దేశ వ్యాప్తంగా అందరి దృష్టించిన ఆకర్షించిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి వేగం పుంజుకున్నాయి. తాజాగా అందుతున్న ఫలితాల్లో బీజేపీదే హవా. మరోసారి సీఎం యోగి ఆదిత్యనాథ్కే సీఎం యోగం అయ్యే అవకాశం దక్కనుంది. గోరఖ్పూర్ నుంచి మొదటిసారిగా పోటీ చేసిన సీఎం యోగి మూడో రౌండ్ వచ్చేసరికి 12వేలకు పైగా మెజార్టీతో దూసుకెళుతున్నారు.
ఉత్తరప్రదేశ్లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు 202 సీట్లు అవసరం. ప్రస్తుతం 381 స్థానాల్లోని ఓట్ల లెక్కింపు సమాచారం అందింది. ఇందులో 260 స్థానాల్లో బీజేపీ ఆధిక్యత వైపు దూసుకెళుతోంది. సమాజ్వాదీ పార్టీ 110కి పైగా స్థానాల్లో విజయం వైపు నడక సాగిస్తోంది. దీంతో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటుకుని అధికారాన్ని హస్తగతం చేసుకుంది.
దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ప్రజల నాడి దేశం మూడ్ను తెలియజేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రైతుల ఉద్యమం, ఉత్తరప్రదేశ్లో అత్యాచారాలు, రైతులపై కేంద్ర మంత్రి కుమారుడు వాహనాన్ని నడిపి పలువురి మరణానికి కారణం కావడం తదితర అంశాలు బీజేపీ ఓటమికి కారణాలు అవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ అలాంటివేవీ పెద్దగా పని చేయలేదని తాజాగా వెలువడుతున్న ఫలితాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా యోగి ఆదిత్యనాథ్ ఎంపీగా, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా సేవలందించారు. ఉత్తరప్రదేశ్ సీఎం అయిన తర్వాత ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన మొదటిసారిగా ఎమ్మెల్యే బరిలో నిలిచి గెలుపు దిశగా పయనిస్తున్నారు. మరోసారి ఆయన ఉత్తరప్రదేశ్ సీఎం అవుతారని తాజా ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి.