జనసేనాని పవన్‌కల్యాణ్ రాజకీయ ఆరాధ్య నాయకురాలు, బీఎస్పీ అధినేత్రి మాయావతి శకం ముగిసినట్టేనా? అంటే … ఔననే చెప్పాలి. అత్యధిక జనాభా కలిగిన బహుజనులకు రాజకీయ వేదిక కావాలనే ఆశయంతో ఉత్తరప్రదేశ్ కేంద్రంగా కాన్షీరాం బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) స్థాపించారు. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అధికారం దక్కించుకుని దేశ వ్యాప్తంగా ఉత్తేజాన్ని నింపింది.
కాన్షీరాం నుంచి పార్టీ పగ్గాలు స్వీకరించిన మాయావతి పలు దఫాలు అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 2007లో 206 స్థానాలను దక్కించుకున్న బీఎస్పీ… నేడు ఒకే ఒక్కస్థానంతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి. 15 ఏళ్ల కాలంలో బీఎస్పీ ఏ స్థాయిలో పతనమైందో అర్థం చేసుకోవచ్చు.
గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో బీఎస్పీతో జనసేనాని పవన్‌కల్యాణ్ పొత్తు కుదుర్చుకున్నారు. వైసీపీకి దళితుల్లో మంచి పట్టు ఉన్న విషయం తెలిసిందే. బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా వైసీపీని దెబ్బ తీయొచ్చని పవన్ వ్యూహంగా చెబుతున్నారు.
మాయావతిని ఎన్నికల ప్రచారానికి కూడా పవన్ తీసుకొచ్చారు. తిరుపతి సభలో ఆమెకు పాదాభివందనం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఏపీలో మాయావతి, పవన్‌కల్యాణ్ మాయలకు దళితులు లోనుకాలేదు.
ఉత్తరప్రదేశ్‌లో మాయవతి చరిత్ర ఇక గతమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మాయవతి వ్యవహార శైలితో చివరికి బహుజనులెవరూ ఆమె వెంట లేకపోవడం చర్చనీయాంశమైంది. నాయకుల లోపాయికారి ఒప్పందాలు, ప్రత్యర్థులను దెబ్బతీయాలనే కుట్రలకు ఓటర్లు బలిపశువులు కారనేందుకు మాయావతి, పవన్‌కల్యాణ్, అసదుద్దీన్ ఓవైసీ వ్యూహాలు విఫలం కావడమే నిదర్శనమనే చర్చకు తెరలేచింది.