జ’గన్’.. అసెంబ్లీలో మాటల తూటాలు

మిన్ను విరిగి మీద పడినా చలించని తత్వం జగన్ ది. విమర్శలు ఎన్ని వస్తున్నా పెద్దగా ఆయన పట్టించుకోరు. మాటలను పెద్దగా వాడరు. తన పనితీరుతోనే అన్నిటికీ సమాధానం చెబుతారు. అలాంటి జగన్ తాజా…

మిన్ను విరిగి మీద పడినా చలించని తత్వం జగన్ ది. విమర్శలు ఎన్ని వస్తున్నా పెద్దగా ఆయన పట్టించుకోరు. మాటలను పెద్దగా వాడరు. తన పనితీరుతోనే అన్నిటికీ సమాధానం చెబుతారు. అలాంటి జగన్ తాజా అసెంబ్లీ సమావేశాల్లో తన స్టైల్ పూర్తిగా మార్చారు. 

అసలు మాట్లాడేది జగనేనా అనేంతగా ఆయన ప్రతిపక్షాన్ని ఆటాడేసుకున్నారు. జగన్ ఏంటి ఇలా మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు కూడా విస్తుపోయారు. బల్లలు చరిచి గోల గోల చేశారు.

సెటైర్లే.. సెటైర్లు..

జగన్ పాలన మొదలై వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఇటీవల చార్జి షీట్ అంటూ టీడీపీ హడావిడి చేసిన సంగతి తెలిసిందే. దానిపై జగన్ తనదైన శైలిలో అసెంబ్లీలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తాను అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తైన విషయాన్ని పక్కనపెట్టి.. టీడీపీ అధికారం కోల్పోయి వెయ్యి రోజులైనందుకు వారు ఇంకా రగిలిపోతున్నారని సెటైర్లు వేశారు జగన్.

అధికారం కోల్పోయి రగిలిపోతున్న చంద్రబాబు పార్టీకి, దాని అనుబంధ సంస్థలకు, ఎల్లో మీడియా వారికి, వేర్వేరు పార్టీల్లో ఉంటూ చంద్రబాబు బాగు కోసం కష్టపడుతున్న అందరికీ పాన్ ఫార్టీ ట్యాబ్లెట్లు, జెలుసిల్ సిరప్ లు, ఈనో పౌడర్ అందుబాటులో ఉండాలని అన్నారు జగన్. అంటే చంద్రబాబు అండ్ టీమ్ కడుపుమంట ఆ విధంగా చల్లార్చుకోవాలని చురకలంటించారు.

బాలయ్య పరువు తీసేసిన జగన్..

ఇక జిల్లా పేర్లు, జిల్లా కేంద్రాలపై వస్తున్న అభ్యర్థనలు, ఆందోళనలపై కూడా జగన్ తనదైన శైలిలో పంచ్ లు విసిరారు. పాపం బాలయ్య ఇక్కడ జగన్ ధాటికి బలయ్యారు. హిందూపురంని జిల్లా కేంద్రంగా చేయాలని బాలకృష్ణ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అదేదో తన బావ చంద్రబాబు అధికారంలో ఉండగా ఆ పని చేయించుకోవచ్చు కదా, ఇప్పుడు నన్నెందుకు అడుగుతావు బాలయ్యా అని అసెంబ్లీలో అన్నారు జగన్.

కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ టీడీపీ గొడవ చేస్తోందని, అసలు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆ పని చేసుకోవచ్చు కదా అంటూ మరో సెటైర్ పేల్చారు. అంటే అధికారంలో ఉండగా.. కనీసం ఆ దిశగా ఆలోచించని చంద్రబాబు, బాలకృష్ణ.. ఇప్పుడు తాను అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం, ఆవేదన వెళ్లగక్కడం, ఆందోళనలకు దిగడం హాస్యాస్పదం అని ఒక్క మాటలో వారి పరువు తీసేశారు.

మొత్తమ్మీద జగన్ సీరియస్ మూడ్ నుంచి కాస్త బయటకొచ్చారు. సభలో తన ఛలోక్తులతో సహచర సభ్యుల్ని నవ్వించారు. టీడీపీ ఎమ్మెల్యేలకు నిజంగానే కడుపుమంట తెప్పించారు.