మూవీ రివ్యూ: ఈటి

టైటిల్: ఈటి రేటింగ్: 1.5/5 తారాగణం: సూర్య, ప్రియాంక అరుళ్ మోహన్, వినయ్ రాయ్, సత్యరాజ్, రాజ్ కిరణ్ తదితరులు కెమెరా: ఆర్. రత్నవేలు ఎడిటింగ్: రూబెన్ సంగీతం: డి. ఇమ్మాన్ నిర్మాత: కళానిథి…

టైటిల్: ఈటి
రేటింగ్: 1.5/5
తారాగణం: సూర్య, ప్రియాంక అరుళ్ మోహన్, వినయ్ రాయ్, సత్యరాజ్, రాజ్ కిరణ్ తదితరులు
కెమెరా: ఆర్. రత్నవేలు
ఎడిటింగ్: రూబెన్
సంగీతం: డి. ఇమ్మాన్
నిర్మాత: కళానిథి మారన్
దర్శకత్వం: పాండిరాజ్
విడుదల తేదీ: 10 మార్చ్ 2022

తమిళంలో “ఎదర్కుం తుణిందవన్” అంటే “దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొనేవాడు” అనే అర్థం వస్తుంది. ఇతర భాషల్లో కూడా విడుదల చేయాలన్న ఆలోచనతో అన్ని చోట్లా ఒకటే టైటిల్ ఉండే విధంగా ఆ తమిళ టైటిల్ ని షార్ట్ కట్ చేసి సింపుల్ గా “ఈటి” గా పెట్టుకున్నారు. తెలుగులో “ఎవరికీ తలవంచడు” అనే టైటిల్ పెట్టుకున్నారు. కానీ షార్ట్ కట్ టైటిల్ “ఈటి”నే ఇక్కడ కూడా మెయిన్ టైటిల్. 

సూర్యకి తెలుగులో కూడా ఫాలోయింగుంది. డబ్బింగ్ చిత్రమే అయినా స్ట్రైట్ సినిమాకిచ్చినంత ప్రాధాన్యత ఇచ్చే ఫ్యాన్స్ కూడా ఉన్నారతనికి. అలాగే ప్రియాంకా అరుళ్ మోహన్ మీద ఈమధ్యన క్రేజ్ పెంచుకున్న యువ ప్రేక్షుకులు కూడా కనిపిస్తున్నారు. క్యూట్ గా ఉండే ఆమె లుక్సే అందుకు ప్రధాన కారణం. 

వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా అనగానే సినీప్రేమికుల్లో కదలిక కనిపించింది. ట్రైలర్ చూస్తే పక్కా మాస్ కమర్షియల్ చిత్రం అనే సంకేతమందింది. 

సూర్య నటించి మెప్పించిన “ఆకాశం నీ హద్దురా”, “జై భీం” రెండూ కూడా బయోపిక్ షేడ్స్ ఉన్న చిత్రాలు. ఆ రెండు ఓటీటీలోకి నేరుగా వచ్చాయి తప్ప సినిమా హాల్స్ లో విడుదల కాలేదు. చాలానాళ్ల తర్వాత సుర్య సినిమా సినిమా హాలుకి రావడం ఇదే. 

“జై భీం” లో లాయర్ చంద్రు గా డీసెంట్ గా కనిపించిన సూర్య “ఈటి”లో కూడా లాయరే. కానీ పూర్తిగా లాయర్ గా కనిపించడు. డీసెంట్ కూడా కాదు. కాసేపు పల్లెటూరి హీరోగానూ, మరి కాసేపు నల్లకోటు లాయర్ గాను కనిపిస్తాడు. 

ఈ సినిమా నచ్చాలంటే ఆడియన్స్ కి సీ సెంటర్ మైండ్సెట్ ఉండాలి. 

ఎప్పుడో 1990ల్లో వచ్చేవి ఇలాంటి మాస్ మసాలాలు. అప్పట్లో వాటిని ఇష్టపడ్డవాళ్లు కూదా ఈ ఈటి ని నొసట్లు చిట్లిస్తూ చూసి మరీ ఇంత ఔట్ డేటెడ్ గా ఉందేంటి అనుకోవచ్చు. 

అందరూ కొత్తవాళ్లు కలిసి ఏదో ప్రయోగం చేస్తే ఇలా ఉందంటే జాలి పడొచ్చు. కానీ సూర్య లాంటి అనుభవజ్ఞుడు కూడా ఇలాంటి సినిమా ఎలా చేసాడా అనిపిస్తుంది. కథనంలో ఆఖరి 30 నిమిషాలు చాలనుకుని ఒప్పేసుకున్నాడేమో. 

సైంటిస్ట్ అవుదామనుకున్న ఒక యువకుడు, లాయరయ్యి హంతకుడవడం ఇందులో చెప్పాలనుకున్న హీరో కథ. కానీ కేవలం డైలాగ్ తప్ప ఆ సైంటిస్ట్ నేపథ్యమేమీ పెద్దగా కనపడదు. లాయర్ హంతకుడవడం మాత్రమే ఉంటుంది. 

అమ్మాయిల్ని నగ్నంగా వీడియోలు తీసి ట్రాప్ చేయడం, వాళ్లని బ్లాక్ మెయిల్ చేసి రేప్ చేయడం లాంటి విషయాన్ని పాయింట్ గా తీసుకున్నారు. అలాంటి పనులు చేసే క్రిమినల్స్ ని అరెస్ట్ చేయడం కాదు చంపేయడమే నయమనుకునే ట్రైబల్ లా ని ఎంచుకున్నారు. 

సినిమా తీయడానికి, ఏ పాయింటునైనా పట్టుకోవచ్చు. అయితే ఎంత ఆసక్తికరంగా ఆ పాయింటుని కథగా మలిచారనేది అసలు విషయం. 

కమర్షియల్ ఫార్ములా కూడా కాలానుగుణంగా మారుతుంటుంది. సినిమా మొదలైన కాసేపటికి హీరో భారీ ఇంట్రడక్షన్, వెంటనే మాస్ సాంగ్, ఆ వెంటనే హీరోయిన్ కనిపిచడం, లవ్ స్టోరీ, విలన్, కాన్ ఫ్లిక్ట్, క్లైమాక్స్ ఫైట్…ఇవన్నీ మూసకొట్టుడుగా దశాబ్దాలుగా కనిపిస్తూనే ఉన్నా ట్రీట్మెంట్ ద్వారా ఇవే అంశాలని చాలా స్టైలిష్ గా చూపించొచ్చు. ఆ ప్రయత్నం జరగలేదిక్కడ. ఎక్కడో 20 ఏళ్ల క్రితం ఒకానొక ఫార్ములా చట్రంలో ఇరుక్కుపోయిన మైండ్ తో తీసినట్టుంది ఈ చిత్రం.

సాంకేతికంగా ఈ సినిమా ట్రెండ్ కు తగ్గట్టుగా అయితే లేదు. తెరమీద ఖర్చు కనపడింది కానీ కొత్త అనుభూతి కలిగించే నేపథ్య సంగీతం కానీ, పాటలు గానీ లేవు. “గుండె కరిగెనయ్యా” అంటూ ఒక పాటొస్తుంది. ఎప్పుడో శివాజిలో “పువ్వల్లే నవ్వుల్” అనే పాటని చూసి వాతలు పెట్టుకున్నట్టనిపిస్తుంది. ఆ రాజుల కాలం గెటప్పులో సూర్యని చూస్తే నవ్వొచ్చింది తప్ప వారెవా అనిపించలేదు. అలాగే 'సిల్కు చొక్కా అనే పాట మూసకి పరాకష్ట.  

కథనంలో కూడా చాలా చోట్ల కనీసమైన మెదడు కూడా వాడినట్టనిపించదు. హీరో విజిటింగ్ కార్డులో అతని మొబైల్ నంబర్ చూసిన హీరోయిన్ కి 9 అంకెలే కనపడతాయి. చాలా తెలివిగా పదో అంకె కోసం సున్నా నుంచి 9 వరకు ట్రై చేసి మొత్తానికి హీరో నంబర్ పట్టేస్తుంది. అసలు కార్డు మీద 9 అంకెలే ప్రింటైతే మిస్సైన నంబర్ పదో అంకె మాత్రమే ఎందుకవ్వాలి? ఆరో క్లాస్ పిల్లాడికి కూడా ఈ డౌటొస్తుంది చూసేటప్పుడు. ఇలాంటి అరతెలివి సీన్లవల్ల సినిమా మీద చిన్నచూపు పెద్దదవుతుందని ఎందుకు గ్రహించరో. 

కథనంలో అస్సలు కన్సిస్టెన్సీ లేని సినిమా ఇది. సూర్య రేంజుకి ఇద చాలా బ్యాడ్ ఫిల్మ్ అని చెప్పుకోవాలి. 

ప్రియాంక ఏమీ చెయ్యకపోయినా చూడ్డానికి బాగుండి ఆకట్టుకుంటుంది. అయితే ఆమె నటనలోను, డ్యాన్సులలోను ఇంకా చాలా పరిణతి సాధించాలి. సూర్య పక్కన గతంలో అనుష్క లాంటి వాళ్లు డ్యాన్సులు చేసి మెప్పించారు. వాళ్ల స్థానంలో ప్రియాంకని చూస్తే తేలిపోతున్నట్టుంది. కేవలం అందమ్మీదే కొట్టుకెళ్లిపోవచ్చు అనుకోకుండా ఆమె నటిగా చేయాల్సిన కృషి చాలా ఉంది. 

శరణ్య ఉన్నంతలో ఓవరాక్షన్ చేసి తమిళ తెరకు న్యాయం చేసిండొచ్చు కానీ తెలుగుకి మాత్రం కాదు. సత్యరాజ్ చాలా కంపోజ్డ్ గా కనిపించారు. 

అమ్మాయిల వీడియోల్ని తీయించి బ్లాక్ మెయిల్ చేసే విలన్ ని ఏదో పెద్ద మాఫియా డాన్ మాదిరిగా చూపించారు. అది కూడా అతే. 

మిగిలిన పాత్రధారుల్లో చాలామంది జూనియర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ డయలాగ్ ఆర్టిస్ట్ కి తక్కువ అన్నట్టున్నారు. 

ఉత్తరపురం, దక్షిణపురం అంటూ తెర మీద ఏదో ఆకట్టుకోని కథ జరుగుతుంటే ఏ దిక్కూ లేని ప్రేక్షకులకి మాత్రం ఈ సినిమాకొచ్చినందుకు తూర్పుకి తిరిగి దండం పెట్టే ఆలోచనలొస్తుంటాయి. 

ఫాం లో ఉన్న హీరోని నమ్ముకుని ధైర్యంగా సినిమాకెళ్లిపోవడం అన్ని సార్లూ సరైన నిర్ణయం అనిపించుకోదని నిరూపించిన సినిమా ఇది. 

బాటం లైన్: ఎదురులేని తలనొప్పి (ఈటి)