తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇక దబిడి దబిడే అనే వెటకారాలు మొదలయ్యాయి. పంజాబ్‌లో ఆప్, ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరా ఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసే మెజార్టీని దక్కించుకోగా, గోవాలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి. ఇప్పటికైతే గోవాలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రాలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించనుంది.
మూడు రాష్ట్రాల్లో తామే ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసేలా స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్న తరుణంలో బీజేపీ ఢిల్లీ నేతలు స్పందించారు. భవిష్యత్ కార్యాచరణ ఎలా వుంటుందో బీజేపీ నేతలు సంకేతాలు ఇచ్చారు. వచ్చే ఏడాది ఎన్నికల జరగనున్న తెలంగాణలో పాగా వేసేందుకు అన్ని రకాల వ్యూహాలకు పదును పెట్టనున్నారు.
మరీ ముఖ్యంగా జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేయడంలో తానే కీలక పాత్ర పోషిస్తానని రెచ్చగొడుతున్న సీఎం కేసీఆర్ కథేంటో తేల్చుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. గతంలో చంద్రబాబు ఎన్నికల ముందు మోదీపై రెచ్చిపోయి, ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చింది. మోదీ, అమిత్‌షా ద్వయం దృష్టిలో పడితే మాత్రం వాళ్ల అంతు తేల్చే వరకూ వదిలి పెట్టరనే ప్రచారం ఉంది.
నోరు తెరిస్తే చాలు మోదీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించే కేసీఆర్‌ను ప్రధాన శత్రువుగానే బీజేపీ భావిస్తోంది. కేసీఆర్ పాలనలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించి బీజేపీ నూతనోత్సాహాన్ని గుండెల నిండా నింపుకుంది. ఈ రెండు చోట్ల ఓటమి టీఆర్ఎస్‌లో తెలియని భయాన్ని నింపిందనడంలో అతిశయోక్తి లేదు.
ఎన్నికల వ్యూహంలో సిద్ధహస్తుడైన కేసీఆర్‌ను మట్టి కరిపించడం అంత సులభం కాదనే వాదన లేకపోలేదు. కానీ ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టడంలో మోదీ, అమిత్‌షా రూటే సపరేట్ అని, రానున్న రోజుల్లో కేసీఆర్, టీఆర్ఎన్ నేతలకు దబిడి దబిడే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.