హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ.. అవినాష్ కు జైలా..? బెయిలా..?

గ‌త నెల నుండి అనేక మ‌లుపులు తిరుగుతున్నా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ నేడు తేలిపోనుంది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది.…

గ‌త నెల నుండి అనేక మ‌లుపులు తిరుగుతున్నా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ నేడు తేలిపోనుంది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. అవినాష్ ముందస్తు బెయిల్ పై సుప్రీం కోర్టు ఆదేశాలతో గ‌త వారం తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి దృశ్య బుధవారం వరకు అరెస్టు చేయకుండా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే.

వివేకా కేసులో అవినాష్ రెడ్డి ఇప్పటికే ఏడుసార్లు సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కాలేదు. అనారోగ్యానికి గురైన త‌న‌ తల్లిని బాగోగులను చూసుకుంటోన్న పరిస్థితుల్లో విచారణకు హాజరు కాలేననీ సీబీఐ అధికారులకు వివరించారు. కర్నూలులోని విశ్వభారతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందించారు. ఆ సమయంలో అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నారు. త‌ర్వాత‌ తన తల్లిని హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్ కు తరలించినప్పటి నుండి ఆయ‌న‌ హైదరాబాద్ లోనే ఉంటున్నారు.

కాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐకి పలు ప్రశ్నలను సంధించింది. మూడు రోజులు పాటు వాదనలు విన్న హైకోర్టు ఇవాళ‌ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తీర్పు ఇవ్వనుంది. గతంలో విచారణకు హాజరైనప్పుడే తాను అన్ని విషయాలను సీబీఐ అధికారులకు తెలియజేశానని అవినాష్ రెడ్డి పదే పదే చెబుతూ వస్తోన్న విషయం తెలిసిందే. 

మ‌రోవైపు.. ఎన్ని సార్లు విచారించిన అవినాష్ స‌హ‌క‌రించ‌డం లేద‌ని.. అందుకే ఆయ‌న్ను అదుపులోకి తీసుకోవాల‌ని కోర్టుకు సీబీఐ త‌ర‌పు వాద‌నలు వినిపించారు. ఒకవేళ ముందస్తు బెయిల్ అవినాష్ రెడ్డికి అనుకూలంగా రాక‌పోతే అరెస్ట్ అయ్యే అవ‌కాశం ఉందంటున్నారు విశ్లేష‌కులు.