మోదీ దెబ్బకి చంద్రబాబుకి దిమ్మతిరిగింది. జాతి నాయకుడ్ని, జాతీయ నాయకుడ్ని అంటూ చెప్పుకునే బాబు నోరు మెదపలేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కనీసం బాబు నుంచి కానీ, చినబాబు నుంచి కానీ, టీడీపీ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి కానీ సరైన స్పందన లేదు.
వేచి చూద్దాం..
ప్రస్తుతానికి బీజేపీతో చంద్రబాబు స్నేహం కోరుకుంటున్నా.. లోలోపల ఆ పార్టీ పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉంటుందనే భయం బాబులో ఉంది. అందుకే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా చంద్రబాబు ఎలాంటి డైలాగులు పేల్చలేదు. ఇప్పుడు ఫలితాల తర్వాత కూడా ఆయన మాట్లాడలేదు.
ఏపీలో 2024నాటికి చంద్రబాబుకి ఓ సపోర్ట్ కావాలి. జనసేనకి ఆల్రడీ వన్ సైడ్ లవ్ ప్రపోజ్ చేశారు. ఆయన బీజేపీని వీడి తనతో కలవాలనేది బాబు ఆలోచన. పోనీ బీజేపీతో పాటు మూడు పార్టీలు కూటమి కట్టినా పర్లేదు అనుకుంటున్నారు. కానీ ఇప్పటికిప్పుడు బీజేపీని పొగిడితే జనం చీదరించుకుంటారనే అభిప్రాయం కూడా బాబులో ఉంది. అందుకే సైలెంట్ గా ఉన్నారు.
రాష్ట్ర బీజేపీతో ఇబ్బంది..
ప్రస్తుతం ఏపీ బీజేపీ చంద్రబాబుని చీల్చి చెండాడేస్తోంది. ఏ చిన్న సందర్భం దొరికినా విమర్శలు మొదలు పెడుతోంది. అసలు బాబుతో కలిసే ప్రసక్తే లేదని చెబుతోంది. అందులోనూ గతంలో చంద్రబాబు, మోదీని ఎన్నెన్ని మాటలన్నారో ఇంకా జనాలకు గుర్తుంది కూడా.
అప్పట్లో మోదీని టార్గెట్ చేసిన బాబు, ఇప్పుడు ఆయన శరణుకోరాలనుకుంటున్నారు. కానీ ఇంకా ఆ టైమ్ రాలేదని వేచి చూస్తున్నారు.
2024నాటికి ఏమవుతుంది..?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏమాత్రం తేడాకొట్టినా బాబు బయటకొచ్చేవారు. దేశంలో, రాష్ట్రంలో పాలన పడకేసిందని చెప్పుకొచ్చేవారు. దేశవ్యాప్తంగా మోదీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఆయన్ని దించాలంటే తనలాంటి శక్తులన్నీ కలవాలని ఉపదేశమిచ్చేవారు. కానీ రోజు రోజుకీ మోదీ బలపడుతుంటే సరికి బాబులో భయం పెరిగిపోతోంది.
పోనీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. ఈసారి ఆ పార్టీ సీట్ల విషయంలో పట్టుబట్టే అవకాశముంది, జనసేన కూడా తనకు గెలిచే స్థానాలే కావాలంటుంది. అందుకే బాబు వెయిట్ అండ్ సీ అనుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు బీజేపీకి జై కొట్టినా ఉపయోగం ఏదీ లేదు కాబట్టి ఆయన మరికొన్ని రోజులు వేచి చూసే అవకాశముంది.