పంజాబ్ మినహా ఉత్తరప్రదేశ్‌తో పాటు మరో రెండు రాష్ట్రాల్లో బీజేపీ హవా చూపింది. గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలపై దృష్టి కేంద్రీకరిస్తామనేది ఆ ప్రకటన సారాంశం. తెలంగాణలో వచ్చే ఏడాది, ఏపీలో మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ విషయానికి వస్తే బీజేపీ తనకు తానుగా ఎదిగే పరిస్థితి ఇప్పటికైతే లేదు.
కానీ జనసేనాని పవన్‌కల్యాణ్‌తో బీజేపీ పొత్తులో ఉంది. అయితే క్షేత్రస్థాయిలో ఆ రెండు పార్టీలు కలిసి ప్రయాణిస్తున్న దాఖలాలు లేవు. 2024లో జనసేన-బీజేపీ కూటమి ఏపీలో అధికారాన్ని సొంతం చేసుకుంటుందని బీజేపీ నేతలు పదేపదే ప్రకటిస్తుండడం తెలిసిందే. మరోవైపు జనసేనాని మనసు మరో పార్టీ వైపు లాగుతుందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ నెల 14న పార్టీ ఆవిర్భావ సభలో భవిష్యత్ కార్యాచరణను పవన్‌కల్యాణ్ ప్రకటించనున్నారు.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలలో బీజేపీనే తిరిగి ప్రభుత్వాల్ని ఏర్పాటు చేయనుండడంతో సహజంగానే ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఉత్తరాధిలో బీజేపీ ప్రభంజనం జనసేనాని పవన్‌ను ఎటూ తేల్చుకోలేకుండా చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే తలంపుతో బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. జనసేనాని పవన్‌కల్యాణ్‌తో బీజేపీ పెద్దలు చర్చించేందుకు ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌నే తమ కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ అగ్రనేత ఒకరు చెప్పడం గమనార్హం.
తద్వారా పవన్‌కల్యాణ్ మనసులో బీజేపీ తప్ప మరో ఆలోచనకు తావు లేకుండా చేయొచ్చనేది జాతీయ పార్టీ వ్యూహం. పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన సామాజికవర్గానికి చెందిన ఓటర్లు, అలాగే భారీ సంఖ్యలో ఉన్న అభిమానులు పట్టుదలతో ఎన్నికల్లో పని చేస్తారనే ఎత్తుగడ బీజేపీ వేస్తోంది.
ఒకట్రెండు రోజుల్లో పవన్‌కల్యాణ్‌కు ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్ కాల్ వెళ్లే అవకాశాలున్నాయని బీజేపీ సీనియర్ నేత తెలిపారు. సీఎం అభ్యర్థిగా పవన్‌ను ప్రకటించి, ఇప్పటి నుంచి కార్యక్షేత్రంలో దిగితే మాత్రం ఏపీలో కథ వేరేగా ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.