పవన్ కల్యాణ్ చిత్రమైన రాజకీయ నాయకుడు! చాలామందికి లేనంత యూత్ ఫాలోయింగ్ ఆయన సొంతం. ఆయన ఎక్కడ సభ పెట్టినా.. డబ్బులిచ్చి తోలించే అవసరం లేకుండా మినిమం గ్యారంటీ జనం పోగవుతారు. ఆయన ప్రసంగించే బహిరంగసభలు కూడా జనం పరంగా హిట్టవుతుంటాయి.
కాకపోతే ఆ బహిరంగసభల్లో ప్రసంగించేప్పుడు పవన్ కల్యాణ్ కు ఒళ్లు తెలియదు., సీరియస్గా సబ్జెక్టు మాట్లాడుతున్నవాడెల్లా.. హఠాత్తుగా అమ్మోరు పూనినట్టుగా రెచ్చిపోతాడు! శివాలెత్తుతాడు.. ఎవరెవరిమీద ఏ రేంజి తిట్లతో విరుచుకుపడతాడో ఊహించలేం. ఆ పూనకం కొన్ని క్షణాలే! అంతకంటె హఠాత్తుగా ఒక వెకిలి నవ్వు నవ్వేసి.. అంతసేపు సీరియస్గా ప్రదర్శించిన ఉగ్రరూపాన్ని కామెడీగా మార్చేస్తాడు.
వెకిలినవ్వులు వెటకారాలతో ప్రసంగాన్ని గలీజుగా మార్చేస్తాడు. ఇది ఆయన తీరు! అయితే ఇలాంటి బహిరంగసభలో ఇలాంటి వెర్రిమొర్రి శివాలెత్తే వేషాలు.. పార్టీ ఆవిర్భావ సభలో ఈసారి ఉండకపోవచ్చు. పవన్ కల్యాణ్ నుంచి కొంత డీసెంట్ ప్రసంగాన్ని ఆశించవచ్చు.
తెలుగుదేశం కన్నుగీటుతూ ఉండగా.. వారినుంచి ఎలాంటి ఆఫర్ వస్తుందో అని పవన్ కల్యాణ్ ఎదురుచూస్తున్న మాట నిజం. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధింనంత వరకు మట్టిగుర్రం లాంటి బీజేపీతో పొత్తు పెట్టుకుని.. తాను ఎన్నికల నదిని దాటడం అసాధ్యం అనే సంగతి పవన్ కు ఎరుకే. అందుకే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఏకొద్దిగా ప్రతికూల ఫలితాలు వచ్చినా.. వారిమీద రెచ్చిపోయి శివాలెత్తవచ్చునని పవన్ వ్యూహరచన చేసుకున్నారు.
ఆవిర్భావ సభలోనే ఒకేసారిగా తెగతెంపులు చేసేసుకోకుండా.. విశాఖ ఉక్కు దగ్గరినుంచి అమరావతి వరకు కేంద్రం చేస్తున్న అనేక ద్రోహాల పట్ల గట్టిగానే అసంతృప్తిని ఈ సభలో వెల్లడించదలచుకున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ద్వారా.. దేశంలో బీజేపీ బలం తగ్గుతున్నదనే సంకేతం అందినట్లయితే.. వారు కాస్త మెత్తబడుతారని.. తాను మరింత గట్టిగా వ్యవహరిస్తే మంచి బేరం కుదురుతుందనేది ఆయన వ్యూహం. లేదా, ఎటూ ఏపీలో వారి ప్రాబల్యం లేదు గనుక.. ఏపీ నష్టపోతుండడానికి కారణం బీజేపీనే అని నెపం వారి మీదకు నెట్టేసి తప్పించుకోవచ్చునని.. అనుకున్నారు.
అయితే ఇప్పుడు ఆ ప్రసంగ ప్రణాళికలు అన్నీ గల్లంతయ్యాయి. బీజేపీ హవా ఎంతగా నిరూపణ అయిందంటే.. వారితో పొత్తుల్లో ఉండడమే మహద్భాగ్యం అని మురిసిపోయేంతగా తయారైంది. ఈ నేపథ్యంలో ఇక పవన్ కల్యాణ్ నుంచి ఢిల్లీ వైఫల్యాల మీద నిప్పులు చెరిగే ప్రసంగాలు ఉండవు. ఆయనకురిపించే నిప్పులన్నీ యధావిధిగా జగన్ మీద మాత్రమే ఉంటాయి.
ఎటుపోయి ఎటు వస్తుందో అనే ఉద్దేశంతో చంద్రబాబునాయుడు వైఫల్యాల జోలికి కూడా వెళ్లడం లేదని.. మంగళగిరి ప్రసంగం పూర్తిగా జగన్ మీద మాత్రం నిప్పులు, తతిమ్మా వారి మీద మల్లెలు కురిపించేలా సాగుతుందని సమాచారం.
గతంలో తొలిసారిగా పవన్ కల్యాణ్ రెచ్చిపోయిన గుంటూరు ప్రసంగం గుర్తుందా.. అమిత్ షా ను ఉద్దేశించి.. తర్జని చూపిస్తూ.. హిందీ డైలాగులు వల్లిస్తూ.. పవన్ కల్యాణ్ పూనకం వచ్చినట్టుగా రెచ్చిపోయారు. అది రుచించిన అభిమానులందరికీ హెచ్చరిక. ఈసారి అమిత్ షా, మోడీ తదితర బీజేపీ పెద్దల మీద వీసమెత్తు ఈగవాలనిచ్చే మాట కూడా ఉండదు.
అంతవరకు ఫిక్సయిపోండి. పవన్ శివాలెత్తి ఉగ్రుడైపోవడం లేదు.. చాలా సామరస్యంగానే తన చారిత్రాత్మక (అలాగని పార్టీ వారంతా చెప్పుకుంటున్నారు మరి) ప్రసంగం ఉండబోతున్నది.