ఉద్యోగులకేం విదిలించక్కర్లేదు .. చంద్ర ధీమా!

చంద్రబాబునాయుడు ఎన్నికలకు ఏడాది ముందుగానే.. తన తాయిలాల మేనిఫెస్టోను ప్రకటించేశారు. కేవలం ఓటు బ్యాంకు మీద ఫోకస్ తోనే మహానాడు హామీలను చంద్రబాబునాయుడు ప్రకటించడం విశేషం. దాదాపుగా ఓట్లు దండుకునే పరంగా అన్ని వర్గాల…

చంద్రబాబునాయుడు ఎన్నికలకు ఏడాది ముందుగానే.. తన తాయిలాల మేనిఫెస్టోను ప్రకటించేశారు. కేవలం ఓటు బ్యాంకు మీద ఫోకస్ తోనే మహానాడు హామీలను చంద్రబాబునాయుడు ప్రకటించడం విశేషం. దాదాపుగా ఓట్లు దండుకునే పరంగా అన్ని వర్గాల వారికి కూడా చంద్రబాబు ఏదో ఒక వరం ఉండేలా, లబ్ధి ఉండేలా ఈ మేనిఫెస్టో వరాలను ప్లాన్ చేసుకున్నారు. 

అయితే ఉద్యోగులను మాత్రం పట్టించుకోలేదు. ఉద్యోగులకు మాత్రం ఎలాంటి హామీలు ఇవ్వనేలేదు. ఇంకో మేనిఫెస్టో కూడా ఉంటుందని అంటున్నారు గానీ.. అదంత పెద్ద కీలకం కాదు! అయితే ఎన్నికల పరంగా కీలకమైన ఉద్యోగుల సెక్షన్ ను చంద్రబాబు ఎందుకు విస్మరించినట్టు అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారుతోంది.

విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి ఉద్యోగులను చంద్రబాబునాయుడు విస్మరించడం అనేది ఉద్దేశపూర్వకంగానే జరిగింది అంటున్నారు. మేనిఫెస్టో రూపకల్పన కోసం పార్టీ కీలక నాయకులతో కూర్చున్నప్పుడు.. ఉద్యోగులకు సంబంధించి కూడా ఏదైనా వరాలు ప్రకటిస్తే బాగుంటుందని కొందరు సూచించారుట. అయితే చంద్రబాబునాయుడు మాత్రం వాటిని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చినట్టు సమాచారం. ఉద్యోగులకు అసలు ఏమీ ప్రకటించాల్సిన అవసరమే లేదని చంద్రబాబు అన్నట్లుగా తెలుస్తోంది.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఉద్యోగ వర్గాల్లో బోలెడంత చెడ్డపేరు మూటగట్టుకున్నారని, ఆ వర్గాల నుంచి ఎటూ ఆయనకు ఓట్లు పడవని, వారికోసం తాము ప్రత్యేకంగా ఏమీ ప్రకటించాల్సిన అవసరం లేదని చంద్రబాబు అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది.

పైగా ఉద్యోగులకు ఏ వరం ప్రకటించినా సరే వారు అంతటితో ఊరుకోరని, మాకు అది అక్కర్లేదు.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలనే డిమాండ్ తమకు వ్యతిరేకంగా డిమాండ్లు ప్రారంభిస్తారని ఆయన అన్నట్టు తెలుస్తోంది. ఓపీఎస్ అనేది అమల్లోకి తేవడం సాధ్యమయ్యే పని కాదు గానుక.. ఉద్యోగులకు వరాలు ప్రకటించే ఆలోచన చేస్తే కొరివితో తల గోక్కున్నట్టు అవుతుందని చంద్రబాబు చెప్పినట్టుగా అంటున్నారు.

చంద్రబాబు ఈ విషయంలో చాలా జాగరూకతతో వ్యవహరించినట్టు తెలుస్తోంది. జగన్ కు వ్యతిరేకంగా ఉద్యోగులు ఉద్యమించినప్పుడు మాత్రం తెలుగుదేశం ఆ మంటలను ఎగదోసింది. తీరా తమ మేనిఫెస్టో ప్రకటన సమయం వచ్చేసరికి ఉద్యోగులను పూర్తిగా విస్మరిస్తోంది. ఈ వ్యవహారం అంతా అచ్చమైన చంద్రబాబు వ్యవహార సరళికి, అవకాశవాద వైఖరికి నిదర్శనం అని పలువురు విశ్లేషిస్తున్నారు.