ఎమ్బీయస్: ఉత్తరాఖండ్ ఎన్నికలు

ఇంకాస్సేపట్లో ఫలితాలు రాబోతున్న అసెంబ్లీలలో ఉత్తరాఖండ్ ఒకటి. రాజకీయ సుస్థిరత లేని రాష్ట్రాలలో అది ఒకటి. 2000లో రాష్ట్రం ఏర్పడిన దగ్గర్నుంచి యిప్పటివరకు 11 మంది ముఖ్యమంత్రులు మారారు. ఎన్‌డి తివారీ ఒక్కరే పూర్తికాలం…

ఇంకాస్సేపట్లో ఫలితాలు రాబోతున్న అసెంబ్లీలలో ఉత్తరాఖండ్ ఒకటి. రాజకీయ సుస్థిరత లేని రాష్ట్రాలలో అది ఒకటి. 2000లో రాష్ట్రం ఏర్పడిన దగ్గర్నుంచి యిప్పటివరకు 11 మంది ముఖ్యమంత్రులు మారారు. ఎన్‌డి తివారీ ఒక్కరే పూర్తికాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారిపోతూ వుంటుంది. 70 స్థానాల అసెంబ్లీలో 2007లో బిజెపికి 35, కాంగ్రెసుకు 21 రాగా 2012లో కాంగ్రెసుకి 32, బిజెపికి 31 వచ్చాయి. 2017 వచ్చేసరికి బిజెపికి 57, కాంగ్రెసుకు 11 వచ్చాయి. ఆ లెక్క ప్రకారం యీసారి కాంగ్రెసు గెలవాలి. కానీ బిజెపియే మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మాగ్జిమమ్ 50, మినిమమ్ 26 వస్తాయి అంటున్నారు. ఇండియా టుడే-యాక్సిస్ 36-46, టుడేస్ చాణక్య 36-50, ఎబిపి న్యూస్-సిఓటరు 26-32 వస్తాయని అంచనా వేశాయి. తక్కిన సర్వే ఫలితాలు కూడా క్రోడీకరించి ఎన్‌డిటివి యిచ్చిన అంకె 35! అదే వాస్తవమైతే 57 నుంచి 35కి పడిపోవడానికి కారణమేమిటి అనేది చెప్పడానికే యీ వ్యాసం.

గత పదిహేనేళ్లగా బిజెపికి వచ్చిన ఓట్ల శాతం చూడబోతే 2007లో 32%, 2012లో 33%, 2014లో 34%, 2017లో 47%, 2019లో 61%. అలాటప్పుడు యీసారి 50% దరిదాపుల్లో ఓట్లు తెచ్చుకుని కనీసం 50 సీట్లయినా తెచ్చుకోవాలి. కానీ తెచ్చుకుంటుందని గట్టిగా అనుకోలేక పోవడానికి కారణం, బిజెపి గత ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులను రుచి చూపించడం. తీర్థ సింగ్ రావత్‌ను బొత్తిగా నాలుగు నెలల్లోనే దింపేశారు. కాంగ్రెసు యిలాటి ప్రయోగాలే చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారం పోగొట్టుకుంది. బిజెపికి ఆ భయం లేకపోవడానికి కారణం కాంగ్రెసు అధ్వాన్న పరిస్థితి.

కాంగ్రెసుకు 2007లో 30%, 2012లో 34%, 2014లో 21%, 2017లో 34%, 2019లో 31%వచ్చాయి. అయినా యీసారి బిజెపికి గట్టి పోటీ యివ్వలేక పోవడానికి కారణం పార్టీకి స్ట్రాటజీ లేకపోవడం. అంతఃకలహాలు, ఫిరాయింపులు. నాయకుడెవరో తేల్చకపోవడం. రాష్ట్రంలో మొత్తం 79.4 లక్షల మంది ఓటర్లుంటే వారిలో 12 లక్షల మంది కొత్తగా ఓటర్లయినవారే. 60%మంది ఓటర్లు 45 ఏళ్ల లోపువాళ్లే. బిజెపి తరఫున నిలబడినవారిలో 22 మంది కొత్తవారు. వారిలో 14 మంది 45 ఏళ్ల లోపువాళ్లే. అలాటప్పుడు కాంగ్రెసు పక్షాన నాయకులుగా ముందుకు వస్తున్నది 73 ఏళ్ల హరీశ్ రావత్! అతను మూడేళ్లపాటు ముఖ్యమంత్రిగా వుండి, 2017లో రెండు చోట్ల నుంచి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయాడు. ఇప్పుడతన్ని ముఖ్యమంత్రిగా చూపటం లేదని అలిగాడు. ఎవరూ నన్ను పట్టించుకోవటం లేదంటూ పార్టీ అధిష్టానం మీద బహిరంగ విమర్శలు చేశాడు.

ఇలాటి సణుగుడు పార్టీని పక్కన పడేయాలిగా, లేదు. అలాగని ముఖ్యపాత్ర యిచ్చారా? అదీ లేదు. అతను చెప్పినవాళ్లకు టిక్కెట్లు యివ్వలేదు సరి కదా, అతనడిగిన నియోజకవర్గాన్ని యివ్వలేదు. పైగా అతనికి ప్రతిగా ప్రీతమ్ సింగ్‌ను దువ్వాడు రాహుల్. పోనీ అతనేమైనా యువకుడా? 63 ఏళ్లు! బిజెపి నుంచి ఫిరాయింపుదార్లను చేర్చుకున్నారు. టిక్కెట్లు రానందుకు కొందరు ఎదురు తిరిగి, స్వతంత్రులుగా నిలబడ్డారు. అలాటివారిలో సంధ్య అనే ఆమె హరీశ్‌కు వ్యతిరేకంగా నిలబడింది. ఆమెకు ప్రీతమ్ మద్దతు ఉందంటున్నారు. కాంగ్రెసులో ఫిరాయింపుదారుల సంఖ్యా ఎక్కువగానే వుంది. ఒకరినొకరు ఓడిద్దామని చూసుకుంటున్నారు. అందుకే విజయావకాశాలు తక్కువ.

ఉత్తరాఖండ్‌లో యువత ఓటే ఎన్నికలలో కీలకం. యువత అనగానే ఏ రాష్ట్రంలోనైనా నిరుద్యోగమే వారి ప్రధాన సమస్య. ఉత్తరాఖండ్‌లో అది మరీనూ. పర్వతప్రాంతం కావడం చేత, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కమ్యూనికేషన్ సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం చేత పరిశ్రమలు పెద్దగా వుండవు. ఉపాధి కోసం అనేకమంది వలస వెళ్లిపోవడంతో చాలా గ్రామాలు ఖాళీ అయిపోయి, ఘోస్ట్ విలేజెస్‌గా పేరుబడ్డాయి. 2011 నాటికి రాష్ట్రంలో ఏకంగా 1034 ఘోస్ట్ విలేజెస్ నమోదయ్యాయి. 2017 నాటికి మరో 734 చేరాయని రాష్ట్ర కమిషన్ తేల్చింది. ఎప్పణ్నుంచో సాగుతున్న యీ నిష్క్రమణ యిప్పుడు మరీ ఎక్కువైంది. పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి కాబట్టి టూరిజం, హాస్పిటాలిటీ పరిశ్రమ చాలామందికి ఉపాధి కల్పిస్తూ వుంటాయి.

కరోనా కారణంగా రెండేళ్లగా టూరిజం మొత్తం దెబ్బ తినిపోయింది. అందువలన, ఎన్‌ఎస్‌ఓ (నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్) డేటా ప్రకారం 2020 డిసెంబరులో ఉత్తరాఖండ్‌లో 15-29 సం.ల మధ్య వయసున్న వారిలో 27% మందికి ఉద్యోగాలు లేవు. జాతీయ సగటు 25. లాక్‌డౌన్ సమయంలో అది 38%కు చేరింది. లాక్‌డౌన్ పీరియడ్‌లో బయట రాష్ట్రాలలో వలస కార్మికులుగా పనిచేస్తూన్న 5 లక్షల మంది తిరిగి వచ్చేయడంతో నిరుద్యోగం మరీ ఎక్కువైంది.

45 ఏళ్ల వయసులో 2021 జులైలో బిజెపి మూడో ముఖ్యమంత్రిగా వచ్చిన పుష్కర్ ధామికి ఆరెస్సెస్ నుంచి వచ్చినవాడు. 2012లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు. 2017లో కూడా నెగ్గాడు. తన ప్రభావాన్ని చూపడానికి ముందే ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఎన్నికలున్న రాష్ట్రాలలో మోదీగారు వచ్చి ప్రాజెక్టులు ప్రారంభించడం రివాజే కాబట్టి యిక్కడా అదే పని చేశారు. 2021 డిసెంబరులో రూ.17,500 కోట్ల విలువైన 23 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇవేవో ముందే చేసి వుంటే ప్రజలు సంతోషించేవారు.

అనేక హిందూ పుణ్యక్షేత్రాలుండి దేవభూమిగా పేరుబడిన ఉత్తరాఖండ్‌లో ముస్లిం జనాభా 14%. హరిద్వార్, దెహ్రాదూన్, ఉద్దమ్‌సింగ్ నగర్, నైనిటాల్ ప్రాంతాల్లో వాళ్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. కాంగ్రెసు వారిని ఆకట్టుకోవడానికి ముస్లిం యూనివర్శిటీ ఏర్పాటు చేస్తానంది. దానివలన వాళ్లకి ఒరిగేదేమిటో తెలియదు. ముస్లింలకు మాత్రమే సీట్లిస్తారా? లేక వాళ్లకు ఉచితంగా విద్యాబోధన చేస్తారా? ఏది ఏమైనా యిది బిజెపికి ఉపయోగపడింది. దేవభూమిలో ముస్లిం యూనివర్శిటీట! హవ్వ! అంటూ మోదీ దగ్గర్నుంచి అందరూ గగ్గోలు పెట్టేశారు. ధామి తమను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తా జాగ్రత్త అని హెచ్చరించాడు.

ఉత్తరాఖండ్‌లో బ్రాహ్మణుల జనాభా కూడా ఎక్కువే. హరీశ్ రావత్ తను మళ్లీ ముఖ్యమంత్రి ఐతే బ్రాహ్మణుల ఆర్థిక, సామాజిక స్థితిగతులు పరిశీలించి చక్కదిద్దేందుకు కమిషన్ వేస్తానని హామీ యిచ్చాడు. అంతేకాదు, రాష్ట్రంలో అన్ని ముఖ్యప్రదేశాల్లో పరశురాముడి విగ్రహాలు పెడతామని వాగ్దానం చేశాడు. ‘పుణ్యతీర్థాలలో ఉంటే పురోహితులకు మా ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేస్తే, బిజెపి ప్రభుత్వం దాన్ని ఎత్తేసింది. దానిపై మేం చేసిన ఆందోళన చూసి భయపడి, మళ్లీ పెట్టిందనుకోండి. కానీ మళ్లీ మీరు ఎన్నుకుంటే పెన్షన్ కొనసాగిస్తుందన్న గ్యారంటీ లేదు.’ అంటున్నాడు.

బిజెపి ప్రభుత్వంపై పుణ్యక్షేత్రాల పురోహితులు, యాజమాన్యం కక్ష కట్టేశారు. కులరీత్యా ఠాకూర్ అయిన త్రివేంద్ర సింగ్ రావత్ ముఖ్యమంత్రిగా ఉండగా చార్ ధామ్ (కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి౦తో సహా 51 ఆలయాల నిర్వహణను ప్రభుత్వ అజమాయిషీలోకి తెస్తూ ఒక చట్టం తెచ్చాడు. అంతే, వాళ్లు తిరగబడి నానా హంగామా చేశారు. విశ్వహిందూ పరిషత్ నుంచి అన్నీ హిందూ సంస్థలు కదిలి వచ్చాయి. ముఖ్యమంత్రికి బిజెపి అధిష్టానం ఉద్వాసన పలకవలసి వచ్చింది. అతని తర్వాత వచ్చిన తీర్థ సింగ్ రావత్ 2021 ఏప్రిల్‌లో ఆ చట్టాన్ని రద్దు చేశాడు. పదవి పోయాక కొన్నాళ్లకు త్రివేంద్ర సింగ్ 2021 నవంబరులో కేదార్‌నాథ్‌కు వెళితే పూజారులు గుళ్లోకి రానివ్వలేదు కూడా.

కరోనా ఉధృతంగా ఉన్న రోజుల్లో కుంభమేళాను ఘనంగా నిర్వహిద్దామని ఆలయ యాజమాన్యాలు తలపెట్టాయి. కేంద్రం సరేనంది. కానీ కరోనా విజృంభించడంతో ఆపివేయమంది. అప్పుడు ఆ వర్గాలన్నీ మోదీపై విరుచుకు పడ్డాయి. హరిద్వార్ ధర్మ సంసద్‌లో జరిగిన విద్వేషపూరిత ప్రసంగాలపై ఎల్లెడలా విమర్శలు రావడంతో కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏవో కొన్ని చర్యలు చేపట్టవలసి వచ్చింది.  అది కూడా యీ వర్గాలకు నచ్చటం లేదు. ప్రాంతీయ భేదాలు కూడా బిజెపిని దెబ్బ తీయవచ్చు. ఉత్తరాఖండ్‌లో రెండు పాలనా డివిజన్లు ఉన్నాయి. 70 నియోజకవర్గాల్లో 40 ఉన్న గఢ్‌వాల్, 29 ఉన్న కుమావూ. బిజెపి అగ్రనాయకులు గఢ్‌వాల్ వాళ్లు. కాంగ్రెసు అగ్రనాయకులు కుమావూ వాళ్లు. త్రివేంద్ర రావత్ ముఖ్యమంత్రిగా వుండగా రెండు ప్రాంతాల నుంచి కొన్ని ప్రాంతాలను చీల్చి గైర్‌సైన్ అనే మూడో ప్రాంతాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడు. దాంతో కుమావూ వాళ్ల ఆగ్రహానికి గురయ్యాడు.

ఈ రెండు ప్రధాన పార్టీల ఓట్లు చీల్చడానికి, 12%ఓట్లు తెచ్చుకుంటూ గతంలో బియస్పీ ఉంటూండేది. ప్రస్తుతం యుపిలోనే అది చురుగ్గా లేదు. అందువలన యిక్కడ దాని స్థానాన్ని ఆప్ భర్తీ చేసేట్లుంది. ఆప్ తరఫున రిటైర్డ్ ఆర్మీ కల్నల్ అజయ్ కొఠియాల్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా దింపారు. ఉత్తరాఖండ్‌ నుంచి ఆర్మీకి వెళ్లినవాళ్లు ఎక్కువమంది. జాతీయవాదంతో ఆర్మీ కుటుంబాలను ఆకట్టుకుందామని బిజెపి చూస్తూ వుంటే, ఆప్ ఏకంగా ఆర్మీ మనిషినే సిఎం అభ్యర్థిగా చూపిస్తోంది. 2013లో ఉత్తరాఖండ్ వరదల సమయంలో ఆయన ఎంతో శ్రమించి, కేదార్‌నాథ్‌ను పునర్నిర్మించడానికి కృషి చేశాడు. మంచిపేరుంది. ఇప్పుడాయన నేను ఫౌజీని, అవినీతిని సహించను అనే నినాదంతో ముందుకు వస్తున్నాడు. ఇది యువతను ఆకర్షించవచ్చు. నిరుద్యోగులను ఆకర్షించడానికి ఆప్ నిరుద్యోగులకు నెలకు రూ.5వేల భృతి యిస్తామని హామీ యిచ్చింది. మహిళలకు నెలకు వెయ్యి రూపాయలట.

బిజెపి పాలన సవ్యంగా జరగలేదు కాబట్టే, అది ముఖ్యమంత్రులను మార్చవలసి వచ్చిందని అందరికీ తెలుసు. కానీ ప్రత్యామ్నాయం కావలసిన కాంగ్రెసు స్వీయ అపరాధాలతో కృంగిపోయింది. చేతులారా బిజెపిని అధికారంలోకి తెస్తోంది. ఇప్పుడీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత గాంధీల సారథ్యంలోని కాంగ్రెసును వీడకపోతే తమకు భవిష్యత్తు లేదు అని వివిధ రాష్ట్రాలలోని కాంగ్రెసు నాయకులు అనుకుని బయటకు వచ్చి ప్రాంతీయపార్టీలు పెట్టుకుంటేనే బిజెపికి ప్రత్యామ్నాయాలు తయారవుతాయి. (ఫోటో – పుష్కర్ ధామీ, హరీశ్ రావత్)  

– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2022)

[email protected]