యూపీలో మరోసారి కమలం వికసించింది. యూపీ ప్రజలు మరేం చూడలేదని, కేవలం శాంతి భద్రతలనుమాత్రమే పరిగణనలోకి తీసుకున్నారని, ఎస్పీ వస్తే మళ్లీ గూండారాజ్ వస్తుందనే భయంతోనే బీజేపీకి భారీ ఎత్తున ఓటింగ్ జరిగిందనేది ప్రముఖంగా వినిపిస్తున్న విశ్లేషణ. ప్రజలకు ఈ రకంగా భరోసా ఇవ్వడంలో సమాజ్ వాదీ విజయవంతం కాలేదని స్పష్టం అవుతోంది.
మరి ఇప్పుడు యూపీలో బీజేపీ గెలిచేసింది కాబట్టి, లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకే మళ్లీ బంపర్ మెజారిటీతో అధికారం దక్కుతుందా? అనే పాయింట్ పై కూడా చర్చ జరుగుతూ ఉంది. యూపీలో బీజేపీ జెండాఎగిరింది కాబట్టి, కేంద్రంలో మళ్లీ బీజేపీ జెండానే అనే విశ్లేషణ సహజమే. ఈ విశ్లేషణకు కట్టుబడిన వారు ఇప్పుడేం చెప్పినా ఒప్పుకోరు.
అయితే బీజేపీ వ్యతిరేక దళానికి యూపీ ఎన్నికలు కొన్ని సందేశాలను ఇచ్చాయి. అందులో ముఖ్యమైనది యూపీలో బీజేపీ చెప్పుకోదగిన రీతిలో సీట్లను కోల్పోయింది! యోగి ప్రభుత్వంపై ఎన్ని ప్రశంసలు ఇప్పుడు కురుస్తున్నా.. ఈ ఎన్నికల్లో బీజేపీ కోల్పోయిన సీట్ల సంఖ్య 58! ఒక బుల్లి రాష్ట్రంలో ఉన్నన్ని అసెంబ్లీ సీట్లను బీజేపీ కోల్పోయింది.
గతంలో సునామీ సృష్టించిన రాష్ట్రంలో ఇప్పుడు తుఫానును మాత్రమే సృష్టించింది కమలదళం. బీజేపీ కోల్పోయిన సీట్లన్నింటినీ సమాజ్ వాదీ పట్టుకుంది. బీఎస్పీని కూడా మింగేసి సమాజ్ వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో ఏకంగా 81 సీట్లను పెంచుకుంది. వీటితో అధికారాన్ని అందుకోలేకపోవచ్చు గాక 81 సీట్ల బలం అయితే ఆ పార్టీకి పెరిగింది.
గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ దాదాపు 15 శాతం సీట్లను కోల్పోయింది. ఇది ఎంతో కొంత ప్రజా విశ్వాసాన్ని కోల్పోవడమే. ఇలాంటి ప్రభావాలు లోక్ సభ ఎన్నికలపై కూడా ఉండవచ్చు. అన్ని రాష్ట్రాలూ యూపీ కాదు. యూపీలో 15 శాతమైతే, మరో రాష్ట్రంలో ఈ శాతంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు కూడా!