న‌వ‌జ్యోత్‌సింగ్ సిద్ధూ ర‌నౌట్‌

క్రికెట్‌లో సిక్స‌ర్ల సిద్ధూగా పేరుగాంచిన న‌వ‌జ్యోత్‌సింగ్ సిద్ధూ రాజ‌కీయ క్రీడ‌లో మాత్రం బొక్క బోర్లా ప‌డ్డారు. రాజ‌కీయాల్లో స్థిర‌త్వం లేక‌పోవ‌డం, అలాగే నోటి దురుసుత‌నంతో చెడ్డ పేరును మూట‌క‌ట్టుకున్నారు. ఈ అవ‌ల‌క్ష‌ణాలే చివ‌రికి ఎన్నిక‌ల్లో…

క్రికెట్‌లో సిక్స‌ర్ల సిద్ధూగా పేరుగాంచిన న‌వ‌జ్యోత్‌సింగ్ సిద్ధూ రాజ‌కీయ క్రీడ‌లో మాత్రం బొక్క బోర్లా ప‌డ్డారు. రాజ‌కీయాల్లో స్థిర‌త్వం లేక‌పోవ‌డం, అలాగే నోటి దురుసుత‌నంతో చెడ్డ పేరును మూట‌క‌ట్టుకున్నారు. ఈ అవ‌ల‌క్ష‌ణాలే చివ‌రికి ఎన్నిక‌ల్లో ఓట‌మిని మిగిల్చాయి. 

పంజాబ్ కాంగ్రెస్‌కు ర‌థ‌సార‌థి అయిన న‌వ‌జ్యోత్‌సింగ్ సిద్ధూ చివ‌రికి పార్టీని కాదు క‌దా, తాను కూడా విజ‌య‌ప‌థంలో న‌డ‌వ‌లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. పంజాబ్‌లో కాంగ్రెస్ ఓట‌మికి నైతిక బాధ్య‌త వ‌హిస్తూ పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి సిద్ధూ రాజీనామా చేయ‌డం గ‌మ‌నార్హం. 

అమృత్‌స‌ర్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన సిద్ధూ ఓట‌మిపాల‌య్యారు. 117 స్థానాలున్న పంజాబ్‌లో కాంగ్రెస్ 18 లోపు సీట్ల‌కే ప‌రిమితం కావ‌డం ఆ పార్టీ ప‌త‌నావ‌స్థ‌ను ప్ర‌తిబింబిస్తోంది. ఆప్ అనూహ్యంగా అధికార పీఠంపైకి దూసుకెళ్లింది. ఏకంగా 92 స్థానాల‌తో కాంగ్రెస్‌ను అధికార పీఠం నుంచి కూల‌దోసింది. 

ముఖ్య మంత్రి, కాంగ్రెస్ అభ్య‌ర్థి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సైతం రెండు చోట్ల పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు. సిద్ధూ అధికార దాహ‌మే ఆ పార్టీ కొంప ముంచింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నిక‌ల‌కు కేవ‌లం కొన్ని నెల‌ల ముందు సిద్ధూ వైఖ‌రితో ముఖ్య‌మంత్రి అమ‌రేంద‌ర్‌సింగ్‌ను కాంగ్రెస్ అధిష్టానం మార్చింది. 

త‌న‌ను సీఎం చేస్తార‌ని ఆశించిన సిద్ధూకు కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చింది. చరణ్‌జిత్ సింగ్ చన్నీని సీఎం చేసింది. ఆయ‌న కూడా తాజా ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలు కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.