సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను సెలబ్రిటీలు క్యాష్ చేసుకుంటున్నారని వేరే చెప్పనక్కర్లేదు. చాన్నాళ్లుగానే ఇది జరుగుతూ ఉంది. సినిమా వాళ్లు, క్రికెటర్లతో మొదలుపెడితే.. సాదాసీదా జనాలు కూడా తమ ట్యాలెంట్ తో ఇన్ ఫ్లుయెన్సర్స్ గా మారుతూ ఉన్నారు. వీరి అకౌంట్లో పోస్టులకు ఒక్కోరి రేటు ఒక్కోరిది. అక్కడకూ సదరు సోషల్ మీడియా సైట్లు .. వీరు పెట్టే పోస్టులు పెయిడ్ పోస్టులా అనే ఆరాలు కూడా తీస్తున్నాయి. అయితే వీరి వ్యాపారానికి ఏ అడ్డంకులూ లేవు. ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీలు ఇన్ స్టాగ్రమ్ పోస్టులతోనే కోట్ల రూపాయలు కుప్పేసుకుంటున్నారు.
ఆ జాబితాను ఒక సారి పరిశీలిస్తే.. ఈ జాబితాలో టాప్ లో ఉన్నాడు విరాట్ కొహ్లీ. టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్సీ చేతిలో లేకపోయినా విరాట్ వ్యాపారానికి అయితే ఏ లోటూ లేదు. ఆసియాలోకెళ్లా అత్యధికమంది ఫాలోయర్లను కలిగిన సెలబ్రిటీ అయిన విరాట్ తన ఇన్ స్టా అకౌంట్లో పోస్టుకు మూడున్నర నుంచి ఐదు కోట్ల రూపాయలు చార్జ్ చేస్తూ ఉన్నాడు.
విరాట్ చేత పోస్టు పెట్టించుకోవాలనుకుంటే ఏ బ్రాండ్ అయినా ఈ మేరకు డబ్బులు చెల్లించాల్సిందే. ఇతడికి 250 మిలియన్ల మంది ఫాలోయర్లున్నారు. వారికి రీచ్ కావడానికి వ్యాపార సంస్థలు విరాట్ తో బ్రాండింగ్ పోస్టులకు ఐదు కోట్లు వెచ్చించడానికి రెడీగా ఉన్నట్టున్నాయి.
ఇక అతడి తర్వాత ఉంది ప్రియాంక చోప్రా. ఆమె ఒక్కో బ్రాండింగ్ పోస్టుకు కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయలను చార్జ్ చేస్తూ ఉంది. ఇక శ్రద్ధాకపూర్, అలియా భట్ లు కూడా కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల స్థాయి క్లబ్ లోనే ఉన్నారు. కాస్తంత వ్యత్యాసంలో ఈ ముగ్గురు తారలూ ఒకే స్థాయి చార్జ్ చేస్తున్నారని సమాచారం. ఇక ఆ తర్వాతి స్థానంలో మరో బాలీవుడ్ నటే ఉంది. ఆమె కత్రినా కైఫ్. ఆమె ఒక్కో పోస్టుకు ఏకంగా కోటి రూపాయలు చార్జ్ చేస్తోందట.
ఇలా టాప్ లో ఉన్న వారితో మొదలుపెడితే.. సినీ, క్రికెట్ సెలబ్రిటీలందరూ తమ స్థాయికి తగ్గట్టుగా ఎంతో కొంత తీసుకుంటూ పెయిడ్ ప్రమోషన్లు చేస్తూ ఉన్నారు. ఇందు కోసం తారలు ఫాలోయర్ల సంఖ్యను పెంచుకోవడానికి తంటాలు పడుతూ ఉంటారు. ఈ ఫాలోయర్లను పెంచుకోవడం కోసమే కొందరు హీరోయిన్లు తరచూ మాల్దీవులకు వెళుతూ అక్కడ బికినీలతో ఫొటోలు దిగే పని పెట్టుకుంటూ ఉంటారు.