అవును. మూడేళ్ల క్రితం కేంద్రం ఘనంగా ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ అసలు కధ ఇదే. విశాఖకు రైల్వే జోన్ ఇచ్చేశాం, దశాబ్దాల నాటి కల సాకరం చేశామని కమలనాధులు నాడు గొప్పగా చెప్పుకున్నారు. ఏకంగా నాడు నరేంద్ర మోడీ సైతం విశాఖ వచ్చి రైల్వే జోన్ ఇచ్చేసిన ప్రకటనను సభలో చదివి వినిపించారు.
మరి ఆ తరువాత బీజేపీ మళ్లీ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇప్పటికి మూడు బడ్జెట్లు బీజేపీ ప్రవేశపెట్టింది. ఇందులో రైల్వే జోన్ కి ఎంత మొత్తం కేటాయించింది అని ఆరా తీస్తే అసలు నిజాలు షాక్ ఇచ్చేసేలా ఉన్నాయి. ఒక సామాజిక కార్యకర్త ఆర్టీఐ యాక్ట్ ని అనుసరించి ఈ విషయం మీద ఆరా తీస్తే చిల్లి గవ్వ కూడా ఏ బడ్జెట్ లోనూ ఇవ్వలేదు అన్నది తెలిసింది.
కేంద్రం ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్ లో విశాఖ రైల్వే జోన్ కోసం, రాయగడ డివిజన్ కోసం 170 కోట్లు కేటాయించామని చెప్పారు కానీ ఆ నిధులు ఏమీ విడుదల కాలేదు. ఇక ఆ తరువాత, 2020-21, 2021-22, 2022-23 బడ్జెట్లు చూసుకుంటే వరసగా మూడు కోట్లు, నలభై లక్షలు, నలభై లక్షలు వంతున నిధులు విడుదల చేసినట్లుగా చెబుతున్నా కూడా ఇందులో నుంచి ఒక్క పైసా కూడా విశాఖ రైల్వే జోన్ కి కానీ రాయగడ డివిజన్ కి కానీ కేటాయించలేదని తెలుస్తోంది.
వీటికి తోడు విశాఖ రైల్వే జోన్ కానీ రాయగడ డివిజన్ కానీ ఏర్పాటుకు ఇప్పటిదాకా ఏ రకమైన చర్యలనూ మొదలెట్టలేదు అన్న కఠిన నిజం కూడా వ్యక్తమవుతోంది. దీని కోసం ఒక ఓఎస్డీని నియమించినట్లుగా కేంద్ర రైల్వే శాఖ చెప్పడం బట్టి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని అర్ధమవుతోంది.
మరో వైపు చూస్తే విశాఖ రైల్వే జోన్, రాయగడ డివిజన్ లకు సంబంధించి డీపీయార్ కూడా సిద్ధం కాలేదని అంటున్నారు. మొత్తానికి చూస్తే విశాఖ రైల్వే జోన్ కి ఎర్రని ఏగానీ కూడా కేంద్రం నుంచి ఖర్చు కాలేదని ఆరిటీఐ ద్వారా రాబట్టిన సమాచారం స్పష్టం చేస్తోంది. మరి ఇదే తీరు కొనసాగితే రైల్వే జోన్ సంగతేంటో కమలనాధులే చెప్పాలిగా.