ఆప్ సునామీలో వీరి అడ్ర‌స్ గ‌ల్లంతు!

ఎక్క‌డైనా అధికారాన్ని అందుకుంటే.. అక్క‌డ రాజ‌కీయ సునామీలు సృష్టించ‌డం అల‌వాటుగా మారింది చీపురు పార్టీకి. గ‌తంలో ఢిల్లీలో మ‌హామ‌హుల‌ను ఓడించిన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో ఇప్పుడు అలాంటి ఫీట్ నే రిపీట్…

ఎక్క‌డైనా అధికారాన్ని అందుకుంటే.. అక్క‌డ రాజ‌కీయ సునామీలు సృష్టించ‌డం అల‌వాటుగా మారింది చీపురు పార్టీకి. గ‌తంలో ఢిల్లీలో మ‌హామ‌హుల‌ను ఓడించిన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో ఇప్పుడు అలాంటి ఫీట్ నే రిపీట్ చేసింది.

ప్ర‌త్య‌ర్థి పార్టీల సీఎం అభ్య‌ర్థుల‌ను చిత్తు చేయ‌డంలో ఆప్ మ‌రోసారి అల‌జ‌డి రేపింది. ఇది వ‌ర‌కూ ఢిల్లీలో షీలా దీక్షిత్ వంటి త‌ల‌పండిన మాజీ సీఎంను, కిర‌ణ్ బేడీ వంటి బీజేపీ సీఎం అభ్య‌ర్థిని చిత్తుగా ఓడించిన ఆప్.. పంజాబ్ లో అలాంటి త‌ర‌హాలోనే దుమ్మ రేపింది.

ఆప్ ధాటికి పంజాబ్ తాజా మాజీ సీఎం చ‌న్నీ రెండు చోట్ల పోటీ చేసి చిత్త‌య్యాడు. ఇక పంజాబ్ త‌న‌కు మించిన స‌ర్దార్జీ లేడ‌న్న‌ట్టుగా క‌ల‌రింగ్ ఇచ్చిన సిక్స‌ర్ల సిద్ధూ చిత్త‌య్యాడు.

ఆప్ దెబ్బ‌కు బెంబేలెత్తిన వారిలో వీరే కాదు.. శిరోమ‌ణి అకాళీద‌ల్ అబ్బాకొడుకులు కూడా ఉండ‌టం విశేషం. శిరోమ‌ణి అకాళీ ద‌ళ్ కురువృద్ధ నేత ప్ర‌కాశ్ సింగ్ బాద‌ల్, ఆయ‌న త‌న‌యుడు సుక్భీర్ సింగ్ బాద‌ల్ ఇద్ద‌రూ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓట‌మి పాల‌వ్వ‌డం గ‌మ‌నార్హం!

ఇక కెప్టెన్ అమ‌రీంద‌ర్ కూడా ఆప్ సునామీలో అడ్ర‌స్ లేకుండా పోయారు! స్వ‌యంగా ఎమ్మెల్యేగా కూడా ఓట‌మి పాలై..త‌న పొలిటిక‌ల్ కెరీర్ కు దాదాపు అవ‌మాన‌క‌ర‌మైన రీతిలో ముగింపును ఇచ్చారు! ఆప్ సునామీలో పంజాబ్ లో ఏకంగా ఐదు మంది సీఎం స్థాయి అభ్య‌ర్థులు అవ‌మాన‌క‌ర‌మైన ఓట‌ముల‌ను ఎదుర్కొన్నారు.