసీఆర్ ఇరుకున పడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కడదామనుకున్నారు కేసీఆర్. కానీ అక్కడ కూటములన్నిటినీ తుడిచిపెట్టేస్తోంది కమలదళం. ఈ దశలో ఎన్నికల ఫలితాలపై స్పందించడం కంటే మౌనమే మంచిదనుకుంటున్నారు గులాబీ దళపతి.
అవసరానికి పనికొస్తుందనుకున్న కాంగ్రెస్ నేలకరవడం..
కేసీఆర్ బీజేపీని వ్యతిరేకించే క్రమంలో కాంగ్రెస్ కి దగ్గరవ్వాలనుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. అందుకే ఇటీవల కాలంలో ఆయన కాంగ్రెస్ పై ఎక్కడా విమర్శలు చేయలేదు. పైపెచ్చు రాహుల్ గాంధీకి మద్దతుగా కూడా మాట్లాడారు. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన విమర్శలను కేసీఆర్ తిప్పికొట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు కూడా ఆ స్థాయిలో స్పందించలేదు. కేసీఆర్ మాత్రం రాహుల్ గాంధీకి అండగా నిలబడ్డారు.
ఇప్పుడు ఆ అండకూడా లేకుండా పోయింది. పంజాబ్ లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. యూపీలో సింగిల్ డిజిట్ పరిమితమైంది. మిగతా చోట్ల అధికారం అందలేదు. అంటే కాంగ్రెస్ ని నమ్ముకుంటే కేసీఆర్ పరిస్థితి అధోగతే. అందుకే ఆయనకు మాట పెగలట్లేదు.
ప్రధాన పోటీదారు కేజ్రీవాల్ క్రేజ్ పెరగడం..
కేసీఆర్ మౌనం వెనక ఉన్న మరో ముఖ్య కారణం కేజ్రీవాల్. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ ఇదే విషయం చెబుతున్నా.. మరీ ఈ స్థాయిలో ఆమ్ ఆద్మీ క్రేజ్ పెరుగుతుందని ఎవరూ ఊహించలేదు. మోదీకి మొగుడు దొరికాడంటూ జాతీయ మీడియా కేజ్రీవాల్ ని నెత్తిన పెట్టుకుంటోంది. ఈ దశలో కేసీఆర్ ఏం మాట్లాడతారు. జాతీయ స్థాయిలో మోదీ వ్యతిరేక కూటమిపై పెత్తనం కోసం కేజ్రీవాల్, మమతా బెనర్జీతోపాటు కేసీఆర్ కూడా ఇటీవల ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఈ గ్రూపులో తనకు ప్రధాన పోటీదారు కేజ్రీవాల్ క్రేజ్ పెరగడం కేసీఆర్ కి మింగుడు పడని అంశం. కనీసం కేజ్రీవాల్ ని పొగిడేందుకు కూడా కేసీఆర్ కి మనసు రాలేదంటే ఆయన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
మొత్తమ్మీద ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు కేసీఆర్ దూకుడుకి కళ్లెం వేశాయనే చెప్పాలి. అందుకే ఆయన నోరు మెదపలేదు. ఫలితాలపై తనదైన శైలిలో స్పందించనూ లేదు.