ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి ఎందుకంత ఆదరణ..?

యూపీలో వరుసగా రెండోసారి బీజేపీకి అధికారం ఖాయమైంది. యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతున్నారు. అప్పటివరకూ యూపీలో సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ మధ్య దోబూచులాడిన అధికారాన్ని 2017లో బీజేపీ…

యూపీలో వరుసగా రెండోసారి బీజేపీకి అధికారం ఖాయమైంది. యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతున్నారు. అప్పటివరకూ యూపీలో సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ మధ్య దోబూచులాడిన అధికారాన్ని 2017లో బీజేపీ కైవసం చేసుకున్న తర్వాత, మరోసారి దాన్ని కాపాడుకోవడమంటే మాటలు కాదు. 

యోగికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయంటూ మీడియా కోడై కూసినా.. యూపీ చేజారిపోతుందంటూ కథనాలు వండివార్చినా.. చివరకు యోగి సాధించాడు. ఇంతకీ బీజేపీ విజయానికి కారణాలేంటి..?

యోగి ఆదిత్యనాధ్ క్లీన్ ఇమేజ్

యోగి ఓ నియంత, యోగి ఓ నిరంకుశుడు, యోగి మైనార్టీ ద్వేషి.. ఇవన్నీ గిట్టనివారు అనే మాటలు. కానీ యోగి ఇమేజ్ మరోలా అందరికీ నచ్చింది. అవినీతి రహితుడు, కేవలం కాషాయం ధరించే నిరాడంబరుడు, ఫ్యామిలీ కోసం ఏమీ చేసుకోలేడు, కోట్లు కూడబెట్టుకోలేదు, ముఖ్యమంత్రి తోబుట్టువులు కూడా సొంత ఊళ్లో పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. 

ఇలాంటి వ్యవహారాలన్నీ చివర్లో యోగి ఇమేజ్ ని అమాంతం పెంచాయి. ఆయనకు మరోసారి ప్రజలు పట్టం కట్టేలా చేశాయి. రాష్ట్రంలో ఆయన చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు దీనికి అదనం.

బీజేపీ ప్రచార వ్యూహాలు..

యూపీ కేవలం యోగీకే కాదు, బీజేపీకి బాగా కీలకం. ఇక్కడ విజయం సాధిస్తేనే 2024 ఎన్నికల్లో అత్యథిక లోక్ సభ స్థానాలు కైవసం చేసుకోగలరు. అందుకే యోగి విజయం కోసం అధిష్టానం బరిలో దిగింది. అందరూ కలసి ప్రచారం చేశారు. ప్రధాన మంత్రి స్వయంగా చొరవ తీసుకున్నారు. చివర్లో కోట్ల రూపాయల అభివృద్ధి పథకాలను యూపీలో ప్రారంభించారు. 

ఎట్టకేలకు ప్రజల మనసు గెలిచారు. వైరి వర్గాలైన సమాజ్ వాదీ పార్టీని బాగా తొక్కిపెట్టారు. బీఎస్పీ ముందే చతికిలపడింది. కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కి పరిమితం అయింది. బీజేపీ ప్రచార వ్యూహాలతో ఇవన్నీ సాధ్యమయ్యాయి.

విడతల వారీ పోలింగ్ లో పోల్ మేనేజ్ మెంట్

పార్టీకి ఆదరణ తక్కువగా ఉంది అనుకుంటే కచ్చితంగా ఎక్కువ విడతల్లో అక్కడ పోలింగ్ జరుపుతారు. పశ్చిమ బెంగాల్ లో ఈ విధానం బెడిసికొట్టినా.. యూపీలో ఏడు విడతల్లో పోలింగ్ కి సిద్ధమైంది కేంద్రం. తొలి విడతలో పరిస్థితి అనుకూలంగా లేదని తేలడంతో.. రెండో విడత నుంచి బీజేపీ జాగ్రత్తపడింది. 

తెరవెనక ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులతో బేరసారాలు బాగానే సాగాయి. బీఎస్పీ నుంచి బీజేపీకి లోపాయికారీ మద్దతు లభించిందని సమాచారం. పోల్ మేనేజ్ మెంట్ లో బీజేపీ సక్సెస్ అయింది, ఎన్నికల్లో విజయం సాధించింది.

సింగిల్ పార్టీ

కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ఉంటే అభివృద్ధి బాగా జరుగుతుందనే నినాదంతో బీజేపీ జనాల్లోకి వెళ్లింది. యూపీలో బీజేపీ మినహా ఇంకెవరు అధికారంలోకి వచ్చినా కేంద్రం ఆర్థిక సాయం చేయదేమోననే అనుమానం జనంలో ఉంది. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే రాష్ట్రంలోనూ మరోసారి పట్టం కట్టారు యూపీ ప్రజలు.

సంస్థాగత నిర్మాణం..

పాలన యోగి చూసుకుంటే.. పార్టీని యూపీలో బీజేపీ అధినాయకత్వం విస్తరించింది. ఆమధ్య యోగి సీటు కిందకి కూడా నీళ్లొచ్చాయనే ప్రచారం జరిగింది. అప్పట్లో యోగి టీమ్ లో కీలక మార్పులు జరిగాయి. ఆయనకి ఇష్టంలేని వారికి కూడా పార్టీలో కీలక పదవులిచ్చారు. 

యోగిని కేవలం పాలనపై దృష్టిపెట్టాలని సూచించి, అధినాయకత్వం పార్టీని యూపీలో బలోపేతం చేసింది. దాని ఫలితమే ఈ సమష్టి విజయం.

హిందూ ఓట్లను సంఘటితం చేయడం

యూపీలో మైనార్టీలో యోగికి ఓటు వేసినా, వేయకపోయినా.. హిందూ ఓట్లు మాత్రం ఏ ఒక్కటీ పక్కకు పోకూడదనే పంతం పట్టింది బీజేపీ. దానికి తగ్గట్టుగానే నేతల మాటల తూటాలు పేలాయి. 

జాతీయవాదం, హిందూత్వంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అదే సమయంలో ముస్లిం ఓట్లు గుంపగుత్తగా ఎస్పీకి పడకుండా బీజేపీ అడ్డుపడింది. ముస్లిం ఓట్లను చీల్చడంతో బీజేపీ విజయం నల్లేరుపై నడక అయింది.

నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్రమోదీ యూపీ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించడంతో ఆయన కూడా ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. యూపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉదారంగా నిధులు విడుదల చేశారు. 

ప్రచారంలో యోగీతో పాటు ఆయన కూడా కష్టపడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక 10సార్లు యూపీలో పర్యటించారు.

డిజిటల్ మీడియా..

యూపీఏని వెనక్కు నెట్టి బీజేపీ అధికారంలోకి రావడానికి డిజిటల్ మీడియా ప్రచారం ఏ స్థాయిలో ఉపయోగపడిందో అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అదే డిజిటల్ మీడియాని బీజేపీ ప్రచార అస్త్రంగా మార్చుకుంది. 

యోగి, మోదీ ఫొటోలతో చేసిన ప్రచారం బాగా జనాల్లోకి వెళ్లింది. 2 పాటలు వైరల్ గా మారాయి. యోగీకి భారీ విజయం ఖాయమంటూ నెటిజన్లు చేసిన ప్రచారం ప్రభావం కూడా పోలింగ్ పై కనిపించింది. మిగతావారికి ఓటు వేస్తే ఓటు వృథా అనే స్థితికి వచ్చేశారు ఓటర్లు.