మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ గట్టి పట్టుదలతో ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని మట్టి కరిపిస్తే, ఇక ఆ పార్టీకి భవిష్యత్ ఉండదనేది వైసీపీ అంచనా. ఎందుకంటే చంద్రబాబుకు వయసు పైబడుతున్న దృష్ట్యా, పార్టీపై పట్టు ఉండదని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
చంద్రబాబు రాజకీయ వారసుడు లోకేశ్‌కు అంత సీన్ లేదనేది టీడీపీ శ్రేణులు కూడా చెప్పే వాస్తవం. వైసీపీ అనుబంధ విభాగాల ఇన్చార్జ్ బాధ్యతలు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అప్పగించిన నేపథ్యంలో, పార్టీపై పూర్తి స్థాయి దృష్టి సారించారు.
ఈ నేపథ్యంలో బూత్‌లెవెల్ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేసేందుకు మార్పులు, చేర్పులకు వైసీపీ అధిష్టానం చకచకా పావులు కదుపుతోంది. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా తమకు ఎలాంటి ప్రయోజనం లేదని కార్యకర్త మొదలుకుని నాయకుల వరకూ అధికార పార్టీలో తీవ్రమైన అసంతృప్తి ఉందనే ప్రచారం జరుగుతోంది.
పార్టీలోని అసంతృప్తిని చల్లార్చకపోతే ఎన్నికల్లో నష్టపోతామనే హెచ్చరికలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి వెళ్లాయి. దీంతో ఆయన దిద్దుబాటు చర్యలు చేపట్టారు. వైసీపీలోని వివిధ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తల మనోభావాలను తెలుసుకునేందుకు విజయసాయిరెడ్డి విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ పరంపరలో పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో బూత్ కమిటీల బలోపేతంపై పార్టీ పెద్దలు దృష్టి పెట్టారు. 2019 ఎన్నికల ప్రాతిపదికన పార్టీ వద్ద ఉన్న నియోజకవర్గ బూత్ కమిటీలను ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు సంబంధిత జిల్లాల ఇన్‌చార్జ్‌లు పంపుతున్నారు.
వాటిని పరిశీలించి సమర్ధులైన వారితో మార్పులు చేర్పులు చేసి వారం రోజుల లోపు కొత్త జాబితాను తిరిగి పార్టీ కేంద్ర కార్యాలయ ఈ-మెయిల్ ఐడికి పంపాల్సిందిగా ఇన్‌చార్జ్‌లు కోరుతున్నారు. అధికారం వచ్చిన తర్వాత కొత్త వాళ్ల చేరిక, అలాగే అసంతృప్తులను బుజ్జగించి, మునుపటిలా యాక్టీవ్ చేయాలనే తలంపుతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఉన్నట్టు సమాచారం.
ఏది ఏమైనా రెండేళ్లలో జరగబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే అధికార పార్టీ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోందని ఈ చర్యల ద్వారా తెలుస్తోంది.